Updated : 08 Aug 2022 08:13 IST

విదేశీ విద్యకు ఎన్ని కష్టాలో!

కొవిడ్‌ బ్యాచ్‌ 12వ తరగతి విద్యార్థుల తిప్పలు
పరీక్ష ఫలితాలు ఆలస్యం.. వీసాలు కనాకష్టం
సెమిస్టర్‌ ఆసన్నమవుతున్నా ఖరారుకాని ప్రవేశాలు

దిల్లీ: రెండేళ్లు ఆన్‌లైన్‌ చదువులు, ఆలస్యంగా జరిగిన పరీక్షలు, ఇప్పుడు వీసాల కోసం ఎదురుచూపులు, చివరి నిమిషంలో భారీగా పెరిగిన విమాన టికెట్ల ధరలతో విదేశాల్లో చదవాలనుకునే విద్యార్థులు నానా కష్టాలు పడుతున్నారు. ఈ సంవత్సరమే 12వ తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులకు ఈ తిప్పలు ఎక్కువగా ఉన్నాయి. కొవిడ్‌ కారణంగా పాఠశాలలు మూసేయడం చాలా ఇబ్బంది పెట్టింది. ‘కొవిడ్‌ బ్యాచ్‌’ విద్యార్థులను విదేశాలకు పంపాలనుకున్న తల్లిదండ్రుల ఆశలపై నీళ్లు చల్లింది. తమ బ్యాచ్‌కి మొదటి నుంచి అడ్డంకులే ఎదురయ్యాయని, పరీక్షలను రెండు టెర్మ్‌లుగా విభజించడం ఇదే మొదటిసారని రాధా ఓసన్‌ అనే విద్యార్థిని అన్నారు. అసలు ఫలితాలు ఎలా ఇస్తారో కూడా తెలియలేదని, రెండో టెర్మ్‌ బాగా ఆలస్యం కావడంతో ఫలితాలూ ఆలస్యంగా వెలువడ్డాయని చెప్పారు. ఆమె కెనడాలోని బ్రిటిష్‌ కొలంబియా యూనివర్సిటీలో సైకాలజీ చదవాలని అనుకున్నారు. ఫలితాలు ప్రకటించినా.. సర్టిఫికెట్లు రావడం ఆలస్యమై వీసా కోసం చాలా కష్టపడాల్సి వచ్చిందని, చిట్టచివరి నిమిషంలో తప్ప విమాన టికెట్లు తీసుకోలేకపోయామని ఆమె తెలిపారు. ఇక తాను వెళ్లడానికి రెండు వారాలే మిగిలినా, ఇప్పటికీ బోర్డు నుంచి తుది సర్టిఫికెట్‌ రాలేదని.. ఇలాంటి పరిస్థితి తమను తీవ్ర ఒత్తిడిలోకి నెట్టేస్తోందని చెప్పారు.

సిడ్నీలోని యూనివర్సిటీ ఆఫ్‌ న్యూసౌత్‌వేల్స్‌లో కంప్యూటర్‌ సైన్స్‌ చదవాలనుకున్న 19 ఏళ్ల అఖిలేశ్‌ కౌశిక్‌ది మరో కథ. తనకు అసలు పరీక్ష ఫలితాలు ఎప్పుడు వెల్లడిస్తారో ఇంకా తెలియనందున తాను యూనివర్సిటీకి, వీసాకూ దరఖాస్తు చేయలేదని తెలిపారు. ఈ నెలాఖరులో మొదలయ్యే సెమిస్టర్‌లో చేరుతానో లేదో కూడా ఇంకా స్పష్టత లేదన్నారు.

లండన్‌లోని కింగ్స్‌ కాలేజిలో తన కుమార్తెను చదివించాలనుకున్న ఓ తండ్రి మాత్రం కాస్త ఊరటగా ఉన్నారు. కెనడా వెళ్లడానికి విద్యార్థి వీసా చాలా కష్టం కావడంతో చివరి నిమిషంలో బ్రిటన్‌కు మారామని ఆయన చెప్పారు. నేరుగా వీసా ఇస్తామని మిలియన్ల కొద్దీ కెనడియన్‌ డాలర్లు తీసుకున్నా.. ప్రయాణానికి నాలుగు వారాల ముందు కూడా ఇంకా వీసా రాలేదని, అత్యవసరంగా కలగజేసుకోవాలంటూ కెనడా, భారత ప్రధానులను ట్యాగ్‌ చేసి మరో తండ్రి ట్వీట్‌ చేశారు.

2021లో 13.24 లక్షల మంది భారతీయ విద్యార్థులు విదేశాల్లో ఉన్నత విద్యకు వెళ్లారు. వారిలో అమెరికాకు 4.65 లక్షల మంది, కెనడాకు 1.83 లక్షల మంది, యూఏఈకి 1.64 లక్షల మంది, ఆస్ట్రియాకు 1.09 లక్షల మంది, మిగిలినవారు ఇతర దేశాలకు వెళ్లారు. 2021-22 విద్యాసంవత్సరానికి సీబీఎస్‌ఈ, సీఐఎస్‌సీఈ బోర్డుల పరీక్షలను రెండు టెర్మ్‌లుగా విభజించారు. తొలి టెర్మ్‌ గత సంవత్సరం నవంబరు-డిసెంబరు నెలల్లోను, రెండో టెర్మ్‌ మే-జూన్‌ నెలల్లోను నిర్వహించారు. సీబీఎస్‌ఈ ఫలితాలను జులై 22న, సీఐఎస్‌సీఈ ఫలితాలను జులై 24న విడుదల చేశారు. సాధారణంగా ఫిబ్రవరి-మార్చిలో పరీక్షలు నిర్వహించి, మేలో ఫలితాలు విడుదల చేస్తారు. అప్పుడైతే ఆగస్టు ప్రవేశాలకు సులభంగా ఉండేది. ఫలితాలు ఆలస్యం కావడంతో విదేశీ విద్యకు వెళ్లాలనుకునే విద్యార్థులకు ఇబ్బందులు తప్పడం లేదు.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని