Updated : 08 Aug 2022 06:25 IST

Kishanreddy: గూగుల్‌ సహాయంతో స్మారక కట్టడాల సరిహద్దుల మ్యాపింగ్‌

కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి వెల్లడి

దిల్లీ: దేశంలోని కేంద్ర ప్రభుత్వ రక్షణలో ఉన్న 3,600కుపైగా స్మారక కట్టడాల భధ్రత కోసం, ఆక్రమణలకు గురవకుండా పరిరక్షించేందుకు వాటి సరిహద్దులను డిజిటల్‌ మ్యాపింగ్‌ చేసేందుకు కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వశాఖ ఓ ప్రణాళిక రచిస్తోంది. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వానికి గూగుల్‌ సహకరిస్తుందని, ఈ మేరకు సాంకేతిక దిగ్గజంతో సంప్రదింపులు జరుపుతున్నామని కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి తెలిపారు. దేశంలో మొత్తం 3,693 వారసత్వ స్థలాలు కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వశాఖ పరిధిలోని ఆర్కియాలజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా రక్షణలో ఉన్నాయి. ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా శుక్రవారం రాత్రి ఇక్కడి సుందర్‌ నర్సరీలో నిర్వహించిన కార్యక్రమంలో గూగుల్‌-సాంస్కృతిక శాఖ మధ్య దశాబ్ద కాలంగా ఉన్న భాగస్వామ్యాన్ని కొనసాగిస్తూ ‘ఇండియా కి ఉడాన్‌’ ప్రాజెక్టును ఆవిష్కరించారు. గూగుల్‌ ఆర్ట్స్‌ అండ్‌ కల్చర్‌ అమలుచేస్తున్న ఈ ప్రాజెక్టు ద్వారా దేశం సాధించిన విజయాలను స్మరించుకోనున్నారు. ‘ఈ 75 ఏళ్లకుపైగా కాలంలో.. భారత సుదృఢ, శాశ్వత స్ఫూర్తి’ అనే ఇతివృత్తంతో దీనిని చేపడుతున్నారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. దేశంలో కేంద్ర ప్రభుత్వ రక్షణలో ఉన్న 3,600కుపైగా స్మారక కట్టడాల సరిహద్దులను డిజిటల్‌ మ్యాపింగ్‌ చేసేందుకు సాంస్కృతిక మంత్రిత్వశాఖకు గూగుల్‌ సహకరిస్తుందని తెలిపారు. దానివల్ల ఆయా స్థలాల్లో ఆక్రమణలు చోటుచేసుకుంటున్నాయా? అనేది మరింత మెరుగ్గా తనిఖీ చేయడానికి వీలవుతుందన్నారు. దేశంలోని అత్యంత అరుదైన పురాతన పత్రాలను డిజిటైజేషన్‌ చేసేందుకు కూడా గూగుల్‌ సహకరిస్తుందని వెల్లడించారు. ‘‘స్మారక కట్టడాలు, చారిత్రక ప్రదేశాలను పరిరక్షించేందుకు పెద్దఎత్తున మానవ వనరులు అవసరం అవుతున్నాయి. కాబట్టి సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో మనం ఈ స్థలాల సరిహద్దులను సులువుగా మ్యాపింగ్‌ చేయడంతోపాటు, ఆక్రమణలను తనిఖీ చేయవచ్చు’’ అని కిషన్‌రెడ్డి చెప్పారు.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని