Parliament: పార్లమెంటు నిరవధిక వాయిదా

పార్లమెంటు ఉభయసభలు సోమవారం నిరవధికంగా వాయిదా పడ్డాయి. ముందు నిర్ణయించిన ప్రకారం ఈ నెల 12వ తేదీ వరకు వర్షాకాల సమావేశాలు కొనసాగాల్సి ఉన్నాయి. ఆర్బిట్రేషన్‌ బిల్లు,

Updated : 09 Aug 2022 05:57 IST

 4 రోజుల ముందే ముగిసిన సమావేశాలు

శిలాజేతర ఇంధనాల బిల్లుకు లోక్‌సభ ఆమోదం

దిల్లీ: పార్లమెంటు ఉభయసభలు సోమవారం నిరవధికంగా వాయిదా పడ్డాయి. ముందు నిర్ణయించిన ప్రకారం ఈ నెల 12వ తేదీ వరకు వర్షాకాల సమావేశాలు కొనసాగాల్సి ఉన్నాయి. ఆర్బిట్రేషన్‌ బిల్లు, ఇంధన బిల్లు వంటివి ఆఖరి రోజున లోక్‌సభ ఆమోదం పొందాయి. రాజ్యసభ ఆమోదంతో గతిశక్తి బిల్లు పార్లమెంటు గడప దాటింది. నూతన రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతిని ఈ సమావేశాల్లోనే సభ్యులు ఎన్నుకున్నారు. ధరల పెరుగుదల, దర్యాప్తు సంస్థలను అధికార పార్టీ దుర్వినియోగం చేయడం వంటి అంశాలపై విపక్షాల నిరసనలతో ఉభయసభలు హోరెత్తాయి. కాంగ్రెస్‌ సభ్యుడు అధీర్‌ రంజన్‌ చౌధరి చేసిన వ్యాఖ్యలు ఉభయపక్షాల నడుమ వాగ్వాదానికి, సభల వాయిదాకు దారితీశాయి.

విపక్షాల సవరణలకు తిరస్కరణ

ఈసారి సమావేశాల్లో లోక్‌సభలో 48% ఉత్పాదకత నమోదైంది. ఇథనాల్‌, గ్రీన్‌ హైడ్రోజన్‌ వంటి శిలాజేతర ఇంధనాల వాడకాన్ని ప్రోత్సహించడానికి ఉద్దేశించిన బిల్లును లోక్‌సభ సోమవారం ఆమోదించింది. విపక్షాలు ప్రతిపాదించిన సవరణల్ని తిరస్కరించింది. ఇంధన వినియోగ ప్రమాణాలను చేరుకోవడంలో వాహనాలు విఫలమైతే తయారీదారులకు జరిమానాలు విధించడం వంటివి ఈ బిల్లులో ఉన్నాయి. ‘న్యూదిల్లీ అంతర్జాతీయ మధ్యవర్తిత్వ కేంద్రం’ పేరును ‘భారత అంతర్జాతీయ మధ్యవర్తిత్వ కేంద్రం’ (ఇండియా ఇంటర్నేషనల్‌ అర్బిట్రేషన్‌ సెంటర్‌)గా మార్చేందుకు ప్రవేశపెట్టిన బిల్లును కూడా లోక్‌సభ ఆమోదించింది. వివాదాస్పదమైన విద్యుత్తు సవరణ బిల్లు-2022ను విపక్షాల నిరసనల మధ్య విద్యుత్తు మంత్రి ఆర్‌.కె.సింగ్‌ లోక్‌సభలో ప్రవేశపెట్టారు. రైతులకు ఉచిత విద్యుత్తు కొనసాగుతుందనీ, రాయితీలను ఉపసంహరించబోమని ఆయన స్పష్టంచేశారు.

గతిశక్తి బిల్లుకు ఓకే

జాతీయ రైలు-రవాణా విశ్వవిద్యాలయం పేరును గతిశక్తి విశ్వవిద్యాలయంగా మార్చేందుకు ఉద్దేశించిన కేంద్ర విశ్వవిద్యాలయాల (సవరణ) బిల్లును పార్లమెంటు ఆమోదించింది. పార్లమెంటు సమావేశాలు కొనసాగుతున్న సమయంలోనే రాజ్యసభ విపక్ష నేత మల్లికార్జున ఖర్గేకు ఈడీ సమన్లు జారీ చేయడంపై కాంగ్రెస్‌ మండిపడింది. ఇది పార్లమెంటును, ఎంపీలను అవమానించడమేనని, ఇలాంటిది మళ్లీ జరగకుండా సభాపతులు చర్యలు చేపట్టాల్సిన సమయం ఆసన్నమైందని పేర్కొంది. ఖర్గేని వేధించడానికే సమన్లు ఇచ్చారని పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్‌ ఒక ప్రకటనలో ఆరోపించారు.

కొత్త ఐఐటీల యోచన లేదు: కేంద్రం

దేశంలో ఎక్కడా కొత్తగా ఐఐటీ ఏర్పాటుచేసే యోచన లేదని కేంద్ర విద్యాశాఖ లోక్‌సభకు రాతపూర్వక సమాధానంలో తెలిపింది. రాజ్యసభలో అంతరాయాలతో ఈసారి 47 గంటలు వృథా అయ్యాయి.


విపక్ష ఎంపీని మంత్రి పిలవడంపై స్పీకర్‌ అభ్యంతరం

ప్రశ్నోత్తరాల సమయంలో విపక్ష ఎంపీ ఒకరు కేంద్ర మంత్రి రావ్‌ ఇంద్రజీత్‌ సింగ్‌ వద్దకు వెళ్లడాన్ని స్పీకర్‌ ప్రశ్నించారు. జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్‌ గురించి ప్రభుత్వ వైఖరిని ప్రైవేటుగా వివరించడానికి తృణమూల్‌ ఎంపీ సౌగతారాయ్‌ని మంత్రి పిలిచారు. స్పీకర్‌ దానిని గమనించి, విషయం తెలుసుకున్నారు. తన అనుమతి లేకుండా మంత్రులు ఏ సభ్యుడినీ పిలవకూడదని ఆక్షేపించారు.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని