Published : 09 Aug 2022 06:08 IST

సంక్షిప్త వార్తలు

సంజయ్‌ రౌత్‌కు 14 రోజుల జ్యుడీషియల్‌ కస్టడీ

ముంబయి: పాత్రాచాల్‌ కుంభకోణంతో ముడిపడిన నగదు అక్రమ చలామణి కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) అరెస్టు చేసిన శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌(60)కు ముంబయిలోని ప్రత్యేక న్యాయస్థానం సోమవారం 14 రోజుల జ్యుడీషియల్‌ కస్టడీ విధించింది. ఇంటి నుంచి ఆహారం, ఔషధాలు తెప్పించుకునేందుకు అనుమతించింది. ప్రత్యేక పడక కోసం చేసిన విజ్ఞప్తిని మాత్రం తోసిపుచ్చింది. నిబంధనల ప్రకారం జైలు అధికారులు పడక విషయమై చర్యలు చేపడతారని న్యాయమూర్తి పేర్కొన్నారు. ఈ నెల ఒకటో తేదీన ఎంపీని ఈడీ అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఆయన ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ కస్టడీలో ఉన్నారు. ఆ గడువు సోమవారం ముగియడంతో సంజయ్‌ రౌత్‌ను పీఎంఎల్‌ఏ కోర్టు న్యాయమూర్తి ఎంజీ దేశ్‌పాండే ఎదుట హాజరు పరిచారు. మరోవైపు, సంజయ్‌ రౌత్‌ కస్టడీ పొడిగింపునకు సంబంధించి ఈడీ తాజాగా ఎలాంటి విజ్ఞప్తీ చేయలేదు.


యూజీసీ-నెట్‌ రెండో దశ పరీక్షలు వాయిదా

దిల్లీ: యూనివర్శిటీ గ్రాంట్స్‌ కమిషన్‌- నేషనల్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ రెండో దశ పరీక్షలు వాయిదా పడ్డాయి. ముందుగా ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం.. ఈ నెల 12, 13, 14 తేదీల్లో పరీక్షలు జరగాల్సి ఉంది. ‘‘యూజీసీ-నెట్‌ రెండో దశ పరీక్షలు ఈ నెల 12, 13, 14 తేదీల్లో నిర్వహించాలని ముందుగా నిర్ణయించాం. ఇప్పుడు ఈ పరీక్షలను వచ్చే నెల(సెప్టెంబరు) 20 నుంచి 30  మధ్య నిర్వహిస్తాం’’ అని యూజీసీ ఛైర్మన్‌ జగదీశ్‌ కుమార్‌ తెలిపారు.


రాజస్థాన్‌లో ఆలయం వద్ద తొక్కిసలాట.. ముగ్గురి మృతి

సీకర్‌ : రాజస్థాన్‌ రాష్ట్రం సీకర్‌ జిల్లాలోని ఖాటూ శ్యామ్‌జీ ఆలయం వద్ద సోమవారం ఉదయం జరిగిన తొక్కిసలాటలో ముగ్గురు మహిళలు మృతిచెందగా.. మరో నలుగురికి గాయాలయ్యాయి. ఆలయం తలుపులు తెరవగానే వరుసల్లో వేచి ఉన్న భక్తులు ఒక్కసారిగా తోసుకురావడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆదివారం రాత్రి ఆలయ తలుపులు మూసివేసే సమయానికి సుమారు లక్ష మంది ప్రధాన గేటు వద్ద ఉన్నట్లు సీకర్‌ జిల్లా కలెక్టర్‌ అవిచల్‌ చతుర్వేది తెలిపారు.


స్వల్పంగా తగ్గిన కరోనా కేసులు

దిల్లీ: దేశంలో కొవిడ్‌-19 కొత్త కేసులు స్వల్పంగా తగ్గాయి. తాజాగా (ఆదివారం ఉదయం 8 గంటల నుంచి సోమవారం ఉదయం 8 గంటల వరకు) 16,167 మందికి వైరస్‌ సోకింది. అంతకుముందు రోజు ఈ సంఖ్య 18,738గా నమోదైన సంగతి తెలిసిందే. కరోనాతో పోరాడుతూ తాజాగా41 మంది మరణించారు. వీటిలో 15 మరణాలు ఒక్క కేరళలోనే సంభవించాయి. మొత్తం కేసుల సంఖ్య 4,41,61,899కి, మొత్తం మరణాల సంఖ్య 5,26,730కి చేరింది. క్రియాశీలక కేసుల సంఖ్య 1,35,510గా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది. రోజువారీ పాజిటివీటీ రేటు 6.14 శాతంగా నమోదైంది.


బొగ్గు కుంభకోణం కేసులో గుప్తాకు మూడేళ్ల జైలు శిక్ష

దిల్లీ: యూపీఏ హయాంలో జరిగిన బొగ్గు కుంభకోణం కేసులో కేంద్ర బొగ్గు శాఖ మాజీ కార్యదర్శి హెచ్‌.సి.గుప్తాకు దిల్లీ హైకోర్టు మూడేళ్ల జైలు, రూ.లక్ష జరిమానా విధించింది. ఇదే కేసులో బొగ్గుశాఖ మాజీ సంయుక్త కార్యదర్శి కె.ఎస్‌.క్రోఫాకు రెండేళ్ల జైలు, రూ.50 వేల జరిమానా పడింది. మహారాష్ట్రలో లోహారా ఈస్ట్‌ కోల్‌ బ్లాక్‌ కేటాయింపుల్లో అవినీతికి పాల్పడినందుకు న్యాయస్థానం వీరిని దోషులుగా ప్రకటించి.. శిక్షలు ఖరారు చేసింది. తప్పుడు ధ్రువపత్రాలు చూపి కేటాయింపులు సొంతం చేసుకున్న సంస్థ యజమాని ముకేశ్‌ గుప్తాకు న్యాయస్థానం నాలుగేళ్ల శిక్ష విధించింది. 2005-2011 మధ్య జరిగిన బొగ్గు గనుల కేటాయింపుల్లో నిందితులు.. భారత ప్రభుత్వాన్ని మోసం చేశారని సీబీఐ కేసులు పెట్టింది.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని