Government Job: తల్లీ కుమారుడికి ఒకేసారి సర్కారు కొలువు

పదో తరగతి చదువుతున్న కుమారుడు చదువుపై మరింత శ్రద్ధ చూపేలా చేసేందుకు ఆమె పుస్తకాలు చదవడం మొదలుపెట్టారు. అలా ఆసక్తి పెంచుకుని.. కేరళ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (పీఎస్‌సీ)

Updated : 09 Aug 2022 08:27 IST

మలప్పురం: పదో తరగతి చదువుతున్న కుమారుడు చదువుపై మరింత శ్రద్ధ చూపేలా చేసేందుకు ఆమె పుస్తకాలు చదవడం మొదలుపెట్టారు. అలా ఆసక్తి పెంచుకుని.. కేరళ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (పీఎస్‌సీ) పరీక్షలకు హాజరయ్యేందుకు శిక్షణ తీసుకోవడం ప్రారంభించారు. ఈ క్రమంలో తొమ్మిదేళ్ల తర్వాత కుమారుడితో కలిసి ఆమె ప్రభుత్వ ఉద్యోగంలో చేరనున్నారు. ఈ మేరకు 42 ఏళ్ల బిందు లాస్ట్‌ గ్రేడ్‌ సర్వెంట్స్‌ (ఎల్‌జీఎస్‌) ఉద్యోగం కోసం నిర్వహించిన పోటీ పరీక్షలో 92వ ర్యాంకు సాధించగా, 24 ఏళ్ల ఆమె కుమారుడు లోవర్‌ డివిజనల్‌ క్లర్క్‌ (ఎల్‌డీసీ) ఉద్యోగం కోసం నిర్వహించిన పోటీ పరీక్షలో 38వ ర్యాంకు సాధించాడు. తన కుమారుడు పదో తరగతి చదువుతున్న సమయంలో అతడిని ప్రోత్సహించేందుకు తానూ చదవడం మొదలు పెట్టానని ఆ తర్వాత ఓ కోచింగ్‌ కేంద్రంలో చేరానని బిందు చెప్పారు. డిగ్రీ అయిన తర్వాత తన కుమారుడిని సైతం తానుచేరిన కోచింగ్‌  కేంద్రంలోనే చేర్పించినట్లు వివరించారు. ఇప్పటి వరకు ఇద్దరం మూడు సార్లు ప్రయత్నించామని, చివరకు నాలుగో ప్రయత్నంలో విజయం సాధించామని వెల్లడించారు. తన లక్ష్యం ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్‌ కావడం అని ఈ సందర్భంగా ఆమె స్పష్టంచేశారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న తనను స్నేహితులు, శిక్షణ కేంద్రంలోని గురువులు, కుమారుడు ఎంతగానో ప్రోత్సహించారని చెప్పారు. తాను తల్లితో కలిసి చదువుకునే సమయంలో ఇద్దరం వివిధ అంశాలపై చర్చించుకునే వారమని బిందు కుమారుడు తెలిపారు. ‘‘నేను ఎక్కువగా ఒంటరిగా చదువుకోవాలని భావించేవాడిని. మా అమ్మ అస్తమానూ చదివేది కాదు. అంగన్‌వాడీ పనులు ముగిశాకే చదువుకునేది’’ అని వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని