సమాజంలోని అన్ని వర్గాలను ఏకం చేసిన ‘క్విట్‌ ఇండియా’

నాటి క్విట్‌ ఇండియా ఉద్యమం సమాజంలోని అన్ని వర్గాల ప్రజలను ఏకం చేసిందని ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం పేర్కొన్నారు. మహాత్ముడి పిలుపును అందుకుని బ్రిటిష్‌ పాలనకు వ్యతిరేకంగా 1942లో ఉవ్వెత్తున ఎగిసిన క్విట్‌ ఇండియా

Updated : 10 Aug 2022 06:36 IST

నాటి ఉద్యమంలో పాల్గొన్నవారిని స్మరించుకున్న ప్రధాని

దిల్లీ: నాటి క్విట్‌ ఇండియా ఉద్యమం సమాజంలోని అన్ని వర్గాల ప్రజలను ఏకం చేసిందని ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం పేర్కొన్నారు. మహాత్ముడి పిలుపును అందుకుని బ్రిటిష్‌ పాలనకు వ్యతిరేకంగా 1942లో ఉవ్వెత్తున ఎగిసిన క్విట్‌ ఇండియా ఉద్యమంలో పాల్గొన్న స్వాతంత్య్ర సమరయోధులను ప్రధాని స్మరించుకున్నారు. బాపూజీ నాయకత్వంలో స్వాతంత్య్ర సంగ్రామాన్ని ఈ ఉద్యమం బలోపేతం చేసిందని ఆయన ట్వీట్‌ చేశారు. ‘మన జాతీయోద్యమానికి ఆగస్టు 9 ఓ ఉజ్వల చిహ్నంగా మారింది’ అంటూ ప్రముఖ సోషలిస్ట్‌ నేత జయప్రకాశ్‌ నారాయణ్‌ చేసిన వ్యాఖ్యను ప్రధాని ఈ సందర్భంగా ఉటంకించారు. ‘‘గాంధీజీ నింపిన స్ఫూర్తితో జయప్రకాశ్‌ నారాయణ్‌, డాక్టర్‌ లోహియా వంటి గొప్ప నేతలు సహా సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు క్విట్‌ ఇండియా ఉద్యమంలో పాలుపంచుకున్నారు’’ అని మోదీ పేర్కొన్నారు. ముంబయిలో క్విట్‌ ఇండియా ఉద్యమం ప్రారంభం సందర్భంగా గాంధీజీ పాల్గొన్న ఫొటోను కూడా ప్రధాని పోస్ట్‌ చేశారు.

స్వాతంత్య్రాన్ని కాపాడుకుందాం : సోనియా

‘‘మన సర్వశక్తులు ఒడ్డి దేశ స్వాతంత్య్రాన్ని కాపాడుకోవాలి’’ అని కాంగ్రెస్‌ అధినాయకురాలు సోనియా గాంధీ ప్రజలకు పిలుపునిచ్చారు. క్విట్‌ ఇండియా ఉద్యమ వార్షికోత్సవం సందర్భంగా మంగళవారం ఆమె ఈమేరకు సందేశం ఇచ్చారు. ‘‘దేశ స్వాతంత్య్రం కోసం లక్షలాదిగా ప్రజలు చేసిన త్యాగాలను మనం మరువరాదు’’ అని పేర్కొన్నారు.

ఆర్‌ఎస్‌ఎస్‌ నాడు బ్రిటిష్‌కు సహకరించింది : కాంగ్రెస్‌

క్విట్‌ ఇండియా ఉద్యమాన్ని స్మరించుకునే సందర్భంగా.. కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌ (ఆర్‌ఎస్‌ఎస్‌)పై విమర్శలు చేసింది. ‘‘ఆర్‌ఎస్‌ఎస్‌ నాటి ఉద్యమాన్ని బహిష్కరించడమే కాకుండా బ్రిటిష్‌కు క్రియాశీలంగా సహకరించింది’’ అని ట్విటర్‌లో కాంగ్రెస్‌ విమర్శించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని