Published : 11 Aug 2022 05:25 IST

నేర నిర్ధారణ జరిగిన ప్రజాప్రతినిధులపై జీవితకాల నిషేధం

పిల్‌ విచారణకు సీజేఐ జస్టిస్‌ ఎన్‌.వి.రమణ సమ్మతి

దిల్లీ: నేర సంబంధ కేసుల్లో శిక్షపడిన చట్టసభల సభ్యులను అనర్హులుగా ప్రకటించడంతో పాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా జీవితకాల నిషేధం విధించాలన్న పిల్‌ను విచారణకు చేపట్టేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. నేర నిరూపణ జరిగిన వ్యక్తులను శిక్షించడంలో ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజాప్రతినిధుల మధ్య తీవ్ర తారతమ్యత ఉంటుందన్న పిటిషనర్‌ వాదనలను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ నేతృత్వంలోని ధర్మాసనం పరిగణనలోకి తీసుకుంది. ఈ కేసు విచారణకు తేదీని నిర్ణయిస్తామని తెలిపింది. జస్టిస్‌ కృష్ణమురారి, జస్టిస్‌ హిమా కోహ్లి ఈ ధర్మాసనంలో సభ్యులుగా ఉన్నారు. ఒక పోలీస్‌ కానిస్టేబుల్‌కు నేర సంబంధిత కేసులో శిక్ష పడితే అతను శాశ్వతంగా ఉద్యోగాన్ని కోల్పోతాడని, అదే ఒక ప్రజాప్రతినిధి శిక్ష పూర్తయిన ఆరేళ్ల తర్వాత మళ్లీ చట్టసభలకు ఎన్నికవ్వడానికి అర్హుడవుతారని పిటిషనర్‌ అశ్వినీ ఉపాధ్యాయ పేర్కొన్నారు. ఇందుకు అవకాశం కల్పిస్తున్న ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్‌ 8(1) చట్టబద్ధతనూ పిటిషనర్‌ ప్రశ్నించారు. ప్రజాప్రతినిధులపై నమోదైన కేసుల సత్వర విచారణకు దేశంలో ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేయాలన్న పిటిషన్‌ కూడా సర్వోన్నత న్యాయస్థానం పరిశీలనలో ఉన్న విషయం తెలిసిందే.

కేసుల అత్యవసర ప్రస్తావనకు సీనియర్లను ప్రోత్సహించను

సర్వోన్నత న్యాయస్థానంలో కేసుల అత్యవసర ప్రస్తావనకు సంబంధించి ఓ విప్లవాత్మక మార్పు తీసుకొచ్చే దిశగా సీజేఐ జస్టిస్‌ ఎన్‌.వి.రమణ కీలక వ్యాఖ్యలు చేశారు. అత్యవసర విచారణ కోసం సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం ఎదుట సీనియర్‌ న్యాయవాదులు పిటిషన్లను ప్రస్తావించే సంప్రదాయానికి తాను తెరదించాలనుకుంటున్నట్లు చెప్పారు. అడ్వొకేట్స్‌ ఆన్‌ రికార్డ్‌ (ఏవోఆర్‌)లే వాటిని ధర్మాసనం ముందుకు తీసుకొచ్చేలా చూడాలని సూచించారు. సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం రోజువారీ విచారణ కార్యకలాపాలను ప్రారంభించడానికి ముందు.. సీనియర్‌ న్యాయవాదులు ఈ తరహా పిటిషన్లను ప్రస్తావిస్తుంటారు. బుధవారం కూడా ఓ సీనియర్‌ న్యాయవాది అందుకోసం వరుసలో వేచి ఉండగా జస్టిస్‌ ఎన్‌.వి.రమణ స్పందిస్తూ.. ‘‘అత్యవసర విచారణ కోసం కేసులను సీనియర్లు ప్రస్తావించకపోవడం మేలు. ఈ విషయంలో వారిని ప్రోత్సహించే ప్రసక్తే లేదు. దయచేసి వీటిని రేపు (గురువారం) ప్రస్తావించాల్సిందిగా మీ ఏవోఆర్‌లకు చెప్పండి’’ అని పేర్కొన్నారు. సీనియర్‌ న్యాయవాదులు సిబల్‌, ఎ.ఎం.సింఘ్వీల పిటిషన్లను ప్రస్తావించేందుకూఆయన అంగీకరించలేదు.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని