నిర్హేతుకమైన హామీలు తీవ్రమైన విషయమే

ఉచితాలనేవి సమస్య కాదని ఎవరూ చెప్పడంలేదు. కొన్ని దేశాలు ఇలాంటి ఉచితాలకు వెళ్లి ఆర్థిక సమస్యల్లో పడినందున ఈ అంశంపై దృష్టి సారించాలని కోరడాన్ని  కాదనలేం. కానీ దేశంలో పేదరికం లాంటి చాలా అంశాలున్నాయి. వాటినీ విస్మరించలేం. వాటిపై అధ్యయనం చేయాల్సి ఉంది.

Updated : 12 Aug 2022 07:15 IST

సంక్షేమ పథకాలు.. ఉచితాలు వేర్వేరు

రాజకీయ పార్టీల రద్దు జోలికి వెళ్లం.. అది అప్రజాస్వామికం

సీజేఐ జస్టిస్‌ ఎన్‌.వి.రమణ

ఉచితాలే ఎన్నికల అంశమయ్యాయన్న కేంద్రం

ఉచితాలనేవి సమస్య కాదని ఎవరూ చెప్పడంలేదు. కొన్ని దేశాలు ఇలాంటి ఉచితాలకు వెళ్లి ఆర్థిక సమస్యల్లో పడినందున ఈ అంశంపై దృష్టి సారించాలని కోరడాన్ని  కాదనలేం. కానీ దేశంలో పేదరికం లాంటి చాలా అంశాలున్నాయి. వాటినీ విస్మరించలేం. వాటిపై అధ్యయనం చేయాల్సి ఉంది.

-సీజేఐ జస్టిస్‌ ఎన్‌.వి.రమణ


ఉచితాల పంపిణీ కొన్ని పార్టీలకు ఒక కళగా మారింది. వాటితోనే అవి ఎన్నికల్లో పోరాడుతున్నాయి. ఉచితాలే సంక్షేమమని కొన్ని పార్టీలు భావిస్తుండడం దురదృష్టకరం. ఇది అశాస్త్రీయం. ఆర్థిక విపత్తుకు దారితీస్తుంది. ఉచిత పథకాలపై చట్టం చేసేంతవరకూ కోర్టు ఏదైనా మార్గదర్శకాలు జారీచేస్తే బాగుంటుంది.

-కేంద్ర ప్రభుత్వ వాదన


ఈనాడు, దిల్లీ: సంక్షేమ పథకాలు వేరు.. ఉచిత పథకాలు వేరని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ స్పష్టంచేశారు. ఎన్నికల ముందు రాజకీయ పార్టీలు చేసే ఉచిత వాగ్దానాల అంశాన్ని పరిశీలిస్తామని, ఆ అంశంలో నిబంధనలు ఉల్లంఘించిన రాజకీయ పార్టీలను రద్దు చేయాలన్న విజ్ఞప్తి జోలికి వెళ్లబోమని చెప్పారు. పార్టీల రద్దు అప్రజాస్వామికమని వ్యాఖ్యానించారు. పన్నుల రూపంలో ప్రజలు కట్టిన డబ్బును దుర్వినియోగం చేస్తున్నారు. ఎన్నికల ప్రయోజనాలకోసం ఓటర్లకు ఉచితాలను పంపిణీ చేయడానికి పార్టీలు చేస్తున్న ప్రయత్నాలను నియంత్రించాలంటూ న్యాయవాది అశ్వినీకుమార్‌ ఉపాధ్యాయ్‌ ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసిన విషయం తెలిసిందే. గురువారం దీనిపై విచారణ సందర్భంగా సీజేఐ జస్టిస్‌ రమణ, జస్టిస్‌ కృష్ణ మురారి ధర్మాసనం పలు వ్యాఖ్యలు చేసింది.

సీరియస్‌ అంశమే కానీ కొన్నింటిని విస్మరించలేం 

మేనిఫెస్టోలను నియంత్రించేలా కేంద్రాన్ని, ఎన్నికల సంఘాన్ని నిర్దేశించాలని, ఇలాంటి ఉచిత వాగ్దానాలకు రాజకీయ పార్టీలను జవాబుదారీగా చేయాలని అశ్వినీకుమార్‌ కోరారు. ఆయన తరఫున సీనియర్‌ న్యాయవాది వికాస్‌ సింగ్‌ వాదనలు వినిపించారు. ‘మేనిఫెస్టోలను పరిశీలించి, అనుమతిచ్చేందుకు స్వతంత్ర ఆర్థిక నిపుణుల కమిటీని కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాటు చేసేలా చూడాలి. అనుమతిచ్చిన మేనిఫెస్టోను మాత్రమే విడుదల చేయాలి. ఆ నిబంధనను ఉల్లంఘించిన రాజకీయ పార్టీలను రద్దు చేయాలి’ అని కోరారు. జస్టిస్‌ రమణ జోక్యం చేసుకుంటూ ‘‘ఇది (ఉచితాలు) సమస్య కాదని ఎవ్వరూ చెప్పడంలేదు. ఇది సీరియస్‌ అంశమే. పన్నుల డబ్బును ఉచితంగా పంపిణీ చేయకూడదని ఆదేశిస్తే మా హద్దులను దాటినట్లవుతుంది. ఎన్నికల సంఘం ఒక స్వతంత్య్ర సంస్థ. చట్టాలు చేసే అధికారం రాజకీయ పార్టీలకు ఉంటుంది.

కొన్ని దేశాలు ఇలాంటి ఉచితాలకు వెళ్లి ఆర్థిక సమస్యల్లో పడినందున ఈ అంశంపై దృష్టి సారించాలని చెప్పడాన్ని కాదనలేం. కానీ దేశంలో పేదరికం లాంటి చాలా అంశాలు ఉన్నాయి. వాటిని విస్మరించలేం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరిస్థితులకు తగ్గట్టు కొన్ని పథకాలు ప్రవేశపెడుతుంటాయి కదా’’ అని అన్నారు.

కోట్లమందిపై ప్రభావాన్ని చూడాలి.. అధ్యయనం చేయాలి 

‘ప్రభుత్వ పథకాలను అమలు చేయొద్దని చెబితే కోట్లమంది ప్రజలపై, ఆర్థిక పరిస్థితులపై ఎంతమేర ప్రభావం పడుతుందన్నది చూడాలి. అందుకు అధ్యయనం కావాలి. అంతేతప్ప రేపట్నుంచి అన్నీ బంద్‌ చేయమని చెప్పలేం. ఉత్సుకతతో ఘోర తప్పిదం చేయకూడదు. పార్టీలు 101 హామీలు ఇస్తాయి. వాటి అమలుకు డబ్బెక్కడినుంచి వస్తుందో ముందుగా చెప్పమని మనం కోరలేం. ఎన్నికై ప్రభుత్వంలోకి వచ్చేంత వరకూ బడ్జెట్‌ ఎంతుంటుందో వారికి తెలియదు కదా? శాసనవ్యవస్థకు పరిమితమైన అంశాల్లో చొరబడటం మంచిది కాదు. అయితే ఏదో ఒక చర్య తీసుకోవాలన్న భావనతో ఏకీభవిస్తున్నాను. అందుకే ఈ కేసును విచారణకు స్వీకరించాం’ అని జస్టిస్‌ రమణ చెప్పారు. కేంద్రం తరఫున సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌మెహతా వాదించారు. ‘ఉచితాల పంపిణీ కొన్ని పార్టీలకు ఒక కళగా మారింది. కేవలం వాటిపైనే ఎన్నికల్లో పోరాడుతున్నారు. ఉచితాలు ఇవ్వడమే సంక్షేమమని కొన్ని పార్టీలు భావిస్తుండడం దురదృష్టకరం. ఇది అశాస్త్రీయం. ఆర్థిక విపత్తుకు దారితీస్తుంది’ అని చెప్పారు. విద్యుత్తు సంస్థల ఆర్థిక ఇబ్బందుల్ని ఆయన ప్రస్తావించారు. ఉచిత పథకాలపై చట్టం చేసేంతవరకూ కోర్టు ఏదైనా మార్గదర్శకాలు జారీచేస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. దానికి ఏదోఒక ఆధారం ఉండాలని సీజేఐ అన్నారు. సంపూర్ణంగా అధ్యయనం చేసి నివేదిక అందిస్తే, తాము నిర్ణయం తీసుకోవడానికి వీలవుతుందని చెప్పారు.

ఈసీ అఫిడవిట్‌ వెల్లడిపై ఆగ్రహం

ఎన్నికల సంఘం దాఖలు చేసిన అదనపు ప్రమాణపత్రంలోని వివరాలు వార్తాపత్రికల్లో ముందే వెల్లడి కావడంపై జస్టిస్‌ రమణ ఆగ్రహం వ్యక్తంచేశారు. న్యాయమూర్తులు చూడడానికంటే ముందే వివరాలు మీడియాకు చేరాయన్నారు. ‘మాకు గత రాత్రి పొద్దుపోయేవరకు అదనపు ప్రమాణపత్రం అందనేలేదు. దానిని దినపత్రికల్లో చూడాల్సి వచ్చింది. ప్రమాణపత్రాలను వార్తాపత్రికలకే ఇవ్వండి’ అని అన్నారు. కరోనా సోకుతున్న దృష్ట్యా కోర్టు గదుల్లో న్యాయవాదులంతా మాస్కులు తప్పనిసరిగా ధరించాలని కూడా ఆయన చెప్పారు.

రాష్ట్రాల అప్పులు రూ.59.89 లక్షల కోట్లు

రాష్ట్రాల అప్పులు 2021 మార్చి 31 నాటికి రూ.59.89 లక్షల కోట్లకు చేరాయని పిటిషనర్‌ అశ్వనీ ఉపాధ్యాయ్‌ తన పిల్‌లో తెలిపారు. రూ.6.62 లక్షల కోట్ల రుణాలతో యూపీ, రూ.5.36 లక్షల కోట్లతో మహారాష్ట్ర మొదటి రెండు స్థానాల్లో నిలుస్తున్నాయని చెప్పారు. రాష్ట్ర స్థూల ఉత్పత్తితో రుణ నిష్పత్తిని బేరీజు వేసి  చూస్తే పంజాబ్‌ అట్టడుగు స్థాయిలో ఉందన్నారు. అర్థంపర్థం లేని  ఉచితాలతో ఖర్చులు పెరిగిపోయి కొత్త సవాళ్లు ఎదురవుతున్నాయని చెప్పారు.


స్వీయ అనుభవాలు చెప్పిన సీజేఐ

ఉచితాలు చట్టవిరుద్ధంగా మొదలై ఎలా చట్టబద్ధమవుతాయన్నది తనకు ఎదురైన ఉదాహరణలతో జస్టిస్‌ రమణ వివరించారు. ‘‘మా మామ వ్యవసాయదారుడు. ఇదివరకు ప్రభుత్వం కొత్తగా వ్యవసాయ విద్యుత్తు కనెక్షన్లపై నిషేధం విధించింది. దాన్ని సవాల్‌ చేస్తూ కోర్టులో ఒక రిట్‌ దాఖలు చేయగలవా? అని మా మామ నన్నడిగారు. అది ప్రభుత్వ విధాన నిర్ణయం.. దాన్ని ఎలా సవాల్‌ చేయగలమని ప్రశ్నించాను. అదే సమయంలో ఊర్లో చాలామంది కరెంటు తీగలకు కొక్కేలు తగిలించుకొని విద్యుత్తు వాడుకోవడం మొదలుపెట్టారు. ఇంతలో ప్రభుత్వం అలాంటి చట్టవిరుద్ధమైన కనెక్షన్లన్నింటినీ చట్టబద్ధం చేసింది... నిబంధనల ప్రకారం ఇంట్లో కొత్తగా ఒక ఇటుకను కూడా అదనంగా పెట్టలేని పరిస్థితి. అలాచేస్తే నిర్మాణ ప్రణాళికను ఉల్లంఘించినట్లవుతుందని భావించాను. మా ఇంటి పక్కన పెద్దపెద్ద బంగ్లాలను అంతస్తుల కొద్దీ నిర్మించుకుంటూపోయారు. తర్వాత అన్నింటినీ క్రమబద్ధీకరించారు. తద్వారా చట్టవిరుద్ధమైన పనులకు ఆమోదముద్ర వేసి, నిజాయితీగా చట్టానికి కట్టుబడినవారిని శిక్షించినట్లవుతుంది’’ అన్నారు. అందువల్ల ఈ విషయంలో అన్ని కోణాలు పరిశీలించాల్సి ఉందన్నారు. తన పదవీ విరమణకు ముందే మిగిలిన పక్షాలు కూడా అభిప్రాయాలు చెప్పాలని సూచిస్తూ.. తదుపరి విచారణను ఈనెల 17వ తేదీకి వాయిదావేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని