పశ్చిమబెంగాల్‌ సీఎం మమతకు మరో షాక్‌!

పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి, తృణమూల్‌ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు మమతా బెనర్జీకి కేంద్ర దర్యాప్తు సంస్థలు మరోసారి షాకిచ్చాయి. ఆమెకు అత్యంత సన్నిహితుడు, బీర్‌భూం జిల్లా టీఎంసీ అధ్యక్షుడైన అనుబ్రత్‌ మండల్‌ (62)ను గురువారం

Updated : 12 Aug 2022 06:33 IST

పశువుల అక్రమ రవాణా కేసులో టీఎంసీ నేత అరెస్ట్‌

30 కార్ల కాన్వాయ్‌లో తరలి వచ్చిన సీబీఐ అధికారులు

బొగ్గు కుంభకోణంలో 8 మంది ఐపీఎస్‌లకు ఈడీ సమన్లు

బోల్‌పుర్‌, కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి, తృణమూల్‌ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు మమతా బెనర్జీకి కేంద్ర దర్యాప్తు సంస్థలు మరోసారి షాకిచ్చాయి. ఆమెకు అత్యంత సన్నిహితుడు, బీర్‌భూం జిల్లా టీఎంసీ అధ్యక్షుడైన అనుబ్రత్‌ మండల్‌ (62)ను గురువారం సీబీఐ అరెస్టు చేసింది. 2020 నాటి పశువుల అక్రమ రవాణా కేసు విచారణలో భాగంగా బోల్‌పుర్‌లోని తన నివాసంలో ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. ఈయన పశువుల స్మగ్లర్ల నుంచి డబ్బు తీసుకొని, వారికి రక్షణ కల్పించేవారన్నది అభియోగం. మరోవైపు.. బొగ్గు కుంభకోణంలో 8 మంది ఐపీఎస్‌ అధికారులకు ఈడీ సమన్లు జారీ చేసింది. గురువారం ఉదయం అనుబ్రత్‌ నివాసానికి సీబీఐ అధికారులు చేరుకోగా.. వారి వెంట 30 కార్ల కాన్వాయ్‌ వచ్చింది. ఆయన్ను ఓ గదిలో ఉంచి గంటన్నరకు పైగా ప్రశ్నించారు. విచారణకు సహకరించకపోవడంతో అరెస్టు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. అధికారులు రావడంతోనే అనుబ్రత్‌ రెండో అంతస్తులో ఉన్న గదిలోకి వెళ్లి, లోపలి నుంచి గొళ్లెం పెటుకున్నారని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. అరెస్టు మెమోపై సంతకం చేయడానికి కూడా నిరాకరించారని తెలిపాయి. పారా మిలిటరీ సిబ్బంది వచ్చి తలుపులు పగలగొడతారని హెచ్చరించడంతో గది బయటకు వచ్చినట్లు చెప్పాయి. ఈ కేసులో సీబీఐ అనుబ్రత్‌కు 10 సార్లు సమన్లు జారీ చేసింది. అనారోగ్య సమస్యలను కారణంగా చూపి విచారణకు ఆయన గైర్హాజరవుతూ వచ్చారు. మండల్‌కు 14 రోజులపాటు విశ్రాంతి అవసరమని ధ్రువీకరించిన బోల్‌పుర్‌ ఆసుపత్రి వైద్యుణ్ని కూడా విచారించనున్నట్లు సీబీఐ తెలిపింది. ఆసన్‌సోల్‌లోని సీబీఐ ప్రత్యేక కోర్టు అనుబ్రత్‌ను పది రోజుల కస్టడీకి ఆదేశించింది.

టీఎంసీ బాహుబలి

బీర్‌భూం జిల్లాలో టీఎంసీకి బాహుబలి తరహా నేతగా అనుబ్రత్‌ మండల్‌ను పార్టీ వర్గాలు అభివర్ణిస్తాయి. మమత కేబినెట్‌లో మంత్రిగా ఉన్న పార్థా ఛటర్జీని ఉద్యోగ నియామకాల కుంభకోణం కేసులో గత జులై నెలలో ఈడీ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అనుబ్రత్‌ అరెస్టుపై టీఎంసీ సీనియర్‌ నేత, రాష్ట్ర మంత్రి చంద్రిమ భట్టాచార్య స్పందిస్తూ.. ‘అవినీతి ఏ రూపంలో ఉన్నా సమర్థించం. కేంద్ర దర్యాప్తు సంస్థల తీరు నిష్పక్షపాతంగా లేదు. రాజకీయ వేధింపులపై రెండు రోజులపాటు నిరసనలు ర్యాలీలు చేపడతాం’ అన్నారు. ఈ వ్యవహారంపై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందించాలని భాజపా రాష్ట్ర నాయకత్వం కోరింది.


ఐపీఎస్‌ అధికారులకు దిల్లీ పిలుపు

బొగ్గు అక్రమరవాణా కేసులో 8 మంది బెంగాల్‌ ఐపీఎస్‌ అధికారులకు గురువారం సమన్లు జారీచేసిన ఈడీ విచారణ నిమిత్తం దిల్లీకి రావాలని కోరింది. ఐపీఎస్‌ అధికారులు జ్ఞానవంత్‌ సింగ్‌, కోటేశ్వరరావు, ఎస్‌.సెల్వమురుగన్‌, శ్యామ్‌సింగ్‌, రాజీవ్‌ మిశ్ర, సుకేశ్‌ కుమార్‌ జైన్‌, తథాగత బసు తదితరులు సమన్లు అందుకున్నారు. బొగ్గు కుంభకోణంలో వీరందరూ లబ్ధి పొందినట్లు అభియోగాలు ఉన్నాయి. వీరిలో ఏడుగురిని ఈడీ గతేడాది కూడా విచారించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని