సంక్షిప్త వార్తలు

బలవంతపు మతమార్పిళ్లకు సంబంధించి ప్రస్తుతం అమలులో ఉన్న చట్టాన్ని మరింత కఠినతరం చేస్తూ హిమాచల్‌ప్రదేశ్‌ అసెంబ్లీలో శుక్రవారం బిల్లును ప్రవేశపెట్టారు. తాజా సవరణల మేరకు పై నేరానికి పాల్పడ్డవారికి శిక్షణను ఏడేళ్ల నుంచి గరిష్ఠంగా

Updated : 13 Aug 2022 06:20 IST

మరింత కఠినతరంగా మతమార్పిళ్ల చట్టం
హిమాచల్‌ అసెంబ్లీలో బిల్లు

శిమ్లా: బలవంతపు మతమార్పిళ్లకు సంబంధించి ప్రస్తుతం అమలులో ఉన్న చట్టాన్ని మరింత కఠినతరం చేస్తూ హిమాచల్‌ప్రదేశ్‌ అసెంబ్లీలో శుక్రవారం బిల్లును ప్రవేశపెట్టారు. తాజా సవరణల మేరకు పై నేరానికి పాల్పడ్డవారికి శిక్షణను ఏడేళ్ల నుంచి గరిష్ఠంగా పదేళ్లకు పెంచాలని ప్రతిపాదించారు. అలాగే ఈ కేసులను ఎస్‌.ఐ. స్థాయి కంటే తక్కువ కాకుండా ఉన్న అధికారులు మాత్రమే విచారించాలని పేర్కొన్నారు. ఈ చట్టాన్ని మరింత పకడ్బందీగా అమలు చేసేందుకు ఈ సవరణలు ప్రతిపాదించినట్లు ముఖ్యమంత్రి జైరాం ఠాకుర్‌ తెలిపారు.


జమ్మూ- కశ్మీర్‌పై కేరళ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు

తిరువనంతపురం: కేరళ మాజీ మంత్రి, అధికార ఎల్డీఎఫ్‌ ఎమ్మెల్యే కె.టి.జలీల్‌ జమ్మూ-కశ్మీర్‌పై శుక్రవారం వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భారత్‌లో అంతర్భాగంగా ఉన్న జమ్మూ-కశ్మీర్‌ ప్రాంతాన్ని ‘భారత ఆక్రమిత జమ్మూ-కశ్మీర్‌’గా, పాక్‌ ఆక్రమించిన కశ్మీర్‌ను ‘స్వతంత్ర కశ్మీర్‌’గా అభివర్ణించారు. కశ్మీర్‌ పర్యటనకు సంబంధించి ఆయన ఫేస్‌బుక్‌లో ఈ వ్యాఖ్యలు చేశారు. దీనిపై భాజపా మండిపడింది. జలీల్‌పై కేసు నమోదు చేయాలని కేంద్ర మంత్రి వి.మురళీధరన్‌ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.


వలస కార్మికుడిని కాల్చి చంపిన ముష్కరులు

శ్రీనగర్‌: జమ్మూ-కశ్మీర్‌లో మరో వలస కార్మికుడిని ఉగ్రవాదులు పొట్టనపెట్టుకున్నారు. బందీపొరా జిల్లా సోద్‌నారా సుంబల్‌ ప్రాంతంలో గురువారం అర్ధరాత్రి ముష్కరులు జరిపిన కాల్పుల్లో బిహార్‌కు చెందిన మహమ్మద్‌ అమ్రేజ్‌ (20) అనే యువకుడు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు.  


యమునాతీరంలో కొనసాగుతున్న గాలింపు

ఈనాడు, లఖ్‌నవూ: ఉత్తర్‌ప్రదేశ్‌లోని బాందా జిల్లా యమునాతీరంలో పడవ ప్రమాదంలో గల్లంతైన 17 మంది ఆచూకీ కోసం గాలింపు చర్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఈ సంఖ్య మరింత ఎక్కువగా ఉండవచ్చని కూడా వినవస్తోంది. గురువారం రాత్రి చీకటి, వర్షం కారణంగా ఆగిపోయిన సహాయక చర్యలను ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎస్డీఆర్‌ఎఫ్‌ బృందాలు శుక్రవారం తెల్లవారుజాము నుంచే తిరిగి ప్రారంభించాయి. ప్రయాగ్‌రాజ్‌ నుంచి గజ ఈతగాళ్లను రప్పించారు. ప్రమాదం జరిగిన సమయంలో పడవలో సుమారు 40 మంది దాకా ప్రయాణికులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. తొలిరోజు నాలుగు మృతదేహాలు దొరికిన విషయం తెలిసిందే.  


ప్రజల కోసం 20 కోట్ల జాతీయ జెండాలు

దిల్లీ: ‘హర్‌ ఘర్‌ తిరంగా’ కార్యక్రమంపై ప్రచారం మొదలుపెట్టినప్పటి నుంచి దేశ ప్రజలకు 20 కోట్లకుపైగా జాతీయ జెండాలను అందుబాటులో ఉంచినట్లు కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ అధికారులు శుక్రవారం తెలిపారు.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts