శాంతికి చైనా విఘాతం కలిగిస్తే.. ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాలపై ప్రభావం

సరిహద్దుల్లో శాంతికి చైనా విఘాతం కలిగిస్తే, ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాలపై ప్రభావం పడుతుందన్న వైఖరిని భారత్‌ కొనసాగిస్తోందని కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్‌ పేర్కొన్నారు. శుక్రవారమిక్కడ ఆయన విలేకరులతో

Published : 13 Aug 2022 05:53 IST

కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్‌ వెల్లడి

బెంగళూరు: సరిహద్దుల్లో శాంతికి చైనా విఘాతం కలిగిస్తే, ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాలపై ప్రభావం పడుతుందన్న వైఖరిని భారత్‌ కొనసాగిస్తోందని కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్‌ పేర్కొన్నారు. శుక్రవారమిక్కడ ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘‘కమాండర్ల స్థాయిలో మేం 15 సార్లు చర్చలు జరిపాం. కొద్దిగా పురోగతి సాధించాం. బలగాలను రెండు వైపుల వెనక్కి తీసుకునే విషయంలో అసాధారణ పురోగతి సాధించాం. వారు కొన్ని ప్రాంతాల్లో వెనక్కి వెళ్లలేదు. కానీ మేం.. మాత్రం సరిహద్దుల్లో శాంతి, సామరస్యాలకు చైనా విఘాతం కలిగిస్తే.. అది రెండు దేశాల ద్వైపాక్షిక సంబంధాలపై ప్రభావం చూపుతుందన్న వైఖరిని కొనసాగిస్తున్నాం’’ అని వెల్లడించారు. రెండేళ్ల క్రితం లద్ధాఖ్‌లో ఘర్షణ తర్వాత చైనాతో దెబ్బతిన్న సంబంధాల విషయమై ప్రశ్నించగా జైశంకర్‌ పైవిధంగా స్పందించారు. ‘‘నేను 2020లో చెప్పాను. 2021లో చెప్పాను. 2022లోనూ కొనసాగిస్తున్నాను. మా సంబంధం సాధారణమైనదికాదు. సరిహద్దులో పరిస్థితి సాధారణ స్థితికి రానంత కాలం.. అది సాధారణం అవదు. సరిహద్దులోని పరిస్థితి ఇప్పుడు సాధారణంగా లేదు’’ అని వ్యాఖ్యానించారు. త్వరలో ‘చాలా కలవరపెట్టే మార్పులు’ సంభవించొచ్చని, ప్రాంతీయ శక్తిగా ఉన్న చైనా ‘సూపర్‌ పవర్‌’గా మారుతున్న సమయంలో భారత్‌ అందుకు అనుగుణంగా సిద్ధమవ్వాలని.. పీఈఎస్‌ యూనివర్సిటీ విద్యార్థులో ముచ్చటిస్తూ జైశంకర్‌ వ్యాఖ్యానించారు. బెంగళూరులో అమెరికా కాన్సులేట్‌ ఉండాలనుకోవడం సమంజసమేనని కేంద్రమంత్రి జైశంకర్‌ అన్నారు. ఎలక్ట్రానిక్‌ సిటీలో వ్యాపారవేత్తలతో సమావేశమైనప్పుడు ఈ డిమాండ్‌ వచ్చిందని చెప్పారు. అయితే ఈ విషయంలో తుది నిర్ణయం తీసుకోవాల్సింది అమెరికా అధికారులేనని స్పష్టంచేశారు. తమ మంత్రిత్వశాఖ పరిధిలో లేదని స్పష్టంచేశారు. వచ్చే నెలలో అమెరికా వెళతానని. ఈ డిమాండ్‌ను కచ్చితంగా దృష్టిలో ఉంచుకుంటానని వెల్లడించారు.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts