ఒకేచోట గుంపుగా చేరవద్దు

దేశంలో కొవిడ్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రాలను కేంద్ర ప్రభుత్వం అప్రమత్తం చేసింది. స్వాతంత్య్ర దినోత్సవం నాడు ప్రజలు అధిక సంఖ్యలో ఒకేచోట గుమిగూడకుండా చూడాలని రాష్ట్రాలకు సూచించింది. కొవిడ్‌ నియమాలను పాటించాలని

Published : 13 Aug 2022 05:53 IST

కొవిడ్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం హెచ్చరిక
స్వాతంత్య్ర వేడుకలకు మార్గదర్శకాలు

దిల్లీ: దేశంలో కొవిడ్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రాలను కేంద్ర ప్రభుత్వం అప్రమత్తం చేసింది. స్వాతంత్య్ర దినోత్సవం నాడు ప్రజలు అధిక సంఖ్యలో ఒకేచోట గుమిగూడకుండా చూడాలని రాష్ట్రాలకు సూచించింది. కొవిడ్‌ నియమాలను పాటించాలని ప్రజలను కోరింది. మాస్కులు ధరించడంతో పాటు భౌతిక దూరం పాటించాలని ప్రజలను కోరింది. వ్యాధి సంక్రమణకు గురికాకుండా అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొంది.

ప్రతి జిల్లాలోనూ 45 రోజుల పాటు స్వచ్ఛభారత్‌ ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను కేంద్ర హోంశాఖ కోరింది. పౌరులు స్వచ్ఛందంగా పాల్గొనేలా చూడాలని తెలిపింది. పర్యావరణ పరిరక్షణ కోసం మొక్కలు నాటాలని అన్ని ప్రభుత్వ విభాగాలు, విద్యాసంస్థలకు సూచించింది.

ఎర్రకోట సమీపంలో పతంగులపై నిషేధం

స్వాతంత్య్ర వేడుకలు జరిగే ఎర్రకోటతో పాటు భద్రతపరంగా సున్నితమైన ప్రాంతాలుగా గుర్తించిన చోట పతంగులు, డ్రోన్లు, బెలూన్లు ఎగురవేయడాన్ని దిల్లీ పోలీసులు నిషేధించారు. వాటి మాటున స్వాతంత్య్ర దినోత్సవం నాడు విద్రోహ శక్తులు విధ్వంసానికి పాల్పడే అవకాశం ఉన్నందున పౌరులు అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై తమకు సమాచారం అందించాలని పోలీసులు సూచించారు. నిషేధిత ప్రాంతాల్లోకి వచ్చే పతంగులు, బెలూన్లను తొలగించడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

స్వాతంత్య్ర సమర ఘట్టాల రికార్డుల ప్రదర్శన ప్రారంభం

భారత స్వాతంత్య్ర సమరానికి సంబంధించిన అపురూపమైన ఘట్టాలు, యోధుల తిరుగుబాట్లు, క్విట్‌ ఇండియా ఉద్యమం సహా పలు చారిత్రక విశేషాలను అందించే అరుదైన రికార్డులు, పత్రాలను దిల్లీలోని నేషనల్‌ ఆర్కైవ్స్‌ ఆఫ్‌ ఇండియా(ఎన్‌ఏఐ)లో ప్రదర్శిస్తున్నారు. దాదాపు 200 ఏళ్ల చరిత్రకు అద్దంపట్టే అంశాలెన్నిటినో ఇక్కడ భద్రపరిచారు. కేంద్ర సాంస్కృతిక శాఖ సహాయ మంత్రి అర్జున్‌ రామ్‌ మెఘ్వాల్‌ శుక్రవారం ప్రదర్శనను ప్రారంభించారు. ఆజాదీ కా అమృత్‌మహోత్సవంలో భాగంగా ఈ ప్రదర్శనను సెప్టెంబరు 30 వరకు కొనసాగించనున్నట్లు ఎన్‌ఏఐ డైరెక్టర్‌ జనరల్‌ చందన్‌ సిన్హా తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని