మీ ధైర్యం ప్రశంసనీయం

దేశ విభజన సమయంలో ప్రాణాలు కోల్పోయిన వారికి ప్రధాని మోదీ, భాజపా సీనియర్‌ నేతలు నివాళులు అర్పించారు. ‘విభజన విషాద స్మృతి దినం’ సందర్భంగా ప్రధాని ఆదివారం ట్వీట్‌ చేశారు. నాటి

Published : 15 Aug 2022 05:28 IST

దేశ విభజన వేళ ప్రాణాలు కోల్పోయినవారికి ప్రధాని నివాళులు

దిల్లీ: దేశ విభజన సమయంలో ప్రాణాలు కోల్పోయిన వారికి ప్రధాని మోదీ, భాజపా సీనియర్‌ నేతలు నివాళులు అర్పించారు. ‘విభజన విషాద స్మృతి దినం’ సందర్భంగా ప్రధాని ఆదివారం ట్వీట్‌ చేశారు. నాటి విషాదకర సమయంలో బాధలకోర్చి నిలబడిన వారి మొక్కవోని ధైర్యం ప్రశంసనీయమని పేర్కొన్నారు. ఆగస్టు 14వ తేదీని ‘విభజన విషాద స్మృతి దినం’గా పాటించనున్నట్లు గత ఏడాది ప్రధాని మోదీ ప్రకటించిన సంగతి తెలిసిందే. విభజన.. దేశ చరిత్రలోనే అమానవీయ అధ్యాయమని; స్వార్థ రాజకీయాలు, వ్యక్తిగత ప్రయోజనాలు నాటి బాధాకర అంశాలకు ఎలా దారితీశాయన్నది ఎన్నటికీ మరిచిపోలేమని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు.

భాజపా-కాంగ్రెస్‌ పరస్పర విమర్శలు..
భాజపా-కాంగ్రెస్‌ల మధ్య ఆదివారం పరస్పర విమర్శలు కొనసాగాయి. 1947లో దేశ విభజనకు దారితీసిన ఘటనలను విశ్లేషిస్తూ భాజపా ఓ వీడియోను ట్విటర్‌లో ఉంచింది. నాడు పాకిస్థాన్‌ ఏర్పాటుకు జిన్నా నేతృత్వంలోని ముస్లింలీగ్‌ డిమాండ్లకు నెహ్రూ తలొగ్గినట్లు పరోక్షంగా ఆరోపిస్తూ ఈ వీడియోను రూపొందించింది. ‘‘భారత సాంస్కృతిక వారసత్వం, నాగరికత, విలువలు వంటివాటి పట్ల అవగాహన లేనివారు కేవలం 3 వారాల్లో శతాబ్దాల తరబడి కలిసి ఉంటున్న ప్రజల మధ్య సరిహద్దును గీశారు’’ అని ట్వీట్‌ చేసింది. కాగా విభజన నాటి బాధాకర ఘటనలను అధికార పార్టీ తన రాజకీయ ప్రయోజనాలకు వాడుకుంటోందని కాంగ్రెస్‌ విమర్శించింది. ‘‘ఆధునిక సావర్కర్లు, జిన్నాలు దేశాన్ని విడగొట్టేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉన్నారు. విద్వేష రాజకీయాలకు ఓటమి తప్పదు’’ అని జైరాం రమేశ్‌ పేర్కొన్నారు. సావర్కర్‌పై కాంగ్రెస్‌ వ్యాఖ్యలను భాజపా తిప్పికొట్టింది. సావర్కర్‌ పుట్టకముందే విభజన ప్రతిపాదన తెరపైకి వచ్చిందని.. వాస్తవానికి హిందూ మహాసభతో పాటు ఆయన విభజన ఆలోచనను వ్యతిరేకించారని భాజపా ఐటీ విభాగం అధిపతి అమిత్‌ మాలవీయ పేర్కొన్నారు.


దిల్లీలో మౌన ప్రదర్శన

ఈనాడు, దిల్లీ: దేశ సమగ్రత, ఐక్యత కోసం పనిచేయాలన్న స్ఫూర్తిని యువతలో రేకెత్తించేందుకు కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో దిల్లీలోని కన్నాట్‌ప్లేస్‌లో మౌన ప్రదర్శన నిర్వహించారు. కేంద్ర మంత్రులు జి.కిషన్‌రెడ్డితోపాటు, అశ్వినీ వైష్ణవ్‌, అర్జున్‌రామ్‌ మేఘ్‌వాల్‌, మీనాక్షి లేఖి పాల్గొన్నారు.


Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts