ఫ్లైట్‌ లెఫ్టినెంట్‌ రవీంద్రరావుకు వాయుసేన శౌర్య పతకం

భారత వాయుసేనకు చెందిన ఫ్లైట్‌ లెఫ్టినెంట్‌ డి.రవీంద్రరావుకు ప్రభుత్వం ‘వాయుసేవ శౌర్య పతకం’ ప్రకటించింది. ప్రమాదంలో చిక్కుకున్న తోటి పైలట్‌ ప్రాణాలను అత్యంత ధైర్యసాహసాలతో

Published : 15 Aug 2022 05:28 IST

ఈనాడు, దిల్లీ: భారత వాయుసేనకు చెందిన ఫ్లైట్‌ లెఫ్టినెంట్‌ డి.రవీంద్రరావుకు ప్రభుత్వం ‘వాయుసేవ శౌర్య పతకం’ ప్రకటించింది. ప్రమాదంలో చిక్కుకున్న తోటి పైలట్‌ ప్రాణాలను అత్యంత ధైర్యసాహసాలతో రక్షించినందుకు దీనికి ఎంపికయ్యారు. ‘‘2021 నవంబర్‌ 6న లెఫ్టినెంట్‌ రవీంద్రరావు జాగ్వార్‌ యుద్ధవిమానంలో విధులు నిర్వర్తిస్తున్నారు. ల్యాండింగ్‌ తర్వాత సమీపంలో మరో జాగ్వార్‌ విమానం నుంచి పెద్ద పేలుడు శబ్దం రావడాన్ని విన్నారు. ఆ విమానం కూలిపోయి రన్‌వే మీద జారిపోతుండటాన్ని గమనించి, ఉన్నపళంగా ఆ స్థలానికి చేరుకున్నారు. ఆ విమానం తలకిందులై ఉంది. కొంత భాగం విరిగిపోయింది. రెండు ఇంజిన్లూ మాత్రం నడుస్తున్నాయి. అందులోని పైలట్‌ రక్తధారలతో సీటు పట్టీలకు వేలాడుతూ కనిపించారు. అగ్నిమాపక శకటాలకు రవీంద్రరావు సరైన మార్గదర్శనం చేశారు. తలకిందులైన విమానం నుంచి బాధిత పైలట్‌ తప్పించుకొనే పరిస్థితిలో లేరని గమనించి, తన ప్రాణాలను లెక్కచేయకుండా ఆ విమానం కాక్‌పిట్‌ కిందికి పాక్కుంటూ వెళ్లారు. విమాన ఇంజిన్లను ఆపే ప్రయత్నం చేశారు. ఇంజిన్లపై అగ్నిమాపక శకటాలు చల్లిన నీరు వేడెక్కి తనతోపాటు, ఇంజిన్‌లో చిక్కుకున్న పైలట్‌పై పడటం మొదలైంది. అప్పటికే ఒక అగ్నిమాపక వాహనం కార్బన్‌ డై ఆక్సైడ్‌ను వదలడంతో ప్రమాద స్థలంలో ఊపిరి పీల్చుకోవడం కష్టమైంది. అయినా వెనక్కి తగ్గకుండా ఇంజిన్‌లో చిక్కుకున్న పైలట్‌ వద్దకు రవీంద్రరావు చేరుకున్నారు. సీట్లో ఇరుక్కున్న ఆయన కాళ్లను జాగ్రత్తగా పక్కకు జరపగలిగారు. స్పృహ కోల్పోతున్న దశలో ఉన్న పైలట్‌ ఆ విమానం నుంచి బయటపడేందుకు దోహదపడి, సకాలంలో ప్రథమ చికిత్స అందేలా చూశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని