అక్షర నావ.. వెలుగుదోవ

స్వాతంత్య్ర కాంక్షకు ఊపిరులూదిన గ్రంథాలయోద్యమం కృష్ణా తీరాన చైతన్య కెరటాలతో ఉవ్వెత్తున ఎగిసింది. పుస్తక, పత్రికా పఠనాలపై సామాన్యులకు ఆసక్తి పెంచాలనే లక్ష్యంతో పాతూరి నాగభూషణం పడవ

Published : 15 Aug 2022 06:25 IST

పడవ గ్రంథాలయం నిర్వహణతో ప్రజా చైతన్యం

న్యూస్‌టుడే, గుంటూరు సాంస్కృతికం: స్వాతంత్య్ర కాంక్షకు ఊపిరులూదిన గ్రంథాలయోద్యమం కృష్ణా తీరాన చైతన్య కెరటాలతో ఉవ్వెత్తున ఎగిసింది. పుస్తక, పత్రికా పఠనాలపై సామాన్యులకు ఆసక్తి పెంచాలనే లక్ష్యంతో పాతూరి నాగభూషణం పడవ గ్రంథాలయానికి ప్రాణం పోశారు. గుంటూరు జిల్లా తెనాలి తాలూకా పెదపాలెం గ్రామానికి చెందిన నాగభూషణం అక్షరజ్ఞానంతోనే ప్రజా చైతన్యం సాధ్యమని భావించారు. గాంధీజీ మార్గంలో ప్రయాణించి తమ గ్రామంలోని సేవాశ్రమవాణి మందిరం తరఫున 1935లో తొలి బోటు గ్రంథాలయాన్ని ప్రారంభించారు. ఆ రోజుల్లో గ్రామీణులు పడవల్లో ప్రయాణించేవారు. కృష్ణా కాలువపై అప్పట్లో పెదవడ్లపూడి-కొల్లూరు మధ్య ప్రయాణించే పడవలో తొలుత గ్రంథాలయాన్ని ప్రారంభించారు. బోటులో పుస్తకాలు పెట్టుకోవడానికి చినపాలెం వాస్తవ్యురాలు వాసిరెడ్డి అన్నపూర్ణమ్మ పెట్టెను కానుకగా ఇచ్చారు. ఈ మార్గంలోని రేవులలో పడవ ఆగుతూ పాఠకులకు పుస్తకాలను, పత్రికలను అందించేది. ప్రజాదరణను గమనించి మరో 20 రోజులకే రెండో బోటు గ్రంథాలయాన్ని పెదవడ్లపూడి-పిడపర్రు గ్రామాల మధ్య ఏర్పాటుచేశారు. భారతి, కృష్ణాపత్రిక, గ్రంథాలయ సర్వస్వం, ఆరోగ్య పత్రిక, ప్రకృతి, ఇతర సాహిత్య పత్రికలను వీటిల్లో ఉంచేవారు. బోటు గ్రంథాలయాల కోసం కొందరు దాతలు, ప్రచురణకర్తలు పత్రికలు, పుస్తకాలను ఉచితంగా ఇచ్చేవారు. ఈ స్ఫూర్తితో అప్పట్లో బోటు గ్రంథాలయాలు విరివిగా ప్రారంభమయ్యాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని