Rajaji: జైలు భయం, మరణ భీతి... వీటిని దాటితే విముక్తి: ఖైదీ జీవితాన్ని కళ్లకు కట్టిన రాజాజీ

బ్రిటిష్‌ పాలనను ధిక్కరించి, దేశ విముక్తి పోరాటంలో కటకటాలపాలైన సత్యాగ్రహులకు... అక్కడ ఎదురైన బాధలు, అవమానాలు వర్ణనాతీతం! కారాగారవాసంలో ఎదురైన అనుభవాలను, తోటి సత్యాగ్రహులు అక్కడ ఎదుర్కొన్న పరిస్థితులను దిగ్గజ పోరాట

Updated : 15 Aug 2022 09:58 IST

బ్రిటిష్‌ పాలనను ధిక్కరించి, దేశ విముక్తి పోరాటంలో కటకటాలపాలైన సత్యాగ్రహులకు... అక్కడ ఎదురైన బాధలు, అవమానాలు వర్ణనాతీతం! కారాగారవాసంలో ఎదురైన అనుభవాలను, తోటి సత్యాగ్రహులు అక్కడ ఎదుర్కొన్న పరిస్థితులను దిగ్గజ పోరాట యోధుడు సి.రాజగోపాలాచారి తన ‘జైల్‌ డైరీ’లో కళ్లకు కట్టారు.

నాడు కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న రాజాజీకి... సబ్‌ డివిజినల్‌ మేజిస్ట్రేట్‌ ఓ కేసులో 3 నెలల సాధారణ జైలు శిక్ష విధించారు. దీంతో ఆయన 1921 డిసెంబరు 21న వెల్లూరు కేంద్ర కారాగారానికి వచ్చి, మరుసటి ఏడాది మార్చి 20న విడుదలయ్యారు.  

‘‘కారాగారంలో అడుగుపెట్టిన తర్వాత ఒక అల్యూమినియం ప్లేటు, గ్లాసు ఇచ్చారు. సమయం కాగానే బిచ్చం ఎత్తుకుంటున్నట్టు వాటిని పట్టుకుని లైన్లో నిలబడాలి. పళ్లెంలో అన్నం పడిన వెంటనే కాళ్లపైనే నిలబడి చకచకా తినడం పూర్తిచెయ్యాలి. రాజకీయ ఖైదీలను కూడా జైలర్లు కరడుగట్టిన నేరస్థుల మాదిరే చూస్తారు. ఆహారంలోగానీ, అప్పగించే పనుల్లోగానీ, క్రమశిక్షణ చర్యల్లోగానీ వ్యత్యాసం చూపరు. సత్యాగ్రహులను కూడా పూర్తిస్థాయి బానిస కార్మికులుగా వాడుకునేలా ఆంగ్లేయులు జైళ్లను ఉపయోగించుకుంటున్నారు. తాళ్లు పేనడం దగ్గర్నుంచి, ప్రింటింగ్‌ ప్రెస్‌ పనుల వరకూ చేయిస్తున్నారు. ఖైదీలను ఉపయోగించి గానుగల్లో నూనె తీస్తున్నారు.

ముక్కుపుటాలు అదిరే దుర్వాసన...

జైలు గది అంటే... ఇటుకలు పేర్చిన గోడలు, సమతలంగా ఉండే నేల! పడు కోవడానికంటూ బల్లలూ ఉండవు. ఆ పక్కనే మూత్రంతో నిండిన కాలువ నుంచి ముక్కుపుటాలు అదిరే దుర్వాసన. గదిలో ఉన్నామనడం కంటే... ఒక పెద్ద లెట్రిన్‌ వరండాలో పడుకునేవాళ్లమని చెప్పడం సబబేమో! దీనికి తోడు పురుగులు, ఈగలు, దోమలు. ఒక్క క్షణమైనా కంటి నిండా నిద్ర ఉండదు. దేశంలో ఎక్కడెక్కడి నుంచో వివిధ మతాలకు చెందినవారు ఇక్కడికి వచ్చేవారు. మనకూ, స్వాతంత్య్రానికి మధ్య ఉన్నవి రెండే. ఒకటి జైలు అంటే భయం. రెండోది మరణభీతి. వీటిని దాటితే...విముక్తి!’’ అని రాజాజీ జైల్‌ డైరీలో పేర్కొన్నారు.

- ఈనాడు ప్రత్యేక విభాగం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని