Published : 16 Aug 2022 05:45 IST

‘ఎర్రకోట’ దుర్భేద్య భద్రత

జల్లెడ పట్టిన బలగాలు  
ఐదు కి.మీ. పరిధి వరకు గగనతల ఆంక్షలు  
ప్రధాని తలపాగాలో త్రివర్ణం

దిల్లీ: స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం ఎర్రకోట వద్ద దుర్భేద్య రీతిలో భద్రత ఏర్పాట్లు చేశారు. బహుళ అంచెల్లో బలగాలను మోహరించడంతోపాటు చుట్టుపక్కల ఐదు కి.మీ. పరిధి వరకు గగనతల ఆంక్షలు పూర్తిస్థాయిలో విధించారు. డ్రోన్ల రూపంలోనూ ఎలాంటి ప్రమాదం రాకుండా జాగ్రత్తపడ్డారు. ముఖాలను గుర్తుపట్టగలిగే వ్యవస్థలున్న కెమెరాలను ఎక్కడికక్కడ వినియోగించి, అనుమానితులెవరూ రాకుండా విస్తృత పరిశీలన చేపట్టారు. జాతీయ భద్రత దళం (ఎన్‌ఎస్‌జీ)లోని జాగిలాలు, వ్యూహాత్మక కమాండోలు, షార్ప్‌ షూటర్లను కీలకమైన చోట్ల మోహరించారు. కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా దానికి సంబంధించిన జాగ్రత్తల్ని తీసుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూడడం కోసం దిల్లీ సరిహద్దుల్ని మూసివేశారు.

శవాగార కార్మికులు ప్రత్యేక అతిథులు

ఎర్రకోట వద్ద వేడుకలకు ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరైనవారిలో అంగన్వాడీ కార్యకర్తలు, వీధి వ్యాపారులు, శవాగార కార్మికులు, ముద్రా పథకం రుణగ్రహీతలు కూడా ఉన్నారు.

భారత్‌లో తయారైన శతఘ్నితో శాల్యూట్‌

ఈసారి స్వాతంత్య్ర వేడుకల్లో తొలిసారిగా.. ‘21 గన్‌ శాల్యూట్‌’ కోసం భారత్‌లో తయారైన హొవిట్జర్‌ శతఘ్నిని వినియోగించారు. ఇదివరకు బ్రిటిష్‌ తయారీ తుపాకుల్ని వాడేవారు. ఎన్‌సీసీ కేడెట్లు తమతమ రాష్ట్రాల సంప్రదాయ దుస్తుల్లో వచ్చి, భారతదేశ చిత్రపటం ఆకారంలో ఆశీనులయ్యారు. వారితో మోదీ కొద్దిసేపు ముచ్చటించారు. పెద్దఎత్తున ప్రజలు ఎర్రకోట వెలుపలకు చేరి జాతీయ పతాకాలు, మూడు రంగుల టోపీలతో సందడి చేశారు.

జనగణమన ఆలపించిన శరణార్థులు

మన దేశంలో శరణార్థులుగా ఉంటున్నవారిలో నాలుగు దేశాలకు చెందిన 12 మంది గాయకులు తమతమ సంప్రదాయ దుస్తులు ధరించి, గ్రామీ పురస్కార గ్రహీత రికీ కేజ్‌తో కలిసి ‘జనగణమన’ ఆలపించారు.


యాంత్రిక ఏనుగులతో పహారా

ప్రధాని నరేంద్రమోదీ ఈసారి సంప్రదాయ కుర్తా-పైజామాతో పాటు జాతీయ జెండాలోని మూడు రంగులతో కూడిన తలపాగాను ధరించారు. ఎర్రకోట మొత్తాన్ని త్రివర్ణాలతో, రంగురంగుల పువ్వులతో అలంకరించారు. హెలికాప్టర్ల ద్వారా పూలరేకుల్ని జల్లారు. కోట ప్రవేశద్వారం వద్ద రెండు యాంత్రిక ఏనుగుల్ని ఉంచారు. వీటిలోపల ఒక్కొక్కరు చొప్పున కూర్చొని పహారా కాశారు. కార్యక్రమం ముగిశాక అనేకమంది వీటిముందు స్వీయచిత్రాలు తీసుకున్నారు. ప్రధాని ప్రసంగం పూర్తయ్యాక జాతీయ పతాకంలోని రంగులతో కూడిన బెలూన్లను గాలిలోకి వదిలారు. స్వాతంత్య్ర సమరయోధుల ఘనతను చాటేలా కోట గోడలపై వారి వివరాలను ప్రదర్శించారు.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts