మహిళల పట్ల భాజపా వైఖరిని సమీక్షించుకోండి

స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో ప్రధాని మోదీ చేసిన ‘నారీశక్తి’ వ్యాఖ్యలకు పలువురు విపక్ష నేతలు స్పందించారు. అసలు మహిళల పట్ల భాజపా వైఖరి ఎలా ఉంటోందో ప్రధాని సమీక్షించుకోవాలని హితవు పలికారు. మహిళలను కించపరిచే పనులు

Published : 16 Aug 2022 05:45 IST

ప్రధాని మోదీ ‘నారీ శక్తి’ వ్యాఖ్యలపై విపక్ష నేతల విసుర్లు

దిల్లీ: స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో ప్రధాని మోదీ చేసిన ‘నారీశక్తి’ వ్యాఖ్యలకు పలువురు విపక్ష నేతలు స్పందించారు. అసలు మహిళల పట్ల భాజపా వైఖరి ఎలా ఉంటోందో ప్రధాని సమీక్షించుకోవాలని హితవు పలికారు. మహిళలను కించపరిచే పనులు చేయబోమని ప్రతిజ్ఞ చేయాలంటూ ప్రధాని పిలుపునివ్వడంపై... తృణమూల్‌ ఎంపీ డెరెక్‌ ఓబ్రియెన్‌ ట్విటర్‌లో స్పందించారు. బెంగాల్‌ ఎన్నికల ర్యాలీలో మోదీ ప్రసంగిస్తూ... మమతా బెనర్జీని ఉద్దేశించి ‘దీదీ... ఓ దీదీ’ అని సంబోధించిన వీడియోను దీనికి జత చేశారు. పార్లమెంటులో మహిళలను ఉద్దేశించి మోదీ చేసిన పలు వ్యాఖ్యలను కాంగ్రెస్‌ నేత పవన్‌ ఖెడా ట్వీట్‌ చేశారు. రాజ్యసభలో రేణుకా చౌదరి నవ్వడాన్ని కూడా ఆక్షేపించారని, మమతా బెనర్జీని అవమానించారని, 50 కోట్ల మంది గర్ల్‌ఫ్రెండ్స్‌ అంటూ మహిళలను కించపరిచారని, శశిథరూర్‌ భార్య సునంద పుష్కర్‌ విషయంలోనూ అవమానకరంగా మాట్లాడారని పేర్కొన్నారు. ‘‘మహిళలను కించపరచకుండా ఎవరైనా ప్రతిజ్ఞ చేయాల్సి ఉందంటే... అది ఈ మనిషి (మోదీ) మాత్రమే’’ అని పవన్‌ ఖెడా వ్యాఖ్యానించారు. మహిళల పట్ల భాజపా నేతల ప్రవర్తనను సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా కూడా ఆక్షేపించారు.

మహిళలతో పాటు సమాజంలోని వ్యక్తులందర్నీ గౌరవించాల్సిన అవసరం ఉందన్నారు. ‘మనుస్మృతి’ ఆలోచనలతో నడుస్తున్న పార్టీకి ఉభయసభల్లో అత్యధిక సీట్లు ఉన్నా మహిళా రిజర్వేషన్‌ బిల్లును ఎందుకు ఆమోదించడం లేదని ప్రశ్నించారు. మోదీ మాటలకూ, ఆయన చేతలకూ పొంతన ఉండదని శివసేన ఎంపీ ప్రియాంకా చతుర్వేది విమర్శించారు. మహారాష్ట్ర ప్రభుత్వంలో ఒక్క మహిళా మంత్రి కూడా లేకపోవడమే ఇందుకు నిదర్శనమన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని