చాటింగ్‌ చేసిన చీటింగ్‌.. ప్రియుడిని ‘బాంబర్‌’గా అభివర్ణించిన ప్రియురాలు

ప్రియుడు, ప్రియురాలి మధ్య సరదాగా సాగిన మొబైల్‌ చాటింగ్‌ 185 మందిని భయభ్రాంతులకు గురిచేసింది. మంగళూరు నుంచి ముంబయి వెళ్లాల్సిన ఇండిగో విమానాన్ని ఏకంగా ఆరు గంటల పాటు నిలిపేసింది. ఓ యువకుడు తన ప్రియురాలితో

Updated : 16 Aug 2022 07:11 IST

నిజమేనని భావించిన తోటి ప్రయాణికురాలు
మొత్తంగా ఆరు గంటలు ఆగిపోయిన విమానం

మంగళూరు: ప్రియుడు, ప్రియురాలి మధ్య సరదాగా సాగిన మొబైల్‌ చాటింగ్‌ 185 మందిని భయభ్రాంతులకు గురిచేసింది. మంగళూరు నుంచి ముంబయి వెళ్లాల్సిన ఇండిగో విమానాన్ని ఏకంగా ఆరు గంటల పాటు నిలిపేసింది. ఓ యువకుడు తన ప్రియురాలితో కలిసి ఆదివారం మంగళూరు విమానాశ్రయానికి వచ్చాడు. ప్రియుడు ముంబయి వెళ్లేందుకు.. ప్రియురాలు బెంగళూరు వెళ్లేందుకు విమాన టికెట్లు బుక్‌ చేసుకున్నారు. ముంబయి వెళ్లే విమానం రాగానే యువకుడు వెళ్లి విమానంలో కూర్చున్నాడు. ప్రియురాలు తన విమానం కోసం ఎదురుచూస్తోంది. ఈ క్రమంలో ఇద్దరూ మొబైల్‌లో చాటింగ్‌ చేసుకున్నారు. ఈ సందర్భంగా విమానాల్లో భద్రత గురించి సరదాగా మాట్లాడుకుంటూ ‘నువ్వే ఓ బాంబర్‌’ అంటూ ప్రియురాలు మెసేజ్‌ చేసింది. ఆ మెసేజ్‌ విమానంలో యువకుడి వెనక సీట్లో కూర్చున్న ఓ ప్రయాణికురాలి కంట్లో పడింది. దీంతో భయాందోళనలకు గురైన ఆమె విమాన సిబ్బందికి సమాచారమిచ్చారు. వారు ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోలర్‌ను అప్రమత్తం చేశారు. దీంతో టేకాఫ్‌ అవ్వాల్సిన విమానం ఆగిపోయింది. అసలే ఆగస్టు 15 కావడంతో అధికారులు విషయాన్ని తీవ్రంగా పరిగణించారు. అనంతరం విమానాశ్రయ సిబ్బంది ప్రయాణికులందరినీ దించేసి విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. అందులో ఎలాంటి అనుమానాస్పద వస్తువులు కన్పించలేదు. ఆ తర్వాత చాటింగ్‌ చేసిన ప్రియుడు, ప్రియురాలిని పోలీసులు కొన్ని గంటలపాటు ప్రశ్నించారు. అది కేవలం సరదా సంభాషణే అని తేలడంతో విమానం టేకాఫ్‌ అయ్యేందుకు అనుమతి ఇచ్చారు. అలా దాదాపు ఆరు గంటల తర్వాత సాయంత్రం 5 గంటలకు ఆ విమానం ముంబయి బయలుదేరింది. విచారణ అనంతరం ప్రియుడిని విమానం ఎక్కేందుకు అధికారులు అనుమతించారు. ప్రియురాలు మాత్రం విమానం ఎక్కలేక పోయింది. అది ఫ్రెండ్లీ చాటింగ్‌ అని తేలడంతో ఎవరూ ఫిర్యాదు చేయలేదని, దీంతో కేసు నమోదు చేయలేదని పోలీసులు తెలిపారు.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని