ముకేశ్‌ అంబానీ కుటుంబానికి బెదిరింపులు

ప్రముఖ వ్యాపారవేత్త ముకేశ్‌ అంబానీకి బెదిరింపులు వచ్చాయి. ఓ వ్యక్తి నుంచి సోమవారం ముంబయిలోని రిలయన్స్‌ ఫౌండేషన్‌ ఆస్పత్రికి ఈ మేరకు ఫోన్‌కాల్స్‌ వచ్చాయి. అంబానీని, ఆయన కుటుంబాన్ని చంపేస్తామంటూ ఆ వ్యక్తి

Published : 16 Aug 2022 05:45 IST

నగల వ్యాపారి అరెస్టు

ముంబయి: ప్రముఖ వ్యాపారవేత్త ముకేశ్‌ అంబానీకి బెదిరింపులు వచ్చాయి. ఓ వ్యక్తి నుంచి సోమవారం ముంబయిలోని రిలయన్స్‌ ఫౌండేషన్‌ ఆస్పత్రికి ఈ మేరకు ఫోన్‌కాల్స్‌ వచ్చాయి. అంబానీని, ఆయన కుటుంబాన్ని చంపేస్తామంటూ ఆ వ్యక్తి బెదిరించినట్లు పోలీసులు తెలిపారు. ఈ వ్యవహారంలో బిష్ణు భౌమిక్‌ (56) అనే నగల వ్యాపారిని అరెస్టు చేశారు. రిలయన్స్‌ ఆసుపత్రికి సంబంధించిన ల్యాండ్‌ లైన్‌ నంబర్‌కు ఈ కాల్స్‌ వచ్చాయి. నిందితుడు తన పేరును అఫ్జల్‌గా చెప్పాడు. రెండు గంటల వ్యవధిలో 8సార్లు ఫోన్‌ చేశాడు. వీటిపై ఆస్పత్రి వర్గాలు స్థానిక డీబీ మార్గ్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాయి. ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించిన పోలీసు అధికారులు.. వెంటనే అంబానీ నివాసానికి పెద్ద సంఖ్యలో సిబ్బందిని పంపారు. ఆ ప్రాంతంలో విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఫోన్‌ కాల్స్‌ ఆధారంగా ముంబయి దహిసర్‌లో భౌమిక్‌ను అదుపులోకి తీసుకున్నారు. గతంలోనూ అతడు బెదిరింపు కాల్స్‌ చేసినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ముకేశ్‌ అంబానీ కుటుంబానికి హెచ్చరికలు చేయడం వెనుక కారణాల గురించి భౌమిక్‌ను ప్రశ్నిస్తున్నట్లు వివరించారు. అతడి మానసిక పరిస్థితి సరిగాలేదా అన్న కోణంలో పరిశీలన సాగిస్తున్నారు. ఈ అంశంపై కేంద్ర భద్రతా సంస్థలూ దృష్టిసారించాయి. కేసు వివరాలను తెలియజేయాల్సిందిగా ముంబయి పోలీసులను కోరాయి. గత ఏడాది ఫిబ్రవరిలో పేలుడు పదార్థాలతో నిండిన ఒక కారును అంబానీ నివాసం వద్ద నిలిపి ఉంచిన సంగతి తెలిసిందే. అందులో అంబానీని హెచ్చరిస్తూ ఉన్న లేఖ కూడా లభ్యమైంది. ఆ కేసులో కొందరు పోలీసు అధికారులు సహా పలువురు అరెస్టయ్యారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని