Indian Army: 1984లో గల్లంతైన జవాను ఆచూకీ లభ్యం

38 ఏళ్ల క్రితం గస్తీ విధుల్లో ఉండగా హిమపాతం సంభవించడంతో గల్లంతైన జవాను ఆచూకీని భారత సైన్యం ఎట్టకేలకు గుర్తించింది. ఈ మేరకు సియాచిన్‌లోని ఓ పాత బంకర్‌లో 19 కుమావు రెజిమెంట్‌కు చెందిన చంద్రశేఖర్‌ హర్బోలా మృతదేహం

Updated : 16 Aug 2022 07:33 IST

సియాచిన్‌లో పాత బంకర్‌లో మృతదేహం గుర్తింపు

హల్ద్వానీ (ఉత్తరాఖండ్‌): 38 ఏళ్ల క్రితం గస్తీ విధుల్లో ఉండగా హిమపాతం సంభవించడంతో గల్లంతైన జవాను ఆచూకీని భారత సైన్యం ఎట్టకేలకు గుర్తించింది. ఈ మేరకు సియాచిన్‌లోని ఓ పాత బంకర్‌లో 19 కుమావు రెజిమెంట్‌కు చెందిన చంద్రశేఖర్‌ హర్బోలా మృతదేహం లభించినట్లు ద సైనిక్‌ గ్రూప్‌ సెంటర్‌ రానీఖెత్‌ ప్రకటించింది. మృతదేహం పక్కనే ఐడెంటిఫికేషన్‌ డిస్క్‌లు లభించాయి. వాటిపై ఉన్న ఆర్మీ నంబరు ఆధారంగా ఆ మృతదేహం లాన్స్‌ నాయక్‌ చంద్రశేఖర్‌దేనని నిర్ధరించారు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రణక్షేత్రమైన సియాచిన్‌పై నియంత్రణ కోసం 1984లో పాకిస్థాన్‌తో పోరాడేందుకు చేపట్టిన ‘ఆపరేషన్‌ మేఘదూత్‌’లో భాగంగా తరలివెళ్లిన 20 మంది సైనికుల్లో చంద్రశేఖర్‌ ఒకరు. ఈ క్రమంలో వారంతా మంచు తుపానులో చిక్కుకుని మరణించారు.

అనంతరం సైన్యం 15 మృతదేహాలను గుర్తించింది. మిగిలిన అయిదుగురి ఆచూకీ లభించలేదు. అలా ఆచూకీ లభించని అయిదుగురిలో ఒకరు చంద్రశేఖర్‌. చంద్రశేఖర్‌ సతీమణి శాంతిదేవి ప్రస్తుతం ఇక్కడి సరస్వతీ విహార్‌ కాలనీలో నివాసం ఉంటున్నారు. చంద్రశేఖర్‌ మృతదేహం సోమవారం రాత్రికి నివాసానికి చేరవచ్చని భావిస్తున్నారు. హల్ద్వానీ సబ్‌ కలెక్టర్‌ మనీశ్‌ కుమార్‌, తహసీల్దార్‌ సంజయ్‌ కుమార్‌ సోమవారం శాంతీదేవి దగ్గరకు వెళ్లి పరామర్శించారు. అమర సైనికుడికి పూర్తి సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తామని తెలిపారు. చంద్రశేఖర్‌ మరణించే సమయానికి తమకు వివాహం జరిగి తొమ్మిదేళ్లు అయిందని, అప్పటికి తమ కుమార్తెకు నాలుగేళ్లు కాగా, కుమారుడికి ఏడాదిన్నర మాత్రమేనని శాంతీదేవి తెలిపారు. 1984 జనవరిలో చివరిసారి తన భర్త ఇంటికి వచ్చారని, త్వరలో మళ్లీ వస్తానని హామీ ఇచ్చారని గుర్తు చేసుకున్నారు. ఇంటికి వస్తానన్న తన హామీని నెరవేర్చకున్నా.. దేశ రక్షణలో ప్రాణాలు కోల్పోయినందుకు గర్వంగా భావిస్తున్నట్లు తెలిపారు. ఉత్తరాఖండ్‌లోని ధారావత్‌ పట్టణానికి చెందిన చంద్రశేఖర్‌ 1975లో సైన్యంలో చేరారు. చంద్రశేఖర్‌ మృతదేహంతోపాటు మరో సైనికుడి మృతదేహం లభించినా అది ఎవరిదన్నది గుర్తించాల్సి ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని