Updated : 17 Aug 2022 10:30 IST

సాగర జలాల్లో మహాన్వేషణ!

6 వేల మీటర్ల లోతుకు వెళ్లనున్న పరిశోధకులు

సముద్రయాన్‌లో ముందడుగు వేసేందుకు సన్నద్ధమవుతున్న భారత్‌

భూగోళం విస్తీర్ణంలో దాదాపు 70% వాటా మహాసముద్రాలదే. మానవ జీవితాలను అవి ప్రత్యక్షంగా, పరోక్షంగా చాలా ప్రభావితం చేస్తున్నాయి. అయితే మహాసాగరాల లోతుల్లోని ఎన్నో అంశాలు.. మానవాళికి ఇప్పటికీ అంతుచిక్కని ప్రశ్నలే. ఈ నేపథ్యంలో వాటి గుట్టుమట్లు విప్పేందుకు, కీలక వనరుల అన్వేషణ చేపట్టేందుకు ప్రతిష్ఠాత్మక సముద్రయాన్‌ మిషన్‌కు గత ఏడాది అక్టోబరులో శ్రీకారం చుట్టిన భారత్‌.. అతి త్వరలో మరో కీలక ముందడుగు వేయబోతోంది. మహాసముద్రాల లోపల అధ్యయనాలు నిర్వహించేందుకు మానవసహిత సబ్‌మెర్సిబుల్‌ వాహనాన్ని పంపించబోతోంది.


సిద్ధమవుతున్న మత్స్య 6000

మహాసముద్రాల్లో భారత్‌ తలపెట్టిన తొలి మానవసహిత మిషన్‌- సముద్రయాన్‌. స్వయంచోదిత సబ్‌మెర్సిబుల్‌ యంత్రాన్ని అభివృద్ధి చేయాలన్నది దీని లక్ష్యాల్లో ఒకటి. ఆ లక్ష్యాన్ని చేరుకునే ప్రయత్నాల్లో భాగంగా భారత్‌ ‘మత్స్య 6000’ పేరుతో సబ్‌మెర్సిబుల్‌ వాహనం ప్రాథమిక డిజైన్‌ను దేశీయంగా ఇప్పటికే అభివృద్ధి చేసింది. సాగర లోతుల్లో 12 గంటల పాటు అది కార్యకలాపాలను నిర్వహించగలదు. అత్యవసర పరిస్థితులు తలెత్తినప్పుడు అవసరమైతే 96 గంటల పాటు సాగర గర్భంలో ఉండగల సామర్థ్యం కూడా దానికి ఉంది. ఇస్రో, డీఆర్‌డీవో వంటి అగ్రగామి సంస్థలు ఈ యంత్రానికి మరిన్ని మెరుగులు దిద్దనున్నాయి.


ఎంత లోతు వెళ్తారు?

సముద్రయాన్‌లో భాగంగా ముగ్గురు నిపుణుల బృందాన్ని జల ఉపరితలం నుంచి దాదాపు 6 వేల మీటర్ల లోతు వరకు పంపించనున్నారు. వారు సాగర గర్భంలో మునుపెన్నడూ పరిశీలించని ప్రాంతాలను నేరుగా వీక్షించి.. అక్కడి పరిస్థితులను క్షుణ్నంగా అధ్యయనం చేస్తారు. ‘మత్స్య 6000’లో అమర్చే పలు అత్యాధునిక సెన్సర్లు, శాస్త్రీయ పరికరాలు వారికి ఉపకరిస్తాయి. ముఖ్యంగా సముద్ర ఉపరితలానికి వెయ్యి నుంచి 5,500 మీటర్ల మధ్య పాలీమెటాలిక్‌ మాంగనీస్‌ నాడ్యూళ్లు, గ్యాస్‌ హైడ్రేట్లు, హైడ్రో థర్మల్‌ సల్ఫైడ్‌లు, కోబాల్ట్‌ క్రస్ట్‌లు వంటి వనరుల అన్వేషణకు ఈ మిషన్‌ దోహదపడనుంది.


మనకు ఎందుకు ముఖ్యమంటే..

భారత్‌కు 7,517 కిలోమీటర్ల పొడవైన సుదీర్ఘ తీర రేఖ ఉంది. దేశంలో 9 తీరప్రాంత రాష్ట్రాలు, 1,382 దీవులు ఉన్నాయి. దేశాభివృద్ధికి ఊతంగా నిలిచే సత్తా ఉన్న టాప్‌-10 రంగాల్లో ఒకటిగా ‘నీలి ఆర్థిక వ్యవస్థ’ను కేంద్ర ప్రభుత్వం పరిగణిస్తోంది. ఈ నేపథ్యంలో సముద్ర గర్భంలో వనరుల అన్వేషణ అత్యావశ్యకంగా మారింది. అందుకే రూ.4,077 కోట్లతో ‘డీప్‌ ఓషన్‌ మిషన్‌ (డీవోఎం)’ను ఆమోదించింది. సముద్రయాన్‌.. డీవోఎంలో భాగమే.

- ఈనాడు, ప్రత్యేక విభాగం

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని