ఉన్నావ్‌ బాధితురాలిపై ఎదురు కేసును దిల్లీకి బదిలీ చేయాలని వ్యాజ్యం

అత్యాచార నిందితుడి తండ్రి తనపై నమోదు చేసిన ఎదురు కేసును ఉత్తర్‌ప్రదేశ్‌లోని ట్రయల్‌ కోర్టు నుంచి దిల్లీకి బదిలీ చేయాలని కోరుతూ ఉన్నావ్‌ బాధితురాలు దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు

Published : 17 Aug 2022 04:05 IST

 విచారణకు సీజేఐ జస్టిస్‌ ఎన్‌.వి.రమణ సుముఖత

దిల్లీ: అత్యాచార నిందితుడి తండ్రి తనపై నమోదు చేసిన ఎదురు కేసును ఉత్తర్‌ప్రదేశ్‌లోని ట్రయల్‌ కోర్టు నుంచి దిల్లీకి బదిలీ చేయాలని కోరుతూ ఉన్నావ్‌ బాధితురాలు దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. ఈ కేసును సత్వరమే విచారించాలన్న బాధితురాలి తరఫు న్యాయవాది బృందా గ్రోవర్‌ అభ్యర్థనను ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్‌ ఎన్‌.వి.రమణ నేతృత్వంలోని ధర్మాసనం పరిగణనలోకి తీసుకుంది. వచ్చే వారం విచారణ జరిపే కేసుల జాబితాలో చేర్చుతున్నట్లు తెలిపింది. ఈ ధర్మాసనంలో జస్టిస్‌ జె.కె.మహేశ్వరి, జస్టిస్‌ హిమా కోహ్లి సభ్యులుగా ఉన్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఉన్నావ్‌లో మైనర్‌ బాలిక అపహరణ, అత్యాచారం కేసులో భాజపా బహిష్కృత ఎమ్మెల్యే కులదీప్‌ సింగ్‌ సెంగార్‌కు దిల్లీ కోర్టు 2019లో యావజ్జీవ జైలు శిక్ష విధించింది. ఇదే కేసులో మరో నిందితుడు శుభమ్‌సింగ్‌ తరఫున అతని తండ్రి.. బాధితురాలిపై చీటింగ్‌, ఫోర్జరీ కేసు పెట్టారు. దీనిపై ఉన్నావ్‌లోని స్థానిక కోర్టు బాధితురాలికి నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేసింది. అత్యాచార కేసు నుంచి నిందితుడిని తప్పించాలనే దురుద్దేశంతో తనపై ఆరోపణలు చేస్తున్నారని, ఈ కేసును ఉత్తర్‌ప్రదేశ్‌ నుంచి దిల్లీకి బదిలీ చేయాలని కోరుతూ బాధితురాలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆమె పిటిషన్‌పై మంగళవారం వాదనలు విన్న సీజేఐ జస్టిస్‌ ఎన్‌.వి.రమణ ధర్మాసనం విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది. తనకు జైలు శిక్ష విధించడాన్ని సవాల్‌చేస్తూ కులదీప్‌ సింగ్‌ సెంగార్‌ దిల్లీ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ ప్రస్తుతం పెండింగ్‌లో ఉంది. సెంగార్‌ పిటిషన్‌పై స్పందన తెలియజేయాల్సిందిగా సీబీఐని న్యాయస్థానం ఆదేశించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని