Published : 17 Aug 2022 04:05 IST

ఎన్నికల ప్రసంగాల నియంత్రణకు యత్నించడం వృథా ప్రయాసే

 ‘ఉచితాల’పై కేసులో సుప్రీంకు తెలిపిన ఆమ్‌ ఆద్మీ పార్టీ

దిల్లీ: రాజకీయ పార్టీలు కుమ్మరించే ఉచిత వాగ్దానాలను కట్టడి చేయడం కోసం ఎన్నికల ప్రసంగాలపై నియంత్రణ విధించాలని యత్నించడం వృథా ప్రయాసే అవుతుందని ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) అభిప్రాయపడింది. చట్టాల మద్దతులేని ఇటువంటి ప్రయత్నాల వల్ల రాజ్యాంగంలో పొందుపరిచిన భావ ప్రకటన స్వేచ్ఛకు, వాక్‌ స్వాతంత్య్ర హక్కుకు భంగం కలుగుతుందని మంగళవారం సుప్రీంకోర్టుకు తెలిపింది. ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు ఇచ్చే నిర్హేతుకమైన ఉచిత హామీలను కట్టడి చేయడానికి నిపుణుల కమిటీని నియమించే విషయాన్ని సర్వోన్నత న్యాయస్థానం పరిశీలిస్తోంది. ఈ అంశంపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ నేతృత్వంలోని ధర్మాసనం రాజకీయ పార్టీల అభిప్రాయాలను కోరిన విషయం తెలిసిందే. దీనిలో భాగంగానే ఆప్‌ తన వైఖరిని తెలియజేసింది. ‘రాజకీయ ప్రసంగాలపై కార్యనిర్వాహక వర్గం లేదా న్యాయవ్యవస్థ ద్వారా విధించే ఆంక్షలు లేదా నిషేధాలు రాజ్యాంగ అధికరణం 19(1)(ఎ)లో పొందుపరిచిన వాక్‌ స్వాతంత్య్ర హక్కును కట్టడి చేస్తాయి. ఆర్థిక లోటు, ద్రవ్యోల్బణం పెరిగిపోతుందనే ఆందోళనతో దాఖలైన వ్యాజ్య లక్ష్యం ఎన్నికల వాగ్దానాల కట్టడి మాత్రమే అయితే అది నిరాశజనకమైన ఫలితాలనే ఇస్తుంద’ని ఆప్‌ పేర్కొంది. ప్రజాస్వామ్య ప్రక్రియలో ఎన్నికల వాగ్దానాలు అతిముఖ్యమైన భాగమని, సంక్షేమ కార్యక్రమాలపై సైద్ధాంతిక వైఖరిని ఓటర్లకు చేరవేయకుండా పార్టీలను నిరోధించడం ప్రజాస్వామ్య నాణ్యతను దెబ్బతీస్తుందని తెలిపింది. ఎన్నికల్లో ఓడిపోయిన పార్టీల వాగ్దానాలు అధికారిక ప్రకటనలుగా మారబోవని, ప్రభుత్వ ప్రణాళికల్లోనూ వాటికి చోటుండదని వివరించింది. ‘ప్రజలు ఎనుకున్న పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తన వాగ్దానాల్లో వేటికి మార్పులు చేయాలి, వేటిని ముందుకు తీసుకెళ్లాలో కసరత్తు చేస్తుంది. ప్రజల అవసరాలను తీర్చేందుకు బడ్జెట్‌ను రూపొందించుకుంటుంది. నిపుణులు, ప్రజల అభిప్రాయాలను తెలుసుకుంటుంద’ని ఆప్‌ పేర్కొంది. న్యాయవాది అశ్వినీ ఉపాధ్యాయ్‌ దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై బుధవారం సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని