ఎంఎస్‌పీ కమిటీ సమావేశానికి వెళ్లం: ఎస్‌కేఎం

ఈ నెల 22న దిల్లీలో నిర్వహించే కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ) పరిశీలక కమిటీ సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్లు సంయుక్త కిసాన్‌ మోర్చా (ఎస్‌కేఎం) ప్రకటించింది. ఈమేరకు భవిష్యత్‌ కార్యాచరణను

Published : 17 Aug 2022 05:51 IST

దిల్లీ: ఈ నెల 22న దిల్లీలో నిర్వహించే కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ) పరిశీలక కమిటీ సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్లు సంయుక్త కిసాన్‌ మోర్చా (ఎస్‌కేఎం) ప్రకటించింది. ఈమేరకు భవిష్యత్‌ కార్యాచరణను త్వరలోనే వెల్లడిస్తామని 40 రైతు సంఘాలతో కూడిన ఎస్‌కేఎం తెలిపింది. ఎంఎస్‌పీ కమిటీని పెద్ద ప్రహసనంగా అభివర్ణించింది. సమావేశంలో జరిపే చర్చలతో ఒరిగేదేమీ ఉండదని ఎస్‌కేఎం ప్రతినిధులు పేర్కొన్నారు. గత ఏడాది నవంబరులో మూడు వివాదాస్పద సాగు చట్టాలను రద్దు చేసిన సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎంఎస్‌పీ విషయమై కమిటీ వేస్తామని ప్రకటించారు. ఈమేరకు జూలై 18న మాజీ వ్యవసాయ కార్యదర్శి సంజయ్‌ అగర్వాల్‌ నేతృత్వంలో 26 మంది సభ్యులతో కమిటీ ఏర్పాటైంది. వారిలో వివిధ రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులతోపాటు నీతి ఆయోగ్‌, ఇఫ్కో తదితర సంస్థల ప్రతినిధులున్నారు. ఎస్‌కేఎంని కూడా ముగ్గురు ప్రతినిధులను పంపాలని కేంద్రం కోరినా ఆ సంఘం తిరస్కరించింది. కేంద్రం నియమించిన కమిటీని తాము అంగీకరించడం లేదని, అందులో రైతులమని చెప్పుకునేవారు ఉన్నారని, వారెవరికీ సాగు చట్టాలకు వ్యతిరేకంగా తాము దిల్లీ శివార్లలో నిర్వహించిన సుదీర్ఘ ఉద్యమంతో సంబంధం లేదని ఎస్‌కేఎం నేత హన్నన్‌ మొల్ల పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని