Updated : 18 Aug 2022 05:52 IST

CJI: ఉచితం సంక్లిష్టం

నిజమైన సంక్షేమ చర్యలతో ఉచితాలను కలపొద్దు
ఓటర్లు ఉచితాల కోసం చూడటం లేదు
గౌరవప్రదమైన ఆదాయాన్ని వారు కోరుకుంటున్నారు
సీజేఐ జస్టిస్‌ ఎన్‌.వి.రమణ వ్యాఖ్యలు
ఈనాడు - దిల్లీ

రాజకీయ పార్టీలు ఉచిత హామీలు ఇవ్వకుండా అడ్డుకోలేం. అలాగే ఉచిత హామీలు ఒక్కటే ఎన్నికల ఫలితాలను నిర్ణయిస్తాయని భావించడం లేదు. కొన్ని పార్టీలు అనేక వాగ్దానాలు చేసినప్పటికీ ఎన్నికల్లో గెలవలేకపోతున్నాయి. అంతేగాక.. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ వంటి పథకాలు పౌరులు గౌరవంగా జీవించేందుకు దోహదపడుతున్నాయి.

- చీఫ్‌ జస్టిస్‌ ఎన్‌.వి.రమణ

చిత పథకాల అంశం రోజురోజుకీ సంక్లిష్టంగా మారుతోందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ వ్యాఖ్యానించారు. విద్య, వైద్యం, తాగునీరు వంటి కనీస అవసరాలు కల్పించడాన్ని ఉచితం అనగలమా? అని ప్రశ్నించారు. రాష్ట్రాల ఆర్థిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకోకుండా రాజకీయ పార్టీలు చేసే ఉచిత వాగ్దానాలను అడ్డుకొనేలా కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని కోరుతూ న్యాయవాది అశ్వినీకుమార్‌ ఉపాధ్యాయ్‌ దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై బుధవారం సీజేఐ జస్టిస్‌ రమణ, జస్టిస్‌ జె.కె.మహేశ్వరి, జస్టిస్‌ హిమాకొహ్లిల ధర్మాసనం విచారణ చేపట్టింది. ఉచిత తాయిలాలు (ఫ్రీబీస్‌), అసలైన సంక్షేమ పథకాల మధ్య గందరగోళానికి గురికాకూడదని ధర్మాసనం తేల్చిచెప్పింది. ఎవరికీ ఏదీ ఉచితంగా రాదనే నానుడిని ప్రస్తావించింది. ఓటర్లు ఉచితాల కోసం చూడడం లేదని, అవకాశమిస్తే గౌరవప్రదంగా ఆదాయాన్ని పొందాలని వారు కోరుకుంటున్నారని స్పష్టంచేసింది. పలువురు న్యాయవాదులు ఒకేసారి తమ వాదనలను వినిపించడానికి ప్రయత్నించడంతో జస్టిస్‌ రమణ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇలాగైతే కేసు విచారణను వాయిదా వేయాల్సి వస్తుందని హెచ్చరించారు. డీఎంకే న్యాయవాది విల్సన్‌ను ఉద్దేశించి మాట్లాడుతూ ‘మీ అభ్యంతరాలు వ్యక్తం చేసే హక్కు మీకు ఉంది. మీరు పిటిషన్‌ను వ్యతిరేకిస్తున్న కారణంగా నేను ఉత్తర్వులు జారీచేయడానికి వీల్లేదనడానికి లేదు. మీరు మీ అభిప్రాయాలు చెప్పండి. వాటిని పరిగణనలోకి తీసుకుంటాం’ అని స్పష్టం చేశారు.

హామీలు ఇవ్వకుండా అడ్డుకోలేం

అన్నీ ఉచితంగా ఇవ్వడమే సామాజిక సంక్షేమమని అర్థం చేసుకుంటే అది అపరిపక్వ అవగాహన కిందికి వస్తుందని సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా పేర్కొన్నారు. జస్టిస్‌ రమణ స్పందిస్తూ- ‘‘సంక్షేమ కార్యక్రమాలను ఉచిత పథకాల కింద పరిగణించకూడదు. ఆర్టికల్‌ 38(2) ప్రకారం ఆదాయ అసమానతల తగ్గింపునకు ప్రభుత్వాలు ప్రయత్నించాలి. అవకాశాలు వ్యక్తులకే కాకుండా విభిన్న వృత్తుల్లో ఉన్న ప్రజలకు సామూహికంగానూ కల్పించాలి. తాము అధికారంలోకి వస్తే రాజ్యాంగం నిర్దేశించిన ఫలానా విషయాలను అమలు చేస్తామని రాజకీయ పార్టీలు, వ్యక్తులు హామీలు ఇవ్వకుండా అడ్డుకోలేం. అర్హమైన వాగ్దానాలు ఏంటన్నదే ప్రశ్న. ఉచిత నిర్బంధ విద్యను ఉచిత హామీగా నిర్వచించగలమా? చిన్న-సన్నకారు రైతులకు వ్యవసాయాన్ని గిట్టుబాటుగా మార్చడానికి విద్యుత్తు, ఎరువులు, విత్తనాలు రాయితీ ధరపై ఇవ్వడం ఉచితమనగలమా? సార్వత్రిక ఉచిత వైద్యాన్ని, తాగునీటిని, అత్యవసరాల కోసం అందించే కనీస యూనిట్ల విద్యుత్తును ఉచితం అని చెప్పగలమా?’’ అని ప్రశ్నించారు.

వాటిని సంక్షేమం అనగలమా?

‘‘నగలు, ఎలక్ట్రానిక్‌ వినియోగ వస్తువులను ఇవ్వడాన్ని సంక్షేమ కార్యక్రమాలుగా నిర్వచించగలమా? ఉచిత కోచింగ్‌ తరగతుల నిర్వహణను ఉచిత పథకం అనవచ్చా? ఓటర్లు దేనిని ఉచితంగా భావిస్తున్నారన్నది వేరే విషయం. గౌరవప్రదమైన ఆదాయం సంపాదించుకోవడానికి అవకాశం ఇవ్వడం ఉచితమవుతుందా? ప్రజలు పన్నుల రూపంలో కట్టే ధనాన్ని వృథా చేస్తున్నారని కొందరు చెబుతుంటే, మరికొందరు ప్రోత్సాహకాలు ఇవ్వడానికి అది అవసరమని చెబుతున్నారు. ఈ విషయాలను విచారించే అధికారం కోర్టుకు ఉందా? అనే ప్రశ్న ఉదయిస్తోంది. మీరు మీ అభిప్రాయాలు చెప్పండి. ఆ తర్వాతే ఏ నిర్ణయమైనా తీసుకోగలం. మీరు సమర్పించే అంశాలను చదివి ఆలోచించుకోనివ్వండి’’ అని జస్టిస్‌ రమణ అన్నారు. ఈ విషయాన్ని ప్రచారం కోసం ఉపయోగించుకోకుండా ఇందులోని పార్టీలంతా తమ అభిప్రాయాలను ఇతరులందరికీ పంపాలని సూచించారు. కేసును సమర్థించేవారు, వ్యతిరేకించేవారు అభిప్రాయాలను శనివారం సాయంత్రంలోపు లిఖితపూర్వకంగా చెప్పాలనీ, తదుపరి విచారణను ఈ నెల 23న చేపడతామని చెప్పారు.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని