Updated : 18 Aug 2022 05:57 IST

రైళ్లలో ఇక ‘స్థానిక’ రుచులు!

వీధివ్యాపారుల తరహా విక్రయాలకు లభించనున్న అనుమతులు

దిల్లీ: స్థానిక ఉత్పత్తులకు ఆదరణ పెంచడంలో తనవంతు పాత్ర పోషించేందుకు రైల్వే సన్నద్ధమైంది. ఆయా ప్రాంతాల్లో దొరికే ప్రత్యేక ఆహార పదార్థాలు, దుస్తులు, ఆట వస్తువుల వంటివాటన్నింటినీ వీధివ్యాపారుల తరహాలో రైళ్లు, రైల్వేసేషన్లలో వ్యక్తులు విక్రయించేందుకు ఇకపై అనుమతించనుంది. ఇందుకోసం ప్రత్యేకంగా రూపొందించిన బండ్లు, బడ్డీకొట్టులనూ సమకూర్చనుంది. ప్రతి రైల్వేస్టేషన్‌లో ఒక్కో స్థానిక వస్తువు/ఆహార పదార్థానికి ఆదరణ పెంపొందిస్తూ, స్థానిక వ్యాపారాలకు ఊపునిచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది బడ్జెట్‌లో ‘ఒక స్టేషన్‌, ఒక ఉత్పత్తి’ విధానాన్ని ప్రకటించింది. దాని అమలుకు ప్రస్తుతం రంగం సిద్ధమైంది. వాస్తవానికి గతంలోనూ వీధివ్యాపారులు రైళ్లలోకి ప్రవేశించి స్థానిక ఉత్పత్తులను (ఎక్కువగా ఆహార పదార్థాలు) అమ్ముకునేవారు. అయితే వారికి రైల్వే నుంచి అనుమతులు ఉండేవి కావు. ఆయా ఆహార పదార్థాలు/ఉత్పత్తుల పరిశుభ్రతపైనా ఆందోళనలు వ్యక్తమయ్యేవి. దీంతో అలాంటి వ్యాపారుల కార్యకలాపాలను రైల్వే ఎప్పటికప్పుడు అడ్డుకుంటూ వస్తోంది. అందుకు భిన్నంగా ప్రస్తుతం స్థానిక ఆహార పదార్థాలు, దుస్తులు, గృహోపకరణాలు అలంకరణ వస్తువుల వంటి ఉత్పత్తులన్నింటినీ స్టేషన్లు, రైళ్లలో విక్రయించుకునేందుకు వ్యక్తులకు అనుమతులు మంజూరు చేయనున్నారు. 15 రోజుల కాలపరిమితికి రూ.1,500 రుసుము చెల్లించి వారు లైసెన్సులు పొందాలి. నిర్దిష్ట స్టేషన్ల మధ్యలోనే వారు విక్రయాలు జరపాల్సి ఉంటుంది. 78 రైల్వేస్టేషన్లలో ప్రయోగాత్మకంగా ఈ విధానాన్ని అమలుచేయగా.. విక్రేతలు రోజుకు రూ.5 వేల చొప్పున సంపాదించారని రైల్వే అధికారి ఒకరు తెలిపారు. వ్యాపారుల విక్రయాలు సులువుగా సాగేందుకు, స్టేషన్లలో రద్దీ పెరగకుండా చూసేందుకు.. అహ్మదాబాద్‌లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డిజైన్‌తో చేతులు కలిపి ప్రత్యేక చక్రాల బండ్లను రైల్వే సిద్ధం చేయించింది.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని