Published : 18 Aug 2022 05:47 IST

డ్రగ్స్‌ తయారీ స్థావరంగా మారిన గుజరాత్‌

అహ్మదాబాద్‌: రెండేళ్ల కిందటి దాకా గుజరాత్‌కు బయటి రాష్ట్రాల నుంచి రూ.కోట్ల విలువచేసే మత్తుమందులు సరఫరా అవుతుండగా.. ఇపుడు రాష్ట్రంలోనే పలుచోట్ల తయారీ స్థావరాలు వెలిశాయి. గత ఏడాదిన్నర కాలంలో ఇక్కడ పట్టుబడినంత భారీగా మత్తుమందులు దేశంలో మరే రాష్ట్రంలోనూ పోలీసులకు చిక్కలేదు. ఒకేరోజు రాష్ట్రంలోని రెండు తయారీ స్థావరాలను ఛేదించిన నిఘా సిబ్బంది రూ.2 వేల కోట్లకు పైగా విలువైన మెఫెడ్రోన్‌ డ్రగ్స్‌ స్వాధీనం చేసుకోవడం తెలిసిందే. భరూచ్‌, వడోదర జిల్లాల్లో ఈ దాడులు జరిగాయి. భరూచ్‌ జిల్లాలోని అంక్లేశ్వర్‌లో ముంబయికి చెందిన మాదకద్రవ్య నిరోధక దళం దాడులు జరిపి రూ.వెయ్యి కోట్లకు పైగా విలువైన 513 కేజీల డ్రగ్స్‌ స్వాధీనం చేసుకోవడం గుజరాత్‌ పోలీసుల పనితీరుపై విమర్శలకు దారి తీస్తోంది. వడోదరలోని మోక్సీ గ్రామంలో గుజరాత్‌ ఉగ్రవాద వ్యతిరేక దళం (ఏటీఎస్‌) జరిపిన దాడుల్లో 225 కిలోల మెఫెడ్రోన్‌ డ్రగ్స్‌ పట్టుబడ్డాయి. రూ.1,125 కోట్ల విలువైన ఈ డ్రగ్స్‌ కేసులో ఆరుగురు నిందితులను అరెస్టు చేసినట్లు ఏటీఎస్‌ ఎస్పీ సునీల్‌ జోషి బుధవారం వెల్లడించారు. సూరత్‌కు చెందిన మహేశ్‌ వైష్ణవ్‌ ఈ డ్రగ్స్‌ కేంద్రానికి సూత్రధారిగా గుర్తించారు.

ద్రవరూప డ్రగ్స్‌ పట్టివేత

రసాయన పరిశ్రమలకు నిలయంగా ఉన్న భరూచ్‌ జిల్లాలో ముంబయి మాదకద్రవ్య నిరోధక దళం దాడుల అనంతరం.. స్థానిక ఎస్పీ లీనా పాటిల్‌ నేతృత్వంలో ఏర్పడిన ప్రత్యేకబృందం సోదాలు కొనసాగించింది. పనోలీ గ్రామంలోని మూడంతస్తుల కంపెనీలో ఈ బృందం సాగించిన తనిఖీల్లో రూ.కోట్ల విలువైన నిల్వలు, డ్రగ్స్‌ తయారీలో వాడే ముడి పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. రెండో అంతస్తులోని రియాక్టర్‌ నుంచి ద్రవరూపంలో ఉన్న 1,300 లీటర్ల మెఫెడ్రోన్‌, 83 కిలోల డ్రగ్స్‌ దొరికాయి. ఈ మత్తుమందు తయారీకి ముడిపదార్థాలను ముంబయి వంటి చోట్ల కొని తెస్తున్నారు. మళ్లీ ఆయా ప్రదేశాల్లోనే మార్కెటింగు చేస్తున్నారు. గత ఎనిమిది నెలలుగా ఈ కంపెనీలో మత్తుమందులు తయారుచేస్తున్నట్లు గుర్తించారు. ఈ అంతర్రాష్ట్ర డ్రగ్‌ రాకెట్‌కు అంతర్జాతీయ సంబంధాలు కూడా ఉన్నాయా అనే కోణంలో విచారణ కొనసాగుతోంది.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని