వైద్యులకు తాయిలాలపై సుప్రీం ఆందోళన

ఔషధ సంస్థలు తమ ఉత్పత్తులను మార్కెటింగ్‌ చేసుకునేందుకు వైద్యులకు పెద్ద ఎత్తున తాయిలాలు ఇవ్వడంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ప్రమాదకరమైన ఈ పరిణామంపై స్పందించాలని కేంద్రాన్ని ఆదేశించింది.

Published : 19 Aug 2022 04:33 IST

 నియంత్రణ చర్యలేమిటో తెలపాలని కేంద్రానికి ఆదేశం

డోలో-650ని సిఫార్సు చేసేందుకు రూ.1000 కోట్ల  బహుమతులిచ్చారని ఎఫ్‌ఎంఆర్‌ఏఐ ఆరోపణ

ఈనాడు, దిల్లీ: ఔషధ సంస్థలు తమ ఉత్పత్తులను మార్కెటింగ్‌ చేసుకునేందుకు వైద్యులకు పెద్ద ఎత్తున తాయిలాలు ఇవ్వడంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ప్రమాదకరమైన ఈ పరిణామంపై స్పందించాలని కేంద్రాన్ని ఆదేశించింది. డోలో-650 తయారీదారులు తమ మాత్రలను రోగులకు సిఫార్సు చేయించడం కోసం వైద్యులకు రూ.వెయ్యి కోట్ల వరకు బహుమతులు అందించారన్న కేంద్ర ప్రత్యక్ష పన్నుల మండలి(సీబీటీటీ) ఆరోపణలను ఫెడరేషన్‌ ఆఫ్‌ మెడికల్‌, సేల్స్‌ రిప్రజెంటేటివ్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎఫ్‌ఎంఆర్‌ఏఐ) సర్వోన్నత న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లింది. రోగులకు ఔషధాలను సిఫార్సు చేయించడం కోసం ఫార్మా కంపెనీలు వైద్యులకు ఎలాంటి ఉచితాలు అందించకుండా నిరోధించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై విచారణ సందర్భంగా జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌, జస్టిస్‌ ఎ.ఎస్‌.బోపన్నతో కూడిన ధర్మాసనం గురువారం కీలక వ్యాఖ్యలు చేసింది. ‘ఇది వినసొంపుగా ఏమీ లేదు. ఇది చాలా ఆందోళనకరమైన అంశం. కొవిడ్‌ సోకినప్పుడు ఇదే మాత్ర తీసుకోవాలని నాకు కూడా వైద్యులు సూచించార’ని జస్టిస్‌ చంద్రచూడ్‌ పేర్కొన్నారు. లాభార్జన కోసం ఔషధ సంస్థలు.. వైద్యులకు అనైతిక విధానాల్లో తాయిలాలు అందజేస్తున్నాయని ఎఫ్‌ఎంఆర్‌ఏఐ ఆరోపించింది. ఫార్మా సంస్థలు నైతికంగా వ్యవహరించేలా చూడటం చాలా ముఖ్యమని అభిప్రాయపడింది. జీవన హక్కులో.. వైద్య హక్కు కూడా భాగమేనని వాదించింది. కంపెనీలు వైద్యులకు తాయిలాలు అందించకుండా నిరోధించే చట్టమేమీ లేదని కోర్టుకు తెలిపింది. తాయిలాలు తీసుకొని ప్రజలకు ఔషధాలు సిఫార్సు చేసే ప్రక్రియ చాలా ప్రమాదకరమని పేర్కొంది. 500 ఎంజీ వరకు ఉన్న ట్యాబ్లెట్ల ధరపై మాత్రమే నియంత్రణకు అవకాశం ఉంటుందని, అంతకు మించిన మోతాదు మాత్రల ధరలను ఉత్పత్తిదారే ఇష్టానుసారం నిర్ణయించుకోవచ్చని వెల్లడించింది. ఈ విషయంలో సరైన చట్టాలు రూపొందించేలా పార్లమెంటును ఆదేశించాలని విన్నవించింది. ఈ వాదనలు విన్న ధర్మాసనం.. చట్టాలు చేయాలని న్యాయస్థానాలు ఆదేశించలేవని తెలిపింది. ఔషధాల మార్కెటింగ్‌లో అనైతిక విధానాల నిరోధానికి మార్గదర్శకాలు ఉన్నాయని, అయితే చట్టరూపంలో లేకపోవడంతో అమలుకావడంలేదని పిటిషనర్‌ తరఫు న్యాయవాది పేర్కొన్నారు. ఉల్లంఘనల నిరోధం, జవాబుదారీతనం, పారదర్శకతను తీసుకువచ్చే అంశంపై కేంద్ర ప్రభుత్వానికి ధర్మాసనం నోటీసు జారీ చేసింది. పది రోజుల్లో కౌంటర్‌ అఫిడవిట్‌ దాఖలు చేయాలని ఆదేశించింది. దానిపై రిజాయిండర్‌ దాఖలుకు అసోసియేషన్‌కు మరో వారం గడువిచ్చింది. తదుపరి విచారణను సెప్టెంబరు 29వ తేదీకి ధర్మాసనం వాయిదా వేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని