సంక్షిప్త వార్తలు (3)

పంజాబ్‌, హరియాణా హైకోర్టు న్యాయమూర్తులుగా నియామకానికి సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన ఇద్దరు న్యాయవాదుల పేర్లపై కేంద్ర ప్రభుత్వం విముఖత వ్యక్తం చేసింది. సంబంధిత వర్గాల సమాచారం మేరకు.. సుప్రీంకోర్టు 13 మంది

Updated : 20 Aug 2022 06:27 IST

కొలీజియం సిఫార్సుల్లో ఇద్దరి పేర్లపై కేంద్రం విముఖత

దిల్లీ: పంజాబ్‌, హరియాణా హైకోర్టు న్యాయమూర్తులుగా నియామకానికి సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన ఇద్దరు న్యాయవాదుల పేర్లపై కేంద్ర ప్రభుత్వం విముఖత వ్యక్తం చేసింది. సంబంధిత వర్గాల సమాచారం మేరకు.. సుప్రీంకోర్టు 13 మంది న్యాయవాదుల పేర్లను సిఫార్సు చేయగా, అందులో 11 మందిని జడ్జీలుగా నియమిస్తూ ఆగస్టు 14న కేంద్ర ప్రభుత్వ నోటిఫికేషన్‌ వెలువడింది. హెచ్‌.ఎస్‌.బ్రార్‌, కుల్దీప్‌ తివారీల పేరిట వచ్చిన సిఫార్సులను నిలిపివేసింది. ఇందులో ఒకరిపై కొన్ని పాత ఆరోపణలు ఉండగా, మరొకరికి తక్కువ వయసు కారణంగా తగినంత అనుభవం లేదని ఆ రెండు పేర్లను కేంద్ర న్యాయ మంత్రిత్వశాఖ నిలిపివేసింది. సాధారణంగా హైకోర్టు న్యాయమూర్తిగా నియామకం పొందాలంటే 45 నుంచి 55 మధ్య వయసున్న అభ్యర్థులను పరిగణనలోకి తీసుకుంటారు. ఆ రెండు పేర్లపై తగిన సమయంలో సముచిత నిర్ణయం తీసుకుంటారని అధికారవర్గాలు తెలిపాయి. సుప్రీంకోర్టు సిఫార్సులపై పునఃపరిశీలన కోరే హక్కు ప్రభుత్వానికి ఉంటుందని ఈ వర్గాలు వెల్లడించాయి.  


త్రిపురలో ఎదురు కాల్పులు

బీఎస్‌ఎఫ్‌ జవాన్‌ మృతి

ఈనాడు, గువాహటి: త్రిపురలోని పాణిసాగర్‌ సెక్టార్‌లో తీవ్రవాదులతో శుక్రవారం జరిగిన ఎదురుకాల్పుల్లో సరిహద్దు భద్రతా దళం (బీఎస్‌ఎఫ్‌) జవాన్‌ ఒకరు ప్రాణాలు కోల్పోయారు. 145వ బెటాలియన్‌లోని సీమా-2 సరిహద్దు అవుట్‌పోస్టు పరిధిలో గస్తీ కాస్తున్న సిబ్బందిపై బంగ్లాదేశ్‌ వైపు నుంచి తీవ్రవాదులు కాల్పులకు తెగబడటంతో జవాన్లు తిప్పికొడుతూ ఎదురుకాల్పులు జరిపారు. దీంతో తీవ్రవాదులు అడవిలోకి పారిపోయారు. ఈ ఘటనలో బీఎస్‌ఎఫ్‌ హెడ్‌ కానిస్టేబుల్‌ గ్రిజేశ్‌ కుమార్‌ ఉడ్డే తీవ్రంగా గాయపడటంతో హుటాహుటిన హెలికాప్టర్‌లో అగర్తలాకు తరలించారు. చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు.


కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్‌ భల్లా పదవీకాలం పొడిగింపు

ఈనాడు, దిల్లీ: కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్‌ కుమార్‌ భల్లా పదవీకాలాన్ని ప్రభుత్వం మరో ఏడాది పాటు పొడిగించింది. ఈమేరకు కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన 2023 ఆగస్టు 22 వరకు ఈ పదవిలో కొనసాగుతారని పేర్కొంది. ఆయన పదవీకాలాన్ని పొడిగించడం ఇది మూడోసారి. 1984 బ్యాచ్‌ అస్సాం-మేఘాలయ కేడర్‌ ఐఏఎస్‌ అధికారి అయిన భల్లా 2019 ఆగస్టులో కేంద్ర హోంశాఖ కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని