పల్లెలకు కొళాయి కళ

జల్‌ జీవన్‌ మిషన్‌ కింద తమ ప్రభుత్వం గత మూడేళ్లలో ఏకంగా ఏడు కోట్ల గ్రామీణ కుటుంబాలకు కొళాయి నీటి సదుపాయాన్ని కల్పించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. దీంతో దేశవ్యాప్తంగా పల్లెల్లో ఈ తరహా కనెక్షన్ల సంఖ్య 10 కోట్ల

Published : 20 Aug 2022 06:04 IST

మూడేళ్లలో 7 కోట్ల గ్రామీణ కుటుంబాలకు కనెక్షన్లు అందించాం
సర్కారు ఏర్పాటు కంటే.. దేశ నిర్మాణానికే ఎక్కువ కష్టపడాలి
ప్రధాని నరేంద్ర మోదీ  

పణజీ: జల్‌ జీవన్‌ మిషన్‌ కింద తమ ప్రభుత్వం గత మూడేళ్లలో ఏకంగా ఏడు కోట్ల గ్రామీణ కుటుంబాలకు కొళాయి నీటి సదుపాయాన్ని కల్పించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. దీంతో దేశవ్యాప్తంగా పల్లెల్లో ఈ తరహా కనెక్షన్ల సంఖ్య 10 కోట్ల మైలురాయికి చేరుకుందని చెప్పారు. నిజానికి ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయాలంటే పెద్దగా శ్రమించాల్సిన అవసరం లేదని, దేశ నిర్మాణానికి మాత్రం చాలా ఎక్కువ కష్టపడాల్సి ఉంటుందని వ్యాఖ్యానించారు. గోవాలో 100% గ్రామీణ కుటుంబాలకు కొళాయి నీటిని సరఫరా చేయాలన్న లక్ష్యాన్ని అందుకున్న నేపథ్యంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఏర్పాటుచేసిన ప్రత్యేక కార్యక్రమంలో మోదీ వీడియో లింక్‌ ద్వారా ప్రసంగించారు. ‘‘స్వాతంత్య్రం వచ్చాక ఏడు దశాబ్దాల్లో దేశవ్యాప్తంగా మూడు కోట్ల గ్రామీణ కుటుంబాలకే కొళాయి నీటి సరఫరా సదుపాయం దక్కింది. కానీ గత మూడేళ్లలోనే మేం గ్రామాల్లో అదనంగా ఏడు కోట్ల కనెక్షన్లు అందించాం. సురక్షిత తాగునీటి సరఫరా, పర్యావరణ పరిరక్షణ విషయంలో మా ప్రభుత్వ చిత్తశుద్ధికి ఇది నిదర్శనం’’ అని ఆయన పేర్కొన్నారు.

‘‘దేశం మూడు కీలక మైలురాళ్లను దాటింది. వాటిలో మొదటిది- గ్రామీణ ప్రాంతాల్లో 10 కోట్ల కొళాయి కనెక్షన్లు ఇవ్వడం. రెండోది- 100% కొళాయి కనెక్షన్లు ఉన్న ప్రాంతాల జాబితాలోకి గోవాతో పాటు దాద్రానగర్‌ హవేలీ, దమణ్‌ దీవ్‌ చేరడం. రాబోయే రోజుల్లో మరిన్ని రాష్ట్రాలు ఈ జాబితాలో చోటుదక్కించుకుంటాయి. మూడో మైలురాయి- స్వచ్ఛ భారత్‌కు సంబంధించినది. కొన్నేళ్ల క్రితమే భారత్‌ బహిరంగ మలవిసర్జన రహిత (ఓడీఎఫ్‌) దేశంగా అవతరించింది. ఆ తర్వాత ‘ఓడీఎఫ్‌ ప్లస్‌’ లక్ష్యాన్ని మనం విధించుకున్నాం. దేశవ్యాప్తంగా ఇప్పటికే లక్షకుపైగా గ్రామాలు దాన్ని అందుకున్నాయి’’ అని ప్రధాని తెలిపారు. ఓడీఎఫ్‌ హోదాను కాపాడుకుంటూనే.. ఘన, ద్రవ్య వర్థాల నిర్వహణ పనులను మెరుగ్గా చేపడుతూ, పరిశుభ్రంగా కనిపించే గ్రామాలు ఓడీఎఫ్‌ ప్లస్‌ కోటాలోకి వస్తాయి.

రాజకీయ సంకల్పం కావాలి

నీటి కొరత ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలకు అతిపెద్ద సవాలుగా మారిందని మోదీ అన్నారు. ‘అభివృద్ధి చెందిన దేశం’గా ఎదగడంలో భారత్‌కూ అది సమస్యగా మారే ముప్పుందని పేర్కొన్నారు. అందుకే దాన్ని అధిగమించేందుకు తమ సర్కారు నిరంతరం కృషిచేస్తోందని చెప్పారు. రాజకీయ సంకల్పం లేకపోతే అభివృద్ధి పనుల్లో ముందుకెళ్లలేమని అన్నారు. కొవిడ్‌ సమయంలోనూ కేంద్ర జలశక్తి శాఖ, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టుదలతో పనిచేశాయని.. ఆ ఫలితాలు ఇప్పుడు కనిపిస్తున్నాయని ప్రధాని పేర్కొన్నారు. కాంగ్రెస్‌పై పరోక్షంగా విమర్శలు గుప్పిస్తూ.. గత ప్రభుత్వాలు దేశ వర్తమానం, భవిష్యత్తు గురించి ఏమాత్రం పట్టించుకోలేదన్నారు. అవి జల సంరక్షణ గురించి మాటలకే పరిమితమయ్యాయంటూ ధ్వజమెత్తారు. ‘హర్‌ ఘర్‌ జల్‌’ పథకంతో అధికంగా లబ్ధి పొందుతున్నది మహిళలేనని ప్రధాని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు