పవన విద్యుత్తుకు ఎదురుగాలి

వాతావరణ మార్పుల కారణంగా దేశంలోని సౌర, పవన విద్యుత్‌ సామర్థ్యాలు భవిష్యత్తులో దెబ్బతినే పరిస్థితులు తప్పకపోవచ్చని పుణెలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ట్రాపికల్‌ మెటియోరాలజీ (ఐఐటీఎం) హెచ్చరించింది. ఈ మేరకు శాస్త్రవేత్తలు

Published : 20 Aug 2022 06:04 IST

దేశంలో తగ్గనున్న పునరుత్పాదక ఇంధన సామర్థ్యం
వాతావరణ మార్పుల కారణంగానే...
ఐఐటీఎం పరిశోధనలో వెల్లడి

దిల్లీ: వాతావరణ మార్పుల కారణంగా దేశంలోని సౌర, పవన విద్యుత్‌ సామర్థ్యాలు భవిష్యత్తులో దెబ్బతినే పరిస్థితులు తప్పకపోవచ్చని పుణెలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ట్రాపికల్‌ మెటియోరాలజీ (ఐఐటీఎం) హెచ్చరించింది. ఈ మేరకు శాస్త్రవేత్తలు పరిశోధన సాగించి, పునరుత్పాదక ఇంధన వనరులకు భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్లను అంచనా వేశారు. ఏడాది పొడవునా, సీజన్ల వారీగా చూసినా.. వాయువేగం ఉత్తరాదిన మందగించి, దక్షిణాదిన జోరందుకుంటున్నట్టు గుర్తించారు. ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడుల్లో పవన విద్యుత్‌ సామర్థ్యం పెరిగేందుకు మంచి అవకాశాలు ఉన్నట్టు గుర్తించారు. దేశంలో చాలాచోట్ల అన్ని సీజన్లలోనూ సౌర వికిరణం (సోలార్‌ రేడియేషన్‌) తగ్గే పరిస్థితులు కనిపిస్తున్నాయని; దీన్ని దృష్టిలో పెట్టుకుని రుతుపవనాలకు ముందే మధ్య, దక్షిణ మధ్య భారత్‌లో సౌర విద్యుత్‌పై పెట్టుబడులు పెట్టడం ద్వారా నష్టభయాన్ని తగ్గించుకోవచ్చని పరిశోధకులు సూచించారు. ఈ ఇంధన సామర్థ్యాలను కాపాడుకునేందుకు మరింత సమర్థవంతమైన నెట్‌వర్క్‌లు అవసరమని పరిశోధనకర్త పార్థసారథి ముఖోపాధ్యాయ సూచించారు. వాతావరణ మార్పులకు అనుగుణంగా పునరుత్పాదక ఇంధన వనరుల రంగంలోనూ మార్పులు జరగాలని, నూతన సాంకేతికతలను అందిపుచ్చుకోవాలని పేర్కొన్నారు. ‘అనాలసిస్‌ ఆఫ్‌ ఫ్యూచర్‌ విండ్‌ అండ్‌ సోలార్‌ పొటెన్షియల్‌ ఓవర్‌ ఇండియా యూజింగ్‌ క్లైమైట్‌ మోడల్స్‌’ పేరుతో విడుదలచేసిన పరిశోధన పత్రంలోని కీలక అంశాలను కరెంట్‌ సైన్స్‌ పత్రిక అందించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని