సైన్యంలో చేరాలని కోరుకునేవాడిని..!

తనకు మొదటి నుంచీ సైన్యంలో చేరాలని కోరికగా ఉండేదని.. కుటుంబ సమస్యల వల్ల అది నెరవేరలేదని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ శుక్రవారం చెప్పారు. యుక్త వయసులో తాను షార్ట్‌ సర్వీస్‌ కమిషన్‌ లిఖిత పరీక్ష

Published : 20 Aug 2022 06:04 IST

రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌

ఈనాడు, గువాహటి / ఇంఫాల్‌: తనకు మొదటి నుంచీ సైన్యంలో చేరాలని కోరికగా ఉండేదని.. కుటుంబ సమస్యల వల్ల అది నెరవేరలేదని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ శుక్రవారం చెప్పారు. యుక్త వయసులో తాను షార్ట్‌ సర్వీస్‌ కమిషన్‌ లిఖిత పరీక్ష రాశానని, ఆ సమయంలో తన తండ్రి చనిపోవడం, ఇతర సమస్యల కారణంగా సైన్యంలో చేరలేకపోయానని వివరించారు. ఇంఫాల్‌లో అస్సాం రైఫిల్స్‌, భారత సైన్య 57వ పర్వత డివిజన్‌ సిబ్బందిని ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. భారత సైన్యాధిపతి జనరల్‌ మనోజ్‌ పాండేతో కలిసి అస్సాం రైఫిల్స్‌ (దక్షిణ) ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ ప్రధాన కార్యాలయాన్ని రాజ్‌నాథ్‌ సందర్శించారు. గల్వాన్‌ లోయలో చైనా సేనలను నిలువరించడంలో భారత సైనికులు ప్రదర్శించిన అసమాన ధైర్యసాహసాలను ఈ సందర్భంగా మంత్రి కొనియాడారు. తానెక్కడికి వెళ్లినా సైనికులను తప్పనిసరిగా కలుసుకొంటానని, అలా కలిసినప్పుడు తనకెంతో గర్వంగాను, ఆనందంగాను ఉంటుందని చెప్పారు. ఒక చిన్నపిల్లవాడికి సైతం సైనిక దుస్తులు వేస్తే అతడి ప్రవర్తనే మారిపోతుందని.. ఆ యూనిఫారంలో ప్రత్యేక ఆకర్షణ ఉందని రాజ్‌నాథ్‌ వ్యాఖ్యానించారు. వైద్యులు, ఇంజనీర్లు, చార్టర్డ్‌ అకౌంటెంట్ల మాదిరిగానే సైనికులు కూడా దేశానికి సేవలు అందిస్తున్నా.. సైనిక విధి మిగతా వృత్తుల్లాంటిది కాదని, అది పూర్తిగా సేవాధర్మమని రాజ్‌నాథ్‌ పేర్కొన్నారు. గత ఏడు దశాబ్దాలుగా అస్సాం రైఫిల్స్‌ చేస్తున్న కృషిని ఈ సందర్భంగా ప్రశంసించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని