సాగుకు ‘శక్తి’ని జోడించాలి

దేశంలో ఇంధన కొరతను దృష్టిలో పెట్టుకొని, వ్యవసాయాన్ని వైవిధ్యభరితంగా ఇంధన, విద్యుత్‌ రంగాల వైపు మళ్లించాల్సిన అవసరముందని కేంద్ర రవాణా, జాతీయ రహదారులశాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ అభిప్రాయపడ్డారు

Published : 28 Aug 2022 05:54 IST

విద్యుత్‌, ఇంధన రంగాలవైపు మళ్లించాలి

కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ

ముంబయి: దేశంలో ఇంధన కొరతను దృష్టిలో పెట్టుకొని, వ్యవసాయాన్ని వైవిధ్యభరితంగా ఇంధన, విద్యుత్‌ రంగాల వైపు మళ్లించాల్సిన అవసరముందని కేంద్ర రవాణా, జాతీయ రహదారులశాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ అభిప్రాయపడ్డారు. శనివారం ముంబయిలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ‘‘దేశంలో ఇంధన కొరత ఉంది. పెట్రోలు, డీజిల్‌, ఇతర పెట్రోలియం ఉత్పత్తుల దిగుమతి కోసం ఏటా రూ.15 లక్షల కోట్లు ఖర్చు చేస్తున్నాం. సాంకేతికత సాయంతో ప్రత్యామ్నాయ ఇంధన వనరుల తయారీపై దృష్టి పెట్టాలి. దేశ జనాభాలో 70% వరకు వ్యవసాయ రంగంపైనే ఆధారపడుతున్నారు. ఇందులో వృద్ధిరేటు 12-13 శాతమే ఉంటోంది. ప్రస్తుత తరుణంలో సుగర్‌ ఉత్పత్తి ద్వారా ఆదాయం పెంచేందుకు చర్యలు తీసుకోవాలి. పంచదారను తక్కువగా ఉత్పత్తి చేసి.. దాని ఉప ఉత్పత్తులను పెంచాలి. దేశీయ అవసరాలకు ఒక ఏడాదికి 280 లక్షల టన్నుల చక్కెర సరిపోతుంది. కానీ ఉత్పత్తి మాత్రం 360 లక్షల టన్నులకు పైగా జరుగుతోంది. ఇథనాల్‌కు ఉన్న డిమాండ్‌ నేపథ్యంలో దాని ఉత్పత్తి పెంచడంపై దృష్టిపెట్టాల్సిన అవసరముంది. పవర్‌ జనరేటర్‌లను బయో-ఇథనాల్‌తో నడిపే సాంకేతికతను వినియోగించుకోవాలి. ఇంధన రంగంవైపు అడుగులు వేసి సంపదను పెంచుకోవాలి. ఇది అన్నదాతలకు ఎంతో మేలు చేస్తుంది’’ అని గడ్కరీ పేర్కొన్నారు. ప్రత్యామ్నాయ ఇంధన వనరుల వైపు మళ్లే దిశగా ప్రభుత్వం ఆలోచన చేస్తుందని మంత్రి తెలిపారు. ఇందులో భాగంగా ఫ్లెక్స్‌ ఇంజిన్ల వినియోగం పెంచాలని నిర్ణయించినట్లు చెప్పారు. ‘‘సాంకేతిక పరిజ్ఞానంతో బయో-ఇథనాల్‌ ద్వారా రైళ్లు నడపొచ్చని జర్మనీ నిరూపించింది. శుద్ధిచేసిన ఇథనాల్‌ను వైమానిక రంగంలో ఉపయోగించుకొనే అవకాశముంది. పంట కోత యంత్రాలకూ ఇథనాల్‌ను వినయోగించొచ్చు’’ అని గడ్కరీ వివరించారు.

స్థానిక సంస్థలో సంస్కరణలు అవసరం

స్థానిక సంస్థల్లో పనితీరు మెరుగుకు గుణత్మాక మార్పులు, సంస్కరణలు తీసుకురావాల్సి ఉందని గడ్కరీ అన్నారు. విద్య, సాంకేతికతల మధ్య సమన్వయం అవసరమన్నారు. మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌లో నాణ్యత లోపంపై ఆందోళన వ్యక్తంచేశారు. తడి, పోడి చెత్త నిర్వహణ ద్వారా సంపదను సృష్టించడంపై దృష్టి సారించాలన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు