పనిమనిషిని దారుణంగా కొట్టి చిత్రహింసలు.. భాజపా నాయకురాలి అరెస్ట్‌

తన ఇంట్లో పనిచేసే మహిళను అతి దారుణంగా కొట్టి, చిత్రహింసలకు గురిచేసిన ఘటనలో ఝార్ఖండ్‌కు చెందిన భాజపా నాయకురాలు సీమా పాత్రాను రాంచీ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. సీమా ఇంట్లో

Published : 02 Sep 2022 05:23 IST

తన ఇంట్లో పనిచేసే మహిళను అతి దారుణంగా కొట్టి, చిత్రహింసలకు గురిచేసిన ఘటనలో ఝార్ఖండ్‌కు చెందిన భాజపా నాయకురాలు సీమా పాత్రాను రాంచీ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. సీమా ఇంట్లో పనిచేసే సునీత అనే మహిళ శరీరం, ముఖంపై తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతోన్న వీడియో ఒకటి ఇటీవల సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. సీమా తనను బంధించి తీవ్రంగా హింసించారని సునీత ఆ వీడియోలో వాపోయింది. కొన్ని సార్లు ఇనుప రాడ్లతో కొట్టేవారని, అలా ఓసారి తన పన్ను కూడా విరిగిపోయిందని తెలిపింది.

29 ఏళ్ల సునీత కొన్నేళ్ల క్రితం రాంచీలో సీమా పాత్ర నివాసంలో పనికి చేరింది. సునీతను సీమా చిత్ర హింసలకు గురిచేస్తున్నట్లు స్థానికులు కొందరు సమాచారమివ్వడంతో గతవారం పోలీసులు ఆమెను రక్షించారు. తీవ్ర గాయాలతో ఉన్న ఆమెను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన వెలుగులోకి వచ్చిన తర్వాత నుంచి సీమా పాత్ర పరారీలో ఉన్నారు. రోడ్డు మార్గంలో రాంచీ నుంచి వెళ్లిపోయేందుకు ప్రయత్నిస్తుండగా పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. సీమా పాత్రా భాజపా మహిళా విభాగం జాతీయ వర్కింగ్‌ కమిటీలో సభ్యురాలిగా ఉన్నారు. ఆమె భర్త మహేశ్వర్‌ పాత్రా రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి. పనిమనిషి వీడియో వైరల్‌గా మారిన తర్వాత సీమాను మంగళవారం భాజపా సస్పెండ్‌ చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని