‘ఉక్రెయిన్‌ వైద్య విద్యార్థులకు’ భారత్‌లో ప్రవేశాలు కల్పించలేం

యుద్ధ నేపథ్యంలో ఉక్రెయిన్‌ నుంచి వెనక్కు వచ్చిన వైద్య విద్యార్థులకు దేశంలోని వైద్య కళాశాలల్లో ప్రవేశాలు కల్పించలేమని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. అదే సమయంలో ఉక్రెయిన్‌లోని

Published : 16 Sep 2022 04:34 IST

సుప్రీంకోర్టులో కేంద్రం అఫిడవిట్‌

నేడు తుది విచారణ

ఈనాడు, దిల్లీ: యుద్ధ నేపథ్యంలో ఉక్రెయిన్‌ నుంచి వెనక్కు వచ్చిన వైద్య విద్యార్థులకు దేశంలోని వైద్య కళాశాలల్లో ప్రవేశాలు కల్పించలేమని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. అదే సమయంలో ఉక్రెయిన్‌లోని వైద్య విశ్వ విద్యాలయాలు, కళాశాలల అనుమతితో వేరే దేశాల్లో వారు వైద్య విద్య పూర్తి చేసేందుకు అవకాశం కల్పిస్తామని వెల్లడించింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో గురువారం అఫిడవిట్‌ దాఖలు చేసింది. ఉక్రెయిన్‌ నుంచి వెనక్కి వచ్చిన తమకు దేశంలోని వైద్య కళాశాలల్లో ప్రవేశాలు కల్పించాలంటూ ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణతో పాటు పలు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై జస్టిస్‌ హేమంత్‌ గుప్తా, జస్టిస్‌ సుధాంశు ధూలియాతో కూడిన ద్విసభ్య ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. సుప్రీం కోర్టు సూచన మేరకు కేంద్రం గురువారం సాయంత్రం అఫిడవిట్‌ దాఖలు చేసింది. అందులో విదేశాల నుంచి వచ్చిన వైద్య విద్యార్థులకు దేశంలోని వైద్య కళాశాలల్లో ప్రవేశాలు కల్పించడం దేశంలోని వైద్య చట్టాలు, జాతీయ వైద్య మండలి (ఎన్‌ఎంసీ) నిబంధనల ప్రకారం సాధ్యం కాదని పేర్కొంది. ఉక్రెయిన్‌లో పరిస్థితుల కారణంగా అక్కడ వైద్య విద్యను పూర్తి చేయలేని విద్యార్థులు ప్రపంచంలో ఎక్కడైనా ఆయా కళాశాలల అనుమతితో వైద్య విద్య అభ్యసించవచ్చని ఈ నెల ఆరో తేదీన ఎన్‌ఎంసీ జారీ చేసిన ప్రకటనపై తాము ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయడం లేదని, అదే సమయంలో ఆ ప్రకటనను ఉక్రెయిన్‌ నుంచి వచ్చిన వైద్య విద్యార్థులకు భారతీయ కళాశాలల్లో దొడ్డి దారి ప్రవేశాలకు (బ్యాక్‌ డోర్‌ ఎంట్రీ)  అవకాశంగా భావించరాదని తెలియజేసింది. కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్‌ దాఖలు చేయడంతో నేడు సుప్రీంకోర్టు విచారణలో ఈ అంశంపై స్పష్టత రానుంది.

ఆ 29 దేశాల్లోనే..
ఉక్రెయిన్‌ నుంచి వెనక్కు వచ్చిన వైద్య విద్యార్థులు అకడమిక్‌ మొబిలిటీ కింద 29 దేశాల్లోని వైద్య కళాశాలల్లో వైద్య విద్యను కొనసాగించేందుకు ఎటువంటి అభ్యంతరం లేదని జాతీయ వైద్య మండలి స్పష్టం చేసింది. ఆయా దేశాల్లో వైద్య విద్యను పూర్తి చేసినా ఉక్రెయిన్‌ వైద్య విశ్వ విద్యాలయం డిగ్రీగానే గుర్తిస్తామని వెల్లడించింది. ఎన్‌ఎంసీ అనుమతించిన దేశాలు.. పోలండ్‌, ఆస్ట్రియా, చెక్‌ రిపబ్లిక్‌, ఫ్రాన్స్‌, జార్జియా, కజకిస్థాన్‌, లిథువేనియా, మాల్డోవా, స్లోవేకియా, స్పెయిన్‌, ఉజ్బెకిస్థాన్‌, అమెరికా, ఇటలీ, బెల్జియం, ఈజిప్టు, బెలారస్‌, లాత్వియా, కిర్గిస్థాన్‌, గ్రీస్‌, రొమేనియా, స్వీడన్‌, ఇజ్రాయిల్‌, ఇరాన్‌, అజర్‌బైజాన్‌, బల్గేరియా, జర్మనీ, తుర్కియే, క్రొయేషియా, హంగరి.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts