క్యూట్‌-యూజీ ఫలితాలు విడుదల

ఉమ్మడి విశ్వవిద్యాలయ ప్రవేశ పరీక్ష(క్యూట్‌)-యూజీ ఫలితాలను జాతీయ పరీక్షల మండలి (ఎన్‌టీఏ) శుక్రవారం విడుదల చేసింది. మొత్తంగా ఆరు దశల్లో జరిగిన ఈ పరీక్షలకు దాదాపు 14.9లక్షల

Published : 17 Sep 2022 04:29 IST

మార్కుల సాధారణీకరణ విధానంలో మూల్యాంకనం: ఎన్‌టీఏ

దాని ఆధారంగానే వర్సిటీలు ర్యాంకుల జాబితా రూపొందించాలి: యూజీసీ

దిల్లీ: ఉమ్మడి విశ్వవిద్యాలయ ప్రవేశ పరీక్ష(క్యూట్‌)-యూజీ ఫలితాలను జాతీయ పరీక్షల మండలి (ఎన్‌టీఏ) శుక్రవారం విడుదల చేసింది. మొత్తంగా ఆరు దశల్లో జరిగిన ఈ పరీక్షలకు దాదాపు 14.9లక్షల మందికి పైగా నమోదు చేసుకున్నారు. వీరిలో 60 శాతం మంది పరీక్షకు హాజరయ్యారు. పలు కేంద్ర విశ్వవిద్యాలయాలు, రాష్ట్ర వర్సిటీలు, డీమ్డ్‌ యూనివర్సిటీలు, ప్రైవేటు వర్సిటీల్లో గ్రాడ్యుయేషన్‌ కోర్సుల్లో ప్రవేశాల కోసం తొలిసారి ఈ పరీక్షను నిర్వహించారు. ఫలితాలను www.nta.ac.in, https://cuet.samarth.ac.in వెబ్‌సైట్ల ద్వారా తెలుసుకోవచ్చు. ఈ పరీక్షలో ‘సమాన శాతం(ఈక్వి-పర్సంటైల్‌)’ పద్ధతిని ఉపయోగించి మూల్యాంకనం చేసినట్లు ఎన్‌టీఏ పేర్కొంది. ఇందుకోసం అభ్యర్థుల వ్యక్తిగత మార్కులను కాకుండా, సాధారణీకరించిన(నార్మలైజ్డ్‌) మార్కులను పరిగణనలోకి తీసుకున్నట్లు తెలిపింది. కొన్ని కారణాల వల్ల క్యూట్‌-యూజీలో ఒక్కో సబ్జెక్టు పరీక్షను వివిధ షిప్టుల్లో నిర్వహించాల్సి వచ్చిందని, ఆయా షిఫ్టుల్లో వేర్వేరు ప్రశ్నపత్రాలు వినియోగించినందువల్ల అనివార్యంగా కొందరికి కఠినమైన ప్రశ్నలు వచ్చి ఉండవచ్చని, అలాంటి వారు నష్టపోకుండా ఉండేందుకే మార్కులను సాధారణీకరించినట్లు తెలిపింది. ఈ పద్ధతిలో ఆయా షిఫ్టుల్లో పరీక్ష రాసినవారికి వచ్చిన ఉమ్మడి పర్సంటైల్‌ను పరిగణనలోకి తీసుకున్నట్లు వివరించింది. క్యూట్‌-యూజీ స్కోరు కార్డు ఆధారంగా ఆయా వర్సిటీలు స్వయంగా మెరిట్‌ జాబితాలను సిద్ధం చేసుకుని కౌన్సెలింగ్‌ నిర్వహిస్తాయని ఎన్‌టీఏ తెలిపింది. సాధారణీకరించిన మార్కుల ఆధారంగానే ర్యాంకుల జాబితా రూపొందించాలని యూజీసీ ఛైర్మన్‌ జగదీశ్‌కుమార్‌ విశ్వవిద్యాలయాలను ఆదేశించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని