పర్యాటక ప్రాంతాలపై సమగ్ర వెబ్‌సైట్‌

దేశంలోని ప్రతి పర్యాటక ప్రాంతానికి సంబంధించిన సూక్ష్మాతి సూక్ష్మమైన వివరాలతో సహా త్వరలో సమగ్ర వెబ్‌సైట్‌ అందుబాటులోకి తీసుకురానున్నట్లు కేంద్ర పర్యటక, సాంస్కృతిక శాఖల మంత్రి

Published : 21 Sep 2022 04:48 IST

కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

ఈనాడు, దిల్లీ: దేశంలోని ప్రతి పర్యాటక ప్రాంతానికి సంబంధించిన సూక్ష్మాతి సూక్ష్మమైన వివరాలతో సహా త్వరలో సమగ్ర వెబ్‌సైట్‌ అందుబాటులోకి తీసుకురానున్నట్లు కేంద్ర పర్యటక, సాంస్కృతిక శాఖల మంత్రి జి.కిషన్‌రెడ్డి చెప్పారు. గత మూడు రోజులుగా హిమాచల్‌ ప్రదేశ్‌లోని ధర్మశాలలో జరిగిన రాష్ట్రాల పర్యాటక మంత్రుల సదస్సు ముగింపు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రధానమంత్రి ఆలోచనల మేరకు ఈ వెబ్‌సైట్‌ను రూపొందిస్తున్నామని.. ఇందుకు కేంద్రపాలిత ప్రాంతాలు, రాష్ట్రాలు సహకరించాలని కోరారు. త్వరలో కొత్త పర్యాటక విధానాన్ని ప్రకటించడంతోపాటు ఈ రంగంలో పెట్టుబడులను ప్రోత్సహించేందుకు ‘ఇండియన్‌ టూరిజం ఇన్వెస్టర్స్‌ కాంక్లేవ్‌’ను నిర్వహించనున్నట్లు ప్రకటించారు. పర్యాటక ప్రాంతాలకు అవసరమైన రైళ్లను నడపడానికి రాష్ట్ర ప్రభుత్వాలకు రైళ్లు ఇస్తామని, వాటి నిర్వహణ బాధ్యత మాత్రం రాష్ట్ర ప్రభుత్వాలే తీసుకోవాలని చెప్పారు. ‘దేఖో అప్నా దేశ్‌’ తరహాలో రాష్ట్ర ప్రభుత్వాలు ‘మా ప్రాంతాలను చూడండి’ అన్న నినాదంతో పర్యాటక ప్రోత్సాహక కార్యక్రమాలను నిర్వహించాలని సదస్సుకు హాజరైన మంత్రులు, అధికారులకు మంత్రి సూచించారు. రాష్ట్రాలు కూడా సమగ్ర పర్యాటక  విధానం రూపొందించుకోవాలన్నారు. యువకులు, కళాశాల విద్యార్థులతో టూరిజం క్లబ్స్‌ ఏర్పాటుచేసి ఈ రంగంలో యువత భాగస్వామ్యాన్ని పెంచేందుకు చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చారు. పర్యాటక ప్రదేశాల్లో జాతీయ జెండాలను ఏర్పాటు చేయాలని మంత్రి కోరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని