పీఎఫ్‌ఐ హర్తాళ్‌ హింసాత్మకం

అతివాద ఇస్లామిక్‌ సంస్థ పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా (పీఎఫ్‌ఐ)పై జాతీయ దర్యాప్తు సంస్థ దాడులను నిరసిస్తూ శుక్రవారం ఆ సంస్థ కేరళలో చేపట్టిన హర్తాళ్‌ హింసాత్మకంగా మారింది. ప్రభుత్వ బస్సులు, కార్యాలయాలపై

Published : 24 Sep 2022 05:14 IST

కేరళలో రాళ్లు రువ్విన ఆందోళనకారులు
పగిలిన ప్రభుత్వ బస్సుల అద్దాలు
బంద్‌పై హైకోర్టు ఆగ్రహం

తిరువనంతపురం: అతివాద ఇస్లామిక్‌ సంస్థ పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా (పీఎఫ్‌ఐ)పై జాతీయ దర్యాప్తు సంస్థ దాడులను నిరసిస్తూ శుక్రవారం ఆ సంస్థ కేరళలో చేపట్టిన హర్తాళ్‌ హింసాత్మకంగా మారింది. ప్రభుత్వ బస్సులు, కార్యాలయాలపై ఆందోళనకారులు రాళ్లు రువ్వారు. ముఖానికి ముసుగులు ధరించిన వ్యక్తులు కొన్ని జిల్లాల్లో వీరంగం చేశారు. దుకాణాలపై దాడులు చేశారు. ప్రయివేట్‌, పోలీసు వాహనాలను ధ్వంసం చేశారు. అంబులెన్సులనూ వదల్లేదు. తిరువనంతపురం, కొల్లాం, వయనాడ్‌, అలపూడ, కొట్టాయం తదితర జిల్లాల్లో బలవంతంగా దుకాణాలను మూయించారు. రాళ్లు రువ్విన ఘటనల్లో సాధారణ పౌరులు, వాహనాల డ్రైవర్లు, పోలీసులు గాయాలపాలయ్యారు. కన్నూర్‌లో వార్తా పత్రికలు తీసుకెళ్తోన్న ఓ వాహనంపైకి పెట్రోల్‌ బాంబు విసిరినట్లు స్థానిక ప్రచారసాధనాల్లో వార్తలు వచ్చాయి. పలు ప్రాంతాల్లో ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీలు ప్రయోగించారు. వందలాది పీఎఫ్‌ఐ మద్దతుదారులను నిర్బంధించారు. కన్నూరు జిల్లాలో బలవంతంగా దుకాణాలు మూయిస్తున్న పీఎఫ్‌ఐ కార్యకర్తలపై స్థానికులు తిరగబడి.. వారిని తీవ్రంగా కొట్టి.. పోలీసులకు అప్పగించారు. హింసాత్మక ఘటనల్లో కేరళ ప్రభుత్వానికి చెందిన 50 బస్సుల అద్దాలు, సీట్లు ధ్వంసమయ్యాయి. రాళ్లు తాకి పదిమంది ఉద్యోగులకు గాయాలయ్యాయి. దీంతో తలకు శిరస్త్రాణాలు ధరించి డ్రైవర్లు కొన్ని ప్రాంతాల్లో బస్సులు నడిపారు. తమిళనాడులో గుర్తు తెలియని వ్యక్తులు.. భాజపా, హిందు మున్నానీ సభ్యులకు చెందిన కార్లను, ఆటోలను ధ్వంసం చేశారు.  

అనుమతి లేకుండా హర్తాళ్‌కు పిలుపా

పీఎఫ్‌ఐ హర్తాళ్‌, అనంతర హింసాత్మక సంఘటనలను కేరళ హైకోర్టు తీవ్రంగా తీసుకుంది. కేసును సుమోటోగా తీసుకొని పీఎఫ్‌ఐపై చర్యలకు ఉపక్రమించింది. ముందస్తు అనుమతి లేకుండా బంద్‌లు, హర్తాళ్లకు పిలుపివ్వకూడదన్న న్యాయస్థానాల ఆదేశాలను ఉల్లంఘించడంపై మండిపడింది. కోర్టు తీర్పును ధిక్కరించిన పీఎఫ్‌ఐ నేతలపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. హింసను ఆపేందుకు సాధ్యమైన అన్ని చర్యలు చేపట్టాలని సూచించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని