సంక్షిప్త వార్తలు

కేరళలో భారత్‌ జోడో యాత్ర నిర్వాహకులు రహదారులకు రెండు వైపులా అధిక సంఖ్యలో ఫ్లెక్సీబోర్డులు, బ్యానర్లు ఏర్పాటుచేయడంపై ఆ రాష్ట్ర హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వాటిని అక్రమంగా ఏర్పాటుచేస్తుంటే.. పోలీసులు, ప్రభుత్వ

Published : 24 Sep 2022 05:39 IST

‘భారత్‌ జోడో యాత్ర’ ఫ్లెక్సీలపై కేరళ హైకోర్టు ఆగ్రహం

కోచి: కేరళలో భారత్‌ జోడో యాత్ర నిర్వాహకులు రహదారులకు రెండు వైపులా అధిక సంఖ్యలో ఫ్లెక్సీబోర్డులు, బ్యానర్లు ఏర్పాటుచేయడంపై ఆ రాష్ట్ర హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వాటిని అక్రమంగా ఏర్పాటుచేస్తుంటే.. పోలీసులు, ప్రభుత్వ అధికారులు కళ్లు మూసుకున్నారంటూ చురకలంటించింది. ఈ వ్యవహారంపై స్పందించాల్సిందిగా ప్రభుత్వ యంత్రాంగానికి తాఖీదు జారీ చేసింది. కేరళలో త్రివేండ్రం నుంచి త్రిశూర్‌ వరకు జాతీయ రహదారికి ఇరువైపులా ఓ పార్టీ అక్రమంగా ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటుచేసిందని, దానిపై అత్యవసర విచారణ అవసరమని అమికస్‌ క్యూరీ హరీశ్‌ వాసుదేవన్‌ పేర్కొనగా హైకోర్టు గురువారం ఈ మేరకు స్పందించింది. కాంగ్రెస్‌ పేరునుగానీ, భారత్‌ జోడో యాత్రనుగానీ వాసుదేవన్‌ నేరుగా ప్రస్తావించలేదు.


జర్నలిస్ట్‌ నవికా కుమార్‌కు సుప్రీంలో ఊరట

దిల్లీ: సీనియర్‌ జర్నలిస్ట్‌ నవికా కుమార్‌కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఆమెపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌లన్నింటినీ జతచేసి వాటిని దిల్లీ పోలీసులకు బదిలీచేస్తూ ఆదేశాలు జారీచేసింది. మహమ్మద్‌ ప్రవక్తపై భాజపా మాజీ అధికార ప్రతినిధి నుపుర్‌ శర్మ ఒక టీవీ ఛానల్‌ చర్చాకార్యక్రమంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఆ కార్యక్రమానికి నవికా కుమార్‌ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఈ కేసుల్లో చట్టపరంగా తనకు ఉన్న అవకాశాలన్నీ వినియోగించుకునేందుకు వీలుగా నవికా కుమార్‌పై ఎనిమిది వారాల పాటు ఎలాంటి చర్యలూ తీసుకోవద్దని జస్టిస్‌ ఎం.ఆర్‌.షా, జస్టిస్‌ కృష్ణమురారిలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం పోలీసులను ఆదేశించింది. అలాగే ఆమెపై నమోదైన ప్రధాన ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేయాలని కోరుతూ దిల్లీ హైకోర్టును ఆశ్రయించే అవకాశాన్ని కూడా సర్వోన్నత న్యాయస్థానం కుమార్‌కు కల్పించింది. భవిష్యత్తులో ఆమెపై ఎక్కడైనా ఈ కేసుకు సంబంధించి కొత్తగా ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేస్తే వాటిని కూడా దిల్లీ పోలీసులకు బదిలీ చేయాలని ధర్మాసనం స్పష్టంచేసింది.


సుప్రీం సూచనలపైనే కసరత్తు చేస్తున్నాం
ఉక్రెయిన్‌ వైద్య విద్యార్థుల వ్యవహారంపై కేంద్రం

దిల్లీ: ఉక్రెయిన్‌ నుంచి తిరిగొచ్చిన వైద్య విద్యార్థులకు సాయానికి సంబంధించి కోర్టు సూచనలపై కసరత్తు చేస్తున్నామని కేంద్ర ప్రభుత్వం శుక్రవారం సుప్రీంకోర్టుకు తెలిపింది. అక్కడి నుంచి వచ్చిన విద్యార్థులు కోర్సు పూర్తిచేసేందుకు అవకాశమున్న విదేశీ విశ్వవిద్యాలయాల వివరాలతో ఓ వెబ్‌ పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకురావాలని ఈ నెల 16న అత్యున్నత న్యాయస్థానం కేంద్రానికి సూచించింది. ఇదే విషయమై వివిధ దేశాల విదేశాంగ, వైద్య మంత్రులకు లేఖలు రాశామని కేంద్రం తరఫు న్యాయవాది శుక్రవారం సుప్రీంకోర్టుకు తెలిపారు. విద్యార్థుల తరఫు న్యాయవాది మాట్లాడుతూ.. దాదాపు 13 వేల మంది విద్యార్థులు ప్రభావితులయ్యారని, ఈ అంశంపై చాలా రాష్ట్రాలు కేంద్రానికి లేఖలు రాశాయని తెలిపారు. ఆయా రాష్ట్రాలతో కేంద్రం, జాతీయ మెడికల్‌ కమిషన్‌ మాట్లాడాలని పేర్కొన్నారు. చివరి సంవత్సరం విద్యార్థులకు ఆన్‌లైన్‌ విద్యకు అవకాశం ఇవ్వాలన్న అభ్యర్థనపై ధర్మాసనం స్పందిస్తూ.. ‘మేం ఇప్పుడు ఏమీ చెప్పట్లేదు. దీనిపై సమగ్రమైన ఆదేశాలు జారీచేస్తాం’ అని పేర్కొంది. తదుపరి విచారణను అక్టోబరు 11కు వాయిదా వేసింది.


రాహుల్‌ కేరళలోనే ఉన్నారు: జైరాం రమేశ్‌

దిల్లీ: కాంగ్రెస్‌ అగ్ర నేత రాహుల్‌ గాంధీ కేరళలోనే ఉన్నారని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్‌ స్పష్టం చేశారు. భారత్‌ జోడో యాత్రకు శుక్రవారం విశ్రాంతి దినం కావడంతో.. చలకూడి ప్రాంతంలో కంటెయినర్‌ శిబిరంలో ఆయన ఉన్నారని పేర్కొన్నారు. రాహుల్‌ దిల్లీకి వెళ్లారంటూ కొన్ని వార్తాసంస్థలు పేర్కొన్న నేపథ్యంలో జైరాం రమేశ్‌ ఈ మేరకు స్పందించారు.


శివాజీ పార్కు వద్ద దసరా ర్యాలీ.. ఠాక్రే వర్గానికే హైకోర్టు అనుమతి

ముంబయి: సెంట్రల్‌ ముంబయిలోని ప్రఖ్యాత శివాజీ పార్కు వద్ద వచ్చే నెల 5న దసరా ర్యాలీని నిర్వహించేందుకు ఉద్ధవ్‌ ఠాక్రే నేతృత్వంలోని శివసేనకు బాంబే హైకోర్టు శుక్రవారం అనుమతి మంజూరు చేసింది. మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్‌ శిందె నాయకత్వంలోని శివసేన చీలిక విభాగం అక్కడ దసరా ర్యాలీ నిర్వహించుకునేందుకు బృహన్‌ ముంబయి మున్సిపల్‌ కార్పొరేషన్‌ (బీఎంసీ) ఇటీవల అనుమతులిచ్చింది. ఆ నిర్ణయంపై ఠాక్రే వర్గం కోర్టును ఆశ్రయించింది. విచారణ నిర్వహించిన హైకోర్టు.. బీఎంసీ నిర్ణయం చట్టవిరుద్ధంగా ఉన్నట్లు అభిప్రాయపడింది. ఠాక్రే వర్గానికి అనుకూలంగా తీర్పు వెలువరించింది. శివాజీ పార్కు వద్ద ఏటా శివసేన భారీఎత్తున దసరా ర్యాలీ నిర్వహిస్తూ వస్తోంది.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని