తగ్గిన శిశు మరణాల రేటు

దేశంలో శిశు మరణాల రేటు అయిదేళ్లలో 9 పాయింట్ల మేర  తగ్గినట్లు శుక్రవారం విడుదలైన శాంపిల్‌ రిజిస్ట్రేషన్‌ సిస్టం-2020 నివేదిక వెల్లడించింది. 2015లో ఇది 37 ఉండగా.. 2020 నాటికి 28కి తగ్గింది. ఏటా సగటున 1.8 పాయింట్ల

Published : 24 Sep 2022 05:39 IST

శాంపిల్‌ రిజిస్ట్రేషన్‌ సిస్టం-2020 నివేదిక వెల్లడి

ఈనాడు, దిల్లీ: దేశంలో శిశు మరణాల రేటు అయిదేళ్లలో 9 పాయింట్ల మేర  తగ్గినట్లు శుక్రవారం విడుదలైన శాంపిల్‌ రిజిస్ట్రేషన్‌ సిస్టం-2020 నివేదిక వెల్లడించింది. 2015లో ఇది 37 ఉండగా.. 2020 నాటికి 28కి తగ్గింది. ఏటా సగటున 1.8 పాయింట్ల తగ్గుదల నమోదైంది. గ్రామీణ ప్రాంతాల్లో ఈ తగ్గుదల 41 నుంచి 31కి చేరగా, పట్టణ ప్రాంతాల్లో 25 నుంచి 19కి తగ్గింది. అంటే గ్రామీణ ప్రాంతాల్లో పది పాయింట్లు, పట్టణ ప్రాంతాల్లో ఆరు పాయింట్ల మేర తగ్గుదల నమోదైందన్న మాట. 2014 నుంచి ఇప్పటివరకు నవజాత శిశువుల మొదలు అయిదేళ్లలోపు పిల్లల వరకూ  అన్ని విభాగాల్లోనూ తగ్గుదల కనిపిస్తూ వచ్చినట్లు కేంద్ర వైద్యఆరోగ్యశాఖ తెలిపింది. 2030 నాటికి సుస్థిర అభివృద్ధి లక్ష్యసాధనలో ఇదో ముందడుగుగా పేర్కొంది.

శిశు మరణాలు తగ్గినా జాతీయస్థాయిలో ప్రతి 35 మంది శిశువుల్లో ఒకరు ఏడాదిలోపే ప్రాణాలు కోల్పోతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి 32 మందిలో ఒకరు, పట్టణ ప్రాంతాల్లో ప్రతి 52 మందిలో ఓ చిన్నారి ఏడాది తిరగకముందే కన్నుమూస్తోంది.

అయిదేళ్లలోపు చిన్నారుల మరణాల రేటు 2019-2020 మధ్యకాలంలో 35 నుంచి 32కు తగ్గింది. ఇందులో మగపిల్లల మరణాలు 4 పాయింట్లు, ఆడపిల్లల మరణాలు 3 పాయింట్ల మేర తగ్గాయి.

జనన సమయంలో లింగనిష్పత్తి 2017-19 మధ్యకాలంలో 904 ఉండగా, 2018-20 నాటికి అది 907కు చేరి 3 పాయింట్ల పెరుగుదల నమోదు చేసింది. ఈ విషయంలో కేరళ (974) తొలిస్థానంలో ఉండగా, ఉత్తరాఖండ్‌ (844) చివరిస్థానంలో నిలిచింది.

సంతాన సాఫల్య రేటు 2019 నుంచి 2020 మధ్యకాలంలో 2.1 నుంచి 2.0కు  పడిపోయింది. ఇందులో బిహార్‌ (3.0) తొలిస్థానంలో ఉండగా.. దిల్లీ, తమిళనాడు, పశ్చిమబెంగాల్‌లు (1.4) చివరిస్థానంలో నిలిచాయి.

ప్రస్తుతం జాతీయస్థాయిలో గ్రామీణప్రాంతాల్లోని మహిళల సంతాన సాఫల్య రేటు సగటున 2.2 మేర ఉండగా, పట్టణ ప్రాంతాల్లో ఇది 1.6కు పరిమితమైంది.

2015-20 మధ్యకాలంలో సంతానసాఫల్య రేటు సగటున 0.3 పాయింట్లు తగ్గింది.

 కాన్పులు అవుతున్న తల్లుల్లో 2020లో 82.6% మందికి ప్రభుత్వ / ప్రయివేటు ఆసుపత్రుల్లో వైద్యసేవలు అందాయి. 2019లో ఇది 82.8% ఉంది.

2020లో ఆసుపత్రుల్లో వైద్యసేవలు అందినప్పటికీ చనిపోయినవారి సంఖ్యలో 0.3% పాయింట్ల మేర పెరుగుదల నమోదైంది. 2015-20 మధ్యకాలంలో ఇందులో 4.4% పాయింట్ల మేర పెరుగుదల కనిపించింది.

క్రూడ్‌ బర్త్‌రేట్‌ (ప్రతి వెయ్యిమంది జనాభాకు) జాతీయస్థాయిలో 2020లో 19.5 మేర నమోదైంది. 2019తో పోలిస్తే ఇందులో 0.2 పాయింట్ల తగ్గుదల కనిపించింది. బిహార్‌లో (25.5) అత్యధిక క్రూడ్‌ బర్త్‌రేట్‌ నమోదు కాగా, కేరళలో (13.2) అత్యల్పంగా నమోదైంది.

2020లో క్రూడ్‌ డెత్‌రేట్‌ (ప్రతి వెయ్యిమంది జనాభాకు) 6.0గా నమోదైంది. ఇందులో ఛత్తీస్‌గడ్‌ (7.9), దిల్లీ (3.6) తొలి, చివరిస్థానాల్లో నిలిచాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని