రిసెప్షనిస్టు హత్యపై ఆగ్రహజ్వాల

రిసెప్షనిస్టు అంకితా భండారీ హత్య.. ఉత్తరాఖండ్‌ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఆమెను హత్య చేసినట్లు అంగీకరించిన భాజపా నేత వినోద్‌ ఆర్య కుమారుడైన పులకిత్‌ ఆర్యకు

Published : 25 Sep 2022 04:59 IST

ఉత్తరాఖండ్‌ భాజపా నేత కుమారుడి రిసార్టు కూల్చివేత

పార్టీ నుంచి నిందితుడి తండ్రి, సోదరుడి బహిష్కరణ

‘ప్రత్యేక’ సేవలు అందించలేదనే అంకితా భండారీ హత్య!

దేహ్రాదూన్‌: రిసెప్షనిస్టు అంకితా భండారీ హత్య.. ఉత్తరాఖండ్‌ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఆమెను హత్య చేసినట్లు అంగీకరించిన భాజపా నేత వినోద్‌ ఆర్య కుమారుడైన పులకిత్‌ ఆర్యకు చెందిన రిసార్టును.. ముఖ్యమంత్రి పుష్కర్‌ సింగ్‌ ధామి ఆదేశాల మేరకు శనివారం అధికారులు బుల్‌డోజర్లతో కూల్చివేశారు. అంతేకాదు.. పార్టీ పరంగానూ సీఎం కఠిన చర్యలు తీసుకున్నారు. ప్రధాన నిందితుడు పులకిత్‌ తండ్రి.. హరిద్వార్‌లో కీలక నేత అయిన వినోద్‌ ఆర్యను, ఆయన మరో కుమారుడిని భాజపా నుంచి సస్పెండ్‌ చేస్తున్నట్లు ప్రకటించారు., నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఈ కేసులో శుక్రవారం పులకిత్‌తో పాటు.. రిసార్టులో పనిచేస్తున్న మరో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. సామాజిక మాధ్యమాల్లోనూ ఈ హత్యపై తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. రిసార్టు కూల్చివేత సమయంలో అంకిత కుటుంబ సభ్యులు, నిరసనకారులు ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున మోహరించి.. నిందితులకు ఉరిశిక్ష విధించాలని డిమాండ్‌ చేశారు. భాజపా యమకేశ్వర్‌ ఎమ్మెల్యే రేణుబిస్త్‌ వాహనంపై ఆందోళనకారులు దాడి చేశారు. కారు అద్దాలను పగలకొట్టారు. రిషికేష్‌ సమీపంలో పులకిత్‌ ఆర్య నడుపుతున్న రిసార్టులో రిసెప్షనిస్టుగా పనిచేస్తున్న 19 ఏళ్ల అంకితా భండారీ ఈ నెల 18న అదృశ్యమయ్యారు. ఈ కేసులో తొలుత పోలీసులను తప్పుదోవ పట్టించిన  పులకిత్‌.. తర్వాత రిసార్టులో పనిచేస్తున్న సౌరభ్‌ భాస్కర్‌, అంకిత్‌ గుప్తాతో కలిసి అంకితను హత్య చేసి చీలా కాలువలో పడేసినట్లు అంగీకరించాడు. దీంతో ఆ కాలువలో గాలింపు చర్యలు చేపట్టిన రాష్ట్ర విపత్తు స్పందన దళాలు శనివారం ఉదయం మృతదేహాన్ని కనుగొన్నాయి.


హత్య అందుకోసమే!

కేసుకు సంబంధించి రాష్ట్ర డీజీపీ అశోక్‌ కుమార్‌ కీలక విషయం వెల్లడించారు. రిసార్టుకు వచ్చే అతిథులకు ‘ప్రత్యేక’ సేవలు అందించేందుకు అంకిత నిరాకరించడంతోనే నిందితులు హత్య చేశారని పేర్కొన్నారు. ఆ యువతి తన స్నేహితుడితో జరిపిన ఛాటింగ్‌ ఆధారంగా ఈ విషయం వెలుగులోకి వచ్చిందన్నారు. రిసార్టుకు వచ్చే అతిథులతో శృంగారం చేయాలని ఆమెపై పులకిత్‌ ఒత్తిడి తెచ్చాడని, అందుకు ఆమె నిరాకరించిందని తెలుస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని