సంక్షిప్త వార్తలు(3)

‘పాకిస్థాన్‌ జిందాబాద్‌’ అంటూ కొందరు వ్యక్తులు  నినాదాలు చేస్తున్న ఓ వీడియో కలకలం రేపుతోంది. దేశవ్యాప్తంగా పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా (పీఎఫ్‌ఐ) కార్యాలయాలపై జాతీయ దర్యాప్తు సంస్థ జరిపిన దాడులకు నిరసనగా

Updated : 26 Sep 2022 00:15 IST

శివాజీ గడ్డపై ‘పాక్‌ జిందాబాద్‌’ నినాదాలా!
పీఎఫ్‌ఐపై మహారాష్ట్ర సీఎం శిందే ఆగ్రహం
వెతికి మరీ చంపుతామన్న భాజపా ఎమ్మెల్యే రాణె

పుణె: ‘పాకిస్థాన్‌ జిందాబాద్‌’ అంటూ కొందరు వ్యక్తులు  నినాదాలు చేస్తున్న ఓ వీడియో కలకలం రేపుతోంది. దేశవ్యాప్తంగా పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా (పీఎఫ్‌ఐ) కార్యాలయాలపై జాతీయ దర్యాప్తు సంస్థ జరిపిన దాడులకు నిరసనగా శుక్రవారం ఆ సంస్థ మద్దతుదారులు పుణె కలక్టరేట్‌ ముందు ధర్నా నిర్వహించారు. ఆ సమయంలో ‘పాకిస్థాన్‌ జిందాబాద్‌’ అంటూ కొందరు వ్యక్తులు నినాదాలిస్తున్న వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. దీనిపై సీఎం ఏక్‌నాథ్‌ శిందే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఛత్రపతి శివాజీ పుట్టిన గడ్డపై ఇలాంటి నినాదాలను ఉపేక్షించమని పేర్కొన్నారు. పాకిస్థాన్‌ను పొగిడిన ఒకొక్కరిని వెంటాడి మరీ చంపుతామని ట్విటర్లో భాజపా ఎమ్మెల్యే నితీష్‌ రాణె హెచ్చరించారు. మరోవైపు కేరళలో శుక్రవారం పీఎఫ్‌ఐ హర్తాళ్‌లో జరిగిన హింసాత్మక సంఘటనలను ఆ రాష్ట్ర సీఎం పినరయి విజయన్‌ ఖండించారు. ప్రణాళిక ప్రకారం అల్లర్లు జరిగాయని, దీని వెనుక ఉన్నవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.


ఒక్క ఛైర్మన్‌ పదవైనా ఉండాలి

పార్లమెంటరీ స్థాయీ సంఘాలపై లోక్‌సభ స్పీకర్‌కు కాంగ్రెస్‌ లేఖ

దిల్లీ: ప్రధానమైన పార్లమెంటరీ స్థాయీ సంఘాల్లో ఒక్కదానికైనా తమ పార్టీకి ఛైర్మన్‌ పదవి ఇవ్వాలని కాంగ్రెస్‌ డిమాండ్‌ చేసింది. హోం, విదేశీ వ్యవహారాలు, రక్షణ, ఆర్థిక శాఖలకు సంబంధించిన ప్రధాన పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీలలో ఒకదానికైనా ఛైర్మన్‌ పదవి ఉండేలా చూడాలని లోక్‌సభలో కాంగ్రెస్‌ పక్ష నేత అధీర్‌ రంజన్‌ చౌధరి కోరారు. ఈ మేరకు శనివారం స్పీకర్‌ ఓం బిర్లాకు ఆయన లేఖ రాశారు. స్టాండింగ్‌ కమిటీల స్థాయిని కేంద్ర ప్రభుత్వం దిగజారుస్తోందని అధీర్‌ విమర్శించారు. సభలో రెండో ప్రధాన పార్టీగా ఉన్న కాంగ్రెస్‌కు ముఖ్యమైన కమిటీలకు ఛైర్మన్‌ పదవి ఇచ్చి గౌరవించాలని ఆయన కోరారు. మరోవైపు.. హోం వ్యవహారాలు, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీకి సంబంధించిన రెండు కీలకమైన పార్లమెంటరీ కమిటీల అధ్యక్ష పదవిని కాంగ్రెస్‌ పార్టీ కోల్పోయే అవకాశం ఉందన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో లోక్‌సభ స్పీకర్‌కు అధీర్‌ రంజన్‌ లేఖ రాసినట్లు తెలుస్తోంది.


పర్యాటకులను తిరిగి ఆహ్వానిస్తున్న భూటాన్‌

అస్సాం సరిహద్దు నుంచి రాకపోకలకు అనుమతి

గువాహటి: కొవిడ్‌ కారణంగా రెండున్నరేళ్ల నుంచి అస్సాంలో మూతపడిన భారత్‌-భూటాన్‌ సరిహద్దు పర్యాటకుల రాకపోకల కోసం శుక్రవారం మళ్లీ తెరచుకుంది. అస్సాంలోని నాలుగు జిల్లాల్లో అంతర్జాతీయ సరిహద్దు ద్వారాలను తెరచినట్లు గువాహటిలోని భూటాన్‌ రాయబారి జిగ్మే థిన్లే నంగ్యాల్‌ శనివారం ప్రకటించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో భారత్‌-భూటాన్‌ మైత్రీ సంఘ సభ్యులు, పలువురు వ్యాపారులు, పర్యాటకులు పాల్గొన్నారు. ప్రతిరోజూ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 వరకు ద్వారాలు తెరచి ఉంటాయి. సెప్టెంబరు 23 శుక్రవారం నుంచి వ్యాపారులు, పర్యాటకులు, అధికార ప్రతినిధుల రాకపోకల కోసం సరిహద్దు ద్వారాలు తెరచినట్లు భూటాన్‌ ప్రభుత్వం ప్రకటించింది. పర్యాటకులపై రుసుమును వసూలు చేసి, ఆ నిధులను తమ దేశంలో మౌలిక వసతుల అభివృద్ధికి వెచ్చిస్తామని తెలిపింది. భారతీయ ప్రయాణికులు భూటాన్‌లో ఉన్నంత కాలం రోజుకు రూ.1,200 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts