సుస్థిర ప్రభుత్వంతో దృఢ విశ్వాసం నింపాం

ఉత్తర్‌ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌ రాష్ట్రాల్లో మాదిరిగా హిమాచల్‌ప్రదేశ్‌లోనూ వరుసగా రెండోసారి భాజపా ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావాలని ఇక్కడి ఓటర్లు తమ మనసుల్లో నిర్ణయించుకున్నారని ప్రధాని మోదీ తెలిపారు. రాష్ట్రం

Published : 25 Sep 2022 05:33 IST

ప్రపంచం మనతో అనుసంధానమవ్వాలని చూస్తోంది

యువ విజయ సంకల్ప ర్యాలీలో ప్రధాని మోదీ వెల్లడి

మండీ: ఉత్తర్‌ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌ రాష్ట్రాల్లో మాదిరిగా హిమాచల్‌ప్రదేశ్‌లోనూ వరుసగా రెండోసారి భాజపా ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావాలని ఇక్కడి ఓటర్లు తమ మనసుల్లో నిర్ణయించుకున్నారని ప్రధాని మోదీ తెలిపారు. రాష్ట్రం అభివృద్ధిపథంలో కొనసాగాలంటే సుస్థిర ప్రభుత్వం ఆవశ్యకతను ప్రజలు గుర్తించడమే దీనికి కారణమని పేర్కొన్నారు. భాజపా యువజన విభాగం శనివారం మండీలో నిర్వహించిన ‘యువ విజయ సంకల్ప ర్యాలీ’నుద్దేశించి ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రసంగించారు. సభాస్థలికి హెలికాప్టర్‌లో చేరుకోవాల్సి ఉండగా ప్రతికూల వాతావరణం వల్ల ఆయన రాలేకపోయారు. హిమాచల్‌ప్రదేశ్‌లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి జైరాం ఠాకూర్‌ సొంత జిల్లాలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. కేంద్రంలో 8 ఏళ్ల క్రితం సంకీర్ణ సర్కార్లు కొనసాగాయని, అవి దృఢమైన నిర్ణయాలు తీసుకోలేకపోవడంతో మన దేశంపై అవిశ్వాసం ఏర్పడిందన్నారు. భాజపా అధికారంలోకి వచ్చిన తర్వాత సుస్థిరమైన పాలనకు గట్టి పునాదులు ఏర్పడ్డాయని, ఇప్పుడు సామాన్యుడు సహా అందరిలోనూ ప్రభుత్వంపై విశ్వాసం కలిగిందని తెలిపారు. ప్రపంచమంతా మనతో అనుసంధానాన్ని కోరుకుంటుందని వెల్లడించారు. భాజపా ప్రభుత్వం యువతకు అధిక ప్రాధాన్యమిచ్చిందని పేర్కొన్నారు. భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దుకోవాలన్న కలను వారు సాకారం చేస్తారన్న విశ్వాసాన్ని ప్రధాని మోదీ వ్యక్తం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని