‘మా రోబో’ను సృష్టించిన కూలీ.. దివ్యాంగురాలైన కుమార్తెకు అన్నం పెట్టేందుకు ఆవిష్కరణ

దినసరి కూలీగా జీవనం సాగిస్తున్న 40 ఏళ్ల బిపిన్‌ కదమ్‌కు దివ్యాంగురాలైన తన కుమార్తెకు నిత్యం భోజనం కలిపి తినిపించడం సమస్యగా మారింది. రెండేళ్ల క్రితం వరకూ ఆ బాధ్యత చూసుకున్న

Updated : 26 Sep 2022 06:56 IST

పణజి: దినసరి కూలీగా జీవనం సాగిస్తున్న 40 ఏళ్ల బిపిన్‌ కదమ్‌కు దివ్యాంగురాలైన తన కుమార్తెకు నిత్యం భోజనం కలిపి తినిపించడం సమస్యగా మారింది. రెండేళ్ల క్రితం వరకూ ఆ బాధ్యత చూసుకున్న ఆయన భార్య కూడా జబ్బుతో మంచాన పడడంతో ఈ సమస్యకు పరిష్కారం వెతుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఓ రోబో లాంటి పరికరాన్ని తయారు చేస్తే అదే తన కుమార్తెకు భోజనం పెట్టేందుకు సహకరిస్తుందని భావించాడు. దక్షిణ గోవాలోని పొండా తాలూకా బితోరా గ్రామానికి చెందిన కదమ్‌కు సాంకేతికతపై ఎలాంటి అవగాహనా లేదు. అయినా తన కుమార్తె ఎదుర్కొంటున్న సమస్యకు సాంకేతికతే ఒక పరిష్కారం చూపుతుందని భావించి ఏడాది క్రితం నుంచి రోబో లాంటి పరికరం కోసం అన్వేషించాడు. ఎక్కడా లభించకపోవడంతో తనకు తానే అలాంటి దానిని తయారు చేసేందుకు పూనుకున్నాడు. నిత్యం 12 గంటల పాటు ఇతర పనులు చేసుకొని ఆ తరవాత మిగిలిన సమయంలో సాఫ్ట్‌వేర్‌పై అవగాహన పెంచుకున్నాడు. నాలుగు నెలలు శ్రమించి ఒక రోబోను తయారుచేసి దానికి ‘మా రోబో’ అని పేరు పెట్టాడు. పూర్తిగా వాయిస్‌ కమాండ్‌ కంట్రోల్‌ ఆధారంగా ఇది పనిచేస్తుంది. రోబో చేతిలో ఉండే పళ్లెంలో ఆహారం పెడితే అది అమ్మాయికి తినిపిస్తుంది. వాయిస్‌ కమాండ్‌ను వాడుకుంటూ.. ఆహారాన్ని కూరతో లేదా పప్పుతో కలిపి తినాలని భావిస్తోందా అన్నది ఆ అమ్మాయి తెలియజేస్తే .. ఆ రోబో ఆ విధంగానే పనిచేస్తుంది. ఈ ఆవిష్కరణను గోవా స్టేట్‌ ఇన్నోవేషన్‌ కౌన్సిల్‌ ప్రశంసించింది. ఈ పరికరాన్ని వాణిజ్య పరంగా ఉపయోగపడేలా తీర్చిదిద్దేందుకు ఆర్థిక సాయాన్ని కూడా అందిస్తోంది.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని