అంకితా భండారీ మృతదేహానికి అంత్యక్రియలు పూర్తి

ఉత్తరాఖండ్‌లో భాజపా నేత కుమారుడి చేతిలో హత్యకు గురైన 19 ఏళ్ల రిసెప్షనిస్టు అంకితా భండారీ హత్య కేసులో న్యాయం చేస్తామని సీఎం పుష్కర్‌సింగ్‌ ధామి హామీ ఇవ్వడంతో ఆదివారం

Published : 26 Sep 2022 04:58 IST

దేహ్రాదూన్‌: ఉత్తరాఖండ్‌లో భాజపా నేత కుమారుడి చేతిలో హత్యకు గురైన 19 ఏళ్ల రిసెప్షనిస్టు అంకితా భండారీ హత్య కేసులో న్యాయం చేస్తామని సీఎం పుష్కర్‌సింగ్‌ ధామి హామీ ఇవ్వడంతో ఆదివారం ఎనిమిది గంటల పాటు రిషికేశ్‌-బద్రీనాథ్‌ జాతీయ రహదారిని దిగ్బంధనం చేసిన ఆందోళనకారులు శాంతించారు. తుది పోస్టుమార్టం నివేదిక వచ్చేవరకు మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించే ప్రసక్తే లేదన్న భండారీ కుటుంబసభ్యులూ తాజా హామీతో వెనక్కి తగ్గారు. సాయంత్రం అలకనంద నదీ తీరంలో అంత్యక్రియలు పూర్తి చేశారు. హరిద్వార్‌కు చెందిన భాజపా నేత వినోద్‌ ఆర్య కుమారుడు పులకిత్‌ ఆర్య నడుపుతున్న రిసార్టులో రిసెప్షనిస్టుగా పనిచేస్తున్న అంకిత ఈ నెల 18న అదృశ్యమయ్యారు. దీంతో ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రిసార్టులోని మరో ఇద్దరు ఉద్యోగులతో కలిసి తానే అంకితను హత్య చేసి, చీలా కాలువలో పడేశానని నిందితుడు పులకిత్‌ ఆర్య శుక్రవారం అంగీకరించారు. రాజకీయంగానూ ఈ హత్య ఉత్తరాఖండ్‌లో ప్రకంపనలు సృష్టించింది. దీంతో భాజపా కూడా వినోద్‌ ఆర్యను, ఆయన మరో తనయుడిని పార్టీ నుంచి బహిష్కరించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని