సంక్షిప్త వార్తలు(3)

దేశ రాజధాని ప్రాంతమైన దిల్లీలో పాలనాధికారుల సర్వీసులపై నియంత్రణ అధికారానికి సంబంధించి కేజ్రీవాల్‌ సర్కారు, కేంద్ర ప్రభుత్వం మధ్య నెలకొన్న వివాదంపై అయిదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం నవంబరు 9 నుంచి

Updated : 28 Sep 2022 06:29 IST

దిల్లీ ప్రభుత్వం-కేంద్రం వివాదంపై నవంబరు 9 నుంచి విచారణ 

అయిదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం వెల్లడి

దిల్లీ: దేశ రాజధాని ప్రాంతమైన దిల్లీలో పాలనాధికారుల సర్వీసులపై నియంత్రణ అధికారానికి సంబంధించి కేజ్రీవాల్‌ సర్కారు, కేంద్ర ప్రభుత్వం మధ్య నెలకొన్న వివాదంపై అయిదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం నవంబరు 9 నుంచి విచారణ జరపనుంది. ఈ కేసును రోజువారీగా చేపడతామని ధర్మాసనానికి నేతృత్వం వహిస్తున్న జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ మంగళవారంనాడు తెలిపారు. జస్టిస్‌ ఎం.ఆర్‌.షా, జస్టిస్‌ కృష్ణమురారి, జస్టిస్‌ హిమా కోహ్లి, జస్టిస్‌ పి.ఎస్‌.నరసింహ ఈ ధర్మాసనంలో సభ్యులు. ఈ కేసు విచారణ.. కాగిత రహిత (పేపర్‌ లెస్‌) విధానంలో కొనసాగనుంది.


భారత్‌లో కార్ల్‌ గుస్తాఫ్‌ ఆయుధ వ్యవస్థల తయారీ

ఇంటర్నెట్‌డెస్క్‌: స్వీడన్‌కు చెందిన అగ్రశ్రేణి రక్షణసంస్థ ‘సాబ్‌’ భారత్‌లో తయారీని ప్రారంభించనుంది. ఈ విషయాన్ని కంపెనీ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ గోర్జెన్‌ జాన్సన్‌ ధ్రువీకరించారు. ఇప్పటిదాకా ఈ సంస్థ మరే దేశంలోనూ తయారీ విభాగాలను ఏర్పాటు చేయలేదు. ఈ తయారీ విభాగంలో కార్ల్‌ గుస్తాఫ్‌ ఎం4 ఆయుధ వ్యవస్థలను నిర్మించనున్నారు. 2024 నుంచి వీటి తయారీ ప్రారంభమవుతుందని జాన్సన్‌ తెలిపారు. ఈ రైఫిల్‌ వ్యవస్థ ఏడు కిలోల బరువుండి సుమారు ఒక మీటరు పొడవు ఉంటుంది. దీనికి అత్యాధునిక టెలిస్కోప్‌ అమర్చి ఉండటంతో లక్ష్యాన్ని కచ్చితంగా గుర్తించవచ్చు. ఈ వ్యవస్థలో అత్యాధునిక ఫైర్‌ కంట్రోల్‌ వ్యవస్థలు కూడా ఉన్నాయి. వాహనాలు, నిర్మాణాలను ధ్వంసం చేయడానికి ఎం4ను వినియోగిస్తారు.


దిల్లీ ఎల్‌జీపై ఆ వీడియోలను 48 గంటల్లో తొలగించండి
ఆప్‌ నేతలకు దిల్లీ హైకోర్టు ఆదేశం

దిల్లీ: ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌).. దిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌(ఎల్‌జీ) వినయ్‌ కుమార్‌ సక్సేనా పరువుకు నష్టం కలిగేలా ఆయనపై చేస్తున్న ఆరోపణలను వెంటనే ఆపాలని దిల్లీ హైకోర్టు మంగళవారం మధ్యంతర ఆదేశాలు జారీచేసింది. అంతేకాకుండా ఎల్‌జీపై అవినీతి ఆరోపణలకు సంబంధించి ఇప్పటివరకు సోషల్‌ మీడియాలో పెట్టిన పోస్టులు, వీడియోలు, ట్వీట్లను 48 గంటల్లో తొలగించాలని స్పష్టం చేసింది. ఆప్‌ నేతలు చేసిన వ్యాఖ్యలు నిర్లక్ష్యపూరితంగా ఉన్నాయని తప్పుపట్టింది. ఆమ్‌ ఆద్మీ పార్టీకి చెందిన అతిషి సింగ్‌, సౌరభ్‌ భరద్వాజ్‌, దుర్గేశ్‌ పాఠక్‌, సంజయ్‌సింగ్‌, జాస్మిన్‌ షాలు తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారంటూ ఎల్‌జీ వీకే సక్సేనా దిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తనకు జరిగిన పరువు నష్టానికి రూ.2.5కోట్ల పరిహారం చెల్లించేలా ఆదేశాలు ఇవ్వాలని తన దావాలో కోరారు. దీనిపై ఇరు పక్షాల వాదనలు విన్న జస్టిస్‌ అమిత్‌ బన్సాల్‌.. ఈ వ్యవహారంలో ఎల్‌జీపై ఆప్‌ నేతలు ఆరోపణలు ఆపాలని సూచించారు.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని