ఈడబ్ల్యూఎస్‌ కోటాపై తీర్పు రిజర్వు

ఆర్థికంగా వెనుకబడిన వర్గాల (ఈడబ్ల్యూఎస్‌) వారికి విద్య, ఉద్యోగాల్లో 10% రిజర్వేషన్‌ కల్పించడం రాజ్యాంగబద్ధమేనా అన్నదానిపై విచారణ పూర్తికావడంతో.. సుప్రీంకోర్టు మంగళవారం తీర్పు రిజర్వు చేసింది. రాజ్యాంగ మౌలిక

Published : 28 Sep 2022 04:56 IST

సుప్రీంకోర్టులో ముగిసిన వాదనలు

దిల్లీ: ఆర్థికంగా వెనుకబడిన వర్గాల (ఈడబ్ల్యూఎస్‌) వారికి విద్య, ఉద్యోగాల్లో 10% రిజర్వేషన్‌ కల్పించడం రాజ్యాంగబద్ధమేనా అన్నదానిపై విచారణ పూర్తికావడంతో.. సుప్రీంకోర్టు మంగళవారం తీర్పు రిజర్వు చేసింది. రాజ్యాంగ మౌలిక నిర్మాణాన్ని ఈడబ్ల్యూఎస్‌ కోటా ఉల్లంఘిస్తోందని ఆరోపిస్తూ దాఖలైన దాదాపు 40 పిటిషన్లపై భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్‌ యు.యు.లలిత్‌ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం ఈ నెల 13 నుంచి ఆరున్నర రోజులపాటు వాదనలను ఆలకించింది. ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్‌ కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 103వ రాజ్యాంగ సవరణ చెల్లుబాటు కాదని పిటిషనర్ల తరఫున విద్యావేత్త మోహన్‌ గోపాల్‌తోపాటు రవివర్మ కుమార్‌, పి.విల్సన్‌ తదితర సీనియర్‌ న్యాయవాదులు వాదించారు. కేంద్రం తరఫున వాదనలు వినిపించిన అటార్నీ జనరల్‌ కె.కె.వేణుగోపాల్‌, సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా.. ఈ కోటాను సమర్థించారు. సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు (ఎస్‌ఈబీసీ) కేటాయించిన 50% కోటాను ఏమాత్రం కదల్చకుండానే ఈడబ్ల్యూఎస్‌ వారికి అదనంగా రిజర్వేషన్‌ కల్పించిన సంగతిని గుర్తుచేశారు. కాబట్టి అది రాజ్యాంగ మౌలిక నిర్మాణానికి వ్యతిరేకమేమీ కాదని స్పష్టం చేశారు. ధర్మాసనంలో జస్టిస్‌ దినేశ్‌ మహేశ్వరి, జస్టిస్‌ రవీంద్ర భట్‌, జస్టిస్‌ బేలా ఎం త్రివేది, జస్టిస్‌ జె.బి.పార్దీవాలా సభ్యులుగా ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని