Asha Parekh: అలనాటి అందం ఆశా పరేఖ్‌కు ‘దాదాసాహెబ్‌’

అందం.. అభినయం ఆమె సొంతం. 1960 - 70 దశకాల్లో హిందీ చిత్రసీమలో ఓ వెలుగు వెలిగిన కథానాయిక ఆశా పరేఖ్‌. అలనాటి ఈ సౌందర్యరాశికి సినీరంగంలో అత్యున్నత పురస్కారమైన

Published : 28 Sep 2022 05:54 IST

దిల్లీ: అందం.. అభినయం ఆమె సొంతం. 1960 - 70 దశకాల్లో హిందీ చిత్రసీమలో ఓ వెలుగు వెలిగిన కథానాయిక ఆశా పరేఖ్‌. అలనాటి ఈ సౌందర్యరాశికి సినీరంగంలో అత్యున్నత పురస్కారమైన దాదా సాహెబ్‌ ఫాల్కే అవార్డును 2020 ఏడాదికిగాను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 1942లో జన్మించిన ఆశా 1952లో ‘ఆస్మాన్‌’ చిత్రంతో బాలనటిగా వెండితెరకు పరిచయమయ్యారు. కథానాయికగా నటించిన తొలిచిత్రం ‘దిల్‌ దేకే దేఖో’ (1959) ఘనవిజయం సాధించడంతో నటిగా మళ్లీ వెనక్కి తిరిగి చూసుకోలేదు. ‘జబ్‌ ప్యార్‌ కిసీసే హోతా హై’, ‘ఫిర్‌ వహీ దిల్‌ లాయాహూ’, ‘లవ్‌ ఇన్‌ టోక్యో’, ‘దో బదన్‌’, ‘ఆయే దిన్‌ బహార్‌ కే’, ‘ఆయా సావన్‌ ఝూమ్‌కే’, ‘కటీ పతంగ్‌’ లాంటి చిత్రాలతో స్టార్‌ కథానాయికగా ఎదిగారు. రాజేశ్‌ఖన్నాతో కలిసి నటించిన ‘ఆన్‌ మిలో సజనా’ చిత్రంలోని ‘అచ్ఛాతో హమ్‌ చల్తేహై’ పాట ఆ రోజుల్లో పెద్ద హిట్‌. ఆశా నటించిన దాదాపు వంద సినిమాల్లో అత్యధికం వాణిజ్యపరంగా విజయవంతమైనవే. ఇందులో ఇరవైకి పైగా చిత్రాలు సిల్వర్‌, గోల్డెన్‌జూబ్లీలు ఆడటంతో ఆమెను ‘జూబ్లీ గర్ల్‌’ అని పిలిచేవారు. కేంద్ర ప్రభుత్వం 1992లో ఆశాను పద్మశ్రీ పురస్కారంతో గౌరవించింది. సెన్సార్‌ బోర్డుకు ఛైర్‌పర్సన్‌గా పనిచేసిన తొలి మహిళగా ఈమె నిలిచారు. అలనాటి యువత మనసులు దోచిన ఆశా పరేఖ్‌ అవివాహితగానే మిగిలిపోయారు. సెప్టెంబరు 30న జరిగే 68వ జాతీయ చలనచిత్ర పురస్కారాల ప్రదానోత్సవంలో ఈమెకు అవార్డు అందజేస్తారు.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts