విదేశీ డిగ్రీలతో అత్యుత్తమ ఉద్యోగాలు

విదేశాల్లో ఉన్నత విద్యనభ్యసించాలని ఆశపడుతున్న భారతీయ విద్యార్థుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఉద్యోగాల వేటలో ఉత్తమమైన అవకాశాలను అందిపుచ్చుకోవడానికి విదేశీ డిగ్రీలు బాగా ఉపయోగపడతాయని, పోటీలో అగ్రభాగాన

Published : 28 Sep 2022 06:08 IST

83% మంది భారతీయ విద్యార్థుల విశ్వాసమిదే: సర్వే

దిల్లీ: విదేశాల్లో ఉన్నత విద్యనభ్యసించాలని ఆశపడుతున్న భారతీయ విద్యార్థుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఉద్యోగాల వేటలో ఉత్తమమైన అవకాశాలను అందిపుచ్చుకోవడానికి విదేశీ డిగ్రీలు బాగా ఉపయోగపడతాయని, పోటీలో అగ్రభాగాన నిలబడేలా చేస్తాయని అత్యధిక మంది విశ్వసించడం దీనికి ప్రధాన కారణమని తెలుస్తోంది.  83 శాతం మంది భారతీయ విద్యార్థులు ఈ అభిప్రాయంతోనే ఉన్నారని లీప్‌ సంస్థ అధ్యయనం వెల్లడించింది. వార్షికాదాయం రూ.3 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు కలిగిన మధ్యతరగతి కుటుంబాల్లో 57శాతం మంది  పిల్లలు విదేశాల్లో చదువుకోవడానికే మొగ్గుచూపుతున్నారని ‘ది లీప్‌-ఐప్సోస్‌ స్ట్రాటెజీ స్టడీ అబ్రాడ్‌ అవుట్‌లుక్‌’ నివేదిక పేర్కొంది. మధ్యతరగతి కుటుంబాల్లో విదేశీ విద్య పట్ల ఆకర్షణ ఏ స్థాయిలో ఉందో విశ్లేషించింది. ‘2025నాటికి 20 లక్షల మందికిపైగా విద్యార్థులు తమ విదేశీ చదువుల ఆకాంక్షలను సాకారం చేసుకోవడానికి పరాయి దేశాలకు వెళ్తారు. అంతర్జాతీయ స్థాయి విద్య కోసం రూ.8లక్షల కోట్ల(100 బిలియన్‌ డాలర్లు)కు పైగా ఖర్చు చేస్తారు. విదేశీ విద్య మార్కెట్‌ అనేక రెట్లు వృద్ధి చెందనుంద’ని లీప్‌ సహ వ్యవస్థాపకుడు వైభవ్‌ సింగ్‌ తెలిపారు. అంతర్జాతీయ అనుసంధానత పెరగడం వల్ల ఇంగ్లీషేతర భాషల దేశాలకు వెళ్లే భారతీయ విద్యార్థులు 42శాతం మేర ఉంటారని అంచనా వేశారు. విశ్వవిద్యాలయాల ర్యాంకింగ్‌లు, ఉపకారవేతనాలు, జీవన వ్యయం తదితర అంశాలు విద్యార్థుల ప్రాధాన్యతలను ప్రభావితం చేయనున్నాయి. దీని కోసం విద్యా రుణాలపై అత్యధికంగా ఆధారపడుతున్నారని విశ్లేషించారు. విదేశీ విద్యకు వెళ్తున్న వారిలో మూడింట రెండు వంతుల మంది 18 నుంచి 24 ఏళ్ల లోపు వారే. 25 నుంచి 30 ఏళ్ల లోపు వారు 34శాతం మంది ఉంటున్నారని సర్వే నివేదిక వెల్లడించింది. విదేశీ విద్యకు వెళ్తున్న వారిలో 60శాతం మంది పురుషులు కాగా 39శాతం మంది మహిళలు. మిగిలిన ఒక్క శాతం మంది తమ జెండర్‌ వెల్లడించడానికి ఇష్టపడలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని